సాక్షి, న్యూఢిల్లీ: సంచలనం రేపిన ఏడేళ్ల ప్రద్యుమ్న ఠాకూర్ హత్యకేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన 11వ తరగతి విద్యార్థిని అదుపులోకి తీసుకుంది. పరీక్షలు వాయిదా వేసేందుకు అతడు చిన్నారి ప్రద్యుమ్నను హత్య చేసినట్టు కథనాలు వస్తున్నాయి. చిన్నారిపై లైంగిక దాడి జరిగిందని గతంలో పేర్కొనగా.. ఇప్పుడు అలాంటిదేమీ లేదని సీబీఐ అంటోంది.
గుర్గావ్‌లోని ప్రముఖ ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో సెప్టెంబర్ 8న ఏడేళ్ల చిన్నారి ప్రద్యుమ్న ఠాకూర్ కిరాతకంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్నస్కూల్ సీఈవో ర్యాన్ పింటో, అతని తల్లిదండ్రులు, స్కూల్ ఫౌండింగ్ చైర్మన్ అయిన ఆగస్టిన్ పింటో, ఎండీ గ్రేస్ పింటోలకు సుప్రీంకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ అదుపులోకి తీసుకున్న విద్యార్థికి ప్రద్యుమ్న హత్యకు సంబంధం ఏమిటి? అన్నది దర్యాప్తు సంస్థ ఇంకా స్పష్టం చేయడం లేదు. మరోవైపు తమ కొడుకు అమాయకుడని, అతనికి ఈ కేసుతో సంబంధం లేదని విద్యార్థి తల్లిండ్రులు అంటున్నారు. ‘సీబీఐ మంగళవారం రాత్రి నా కొడుకును అదుపులోకి తీసుకుంది. అతడు ఈ నేరాన్ని చేయలేదు. కేవలం గార్డెనర్‌కు, టీజర్లకు జరిగిన దారుణం గురించి చెప్పాడంతే’ అని విద్యార్థి తండ్రి తెలిపారు. కాగా, సీబీఐ బుధవారం అతన్ని జువైనెల్ బోర్డు ఎదుట హాజరు పరచబోతున్నట్టు తెలుస్తోంది. ప్రద్యుమ్న ఠాకూర్‌ను తానే హత్యచేసినట్టు ర్యాన్ స్కూల్ బస్ డ్రైవర్ అశోక్ కుమార్ ఇప్పటికే నేరాన్ని అంగీకరించాడు. కానీ అశోక్‌కుమార్ కుటుంబసభ్యులు మాత్రం అతన్ని కావాలనే ఇరికించారని ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment