కోరపళ్ల తుపాకులు | Special Training For Army Dogs | Sakshi
Sakshi News home page

కోరపళ్ల తుపాకులు

Published Tue, Oct 22 2019 5:33 AM | Last Updated on Tue, Oct 22 2019 5:37 AM

Special Training For Army Dogs - Sakshi

మనకు పోలీసుల, సైనికుల శిక్షణ మాత్రమే తెలుసు. వారు చేసే సాహసాలు తెలుసు. ప్రమాదాల్లో అర్పించే ప్రాణాలు తెలుసు. కాని వారితో సమానంగా వివిధ రక్షణ దళాలలో శునకాలు సేవలు అందిస్తాయి. త్యాగాలూ చేస్తాయి. కాకుంటే అవి పెద్దగా అందరికీ తెలియవు. పోలీసులకు, సైనికులకు శిక్షణ విభాగాలు ఉన్నట్టే ఈ దళాలతో పని చేసే శునకాలకు శిక్షణ ఇచ్చే విభాగం కూడా ఒకటి ఉంది. దానిని ‘ఇండియన్‌ ఆర్మీ రిమౌంట్‌ వెటర్నరి కోర్‌’ అంటారు. ఇది మీరట్‌లో ఉంది. ఇక్కడే భారత దేశంలోని సాయుధ రక్షణబృందాలకు అవసరమైన అశ్వాలకు, శునకాలకు శిక్షణ ఇస్తారు. ఇది కాకుండా బి.ఎస్‌.ఎఫ్‌.ఏ వాళ్ల ‘నేషనల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఫర్‌ డాగ్స్‌’ కూడా ఉంది. ఆయా రాష్ట్రాల పోలీసు విభాగాల కింద నడిచే ట్రయినింగ్‌ సెంటర్లూ ఉన్నాయి. ఇవన్నీ విధి నిర్వహణ కోసం, ప్రజా రక్షణ కోసం శునకాలకు శిక్షణ ఇచ్చి వాటి సేవలు తీసుకుంటాయి. సి.ఆర్‌.పి.ఎఫ్‌ వారి సరిహద్దు సేవల కోసం శిక్షణ పొందిన శునకాలు ఎక్కువ ప్రమాదకరమైన పరిస్థితుల్లో పని చేస్తాయి ∙పోలీసులు, సైనికులకు శిక్షణ ఉన్నట్టే డాగ్‌ స్క్వాడ్‌లో పని చేసే శునకాలకూ శిక్షణ ఉంటుంది.

∙ట్రాకర్‌ డాగ్స్‌ అంటే నిందితులు వాడిన వస్తువుల వాసనను బట్టి నిందితులను వెతుక్కుంటూ వెళ్లే శునకాలకు 36 వారాలు, పేలుడు పదార్థాలను గుర్తించడం కోసం 24 వారాలు, మాదక ద్రవ్యాలను గుర్తించడానికి 24 వారాలు, ప్రమాదాల్లో బాధితులను గుర్తించే శిక్షణ 24 వారాలు, అటవీ సంపద రక్షణకు పని చేసే వీలుగా 24 వారాలు... ఇలా శిక్షణ ఇస్తూ వెళతారు ∙ఈ శునకాలను ఉపయోగించే వ్యక్తిని (పోలీస్‌/సైనికుడు) డాగ్‌ హ్యాండ్లర్‌ అంటారు. డాగ్, డాగ్‌ హ్యాండ్లర్‌ ఒక జట్టుగా పని చేస్తారు. సైగలూ, శబ్దాలూ ఉపయోగించి డాగ్‌ హ్యాండ్లర్‌ వాటికి పనులు చెబుతాడు. డాగ్‌ హ్యాండ్లర్‌ జీతం 31 వేల నుంచి మొదలవుతుంది ∙మొరగడం కుక్క సహజ లక్షణం. కాని కొన్ని సందర్భాలలో అవి మొరగడం వల్ల శత్రువు అప్రమత్తం కావచ్చు. అందుకే వాటిని మొరగకుండా కూడా శిక్షణ ఇస్తారు ∙ఒక డాగ్‌ స్క్వాడ్‌ శునకం వృత్తి జీవితం 8 నుంచి 10 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత అవి రిటైర్‌ అవుతాయి. ఎన్నో సేవలు... భూకంపాలు, సునామీలు వచ్చినప్పుడు తప్పిపోయిన, శిథిలాల కింద చిక్కుకున్నవారిని ఎందరినో ఈ రక్షణ శునకాలు పసిగట్టి కాపాడాయి.

ప్రధాని, రాష్ట్రపతి వంటి వి.వి.ఐ.పిలు ప్రయాణించే దారులను ఈ శునకాలే మొదటగా ప్రయాణించి క్లియర్‌ చేస్తాయి. గతంలో భూటాన్‌ రాజుకు మన దగ్గర శిక్షణ పొందిన శునకాన్ని కాపలా కోసంగా ఇచ్చారు. రాజు మీద హత్యాయత్నం చేద్దామని వచ్చిన వ్యక్తి జారవిడిచిన రుమాలును వాసన పట్టిన శునకం కొన్ని మైళ్లు ప్రయాణించి మరీ ఆ దుండగుణ్ణి పట్టించింది. జమ్ము–కాశ్మీరు సరిహద్దుల్లో శత్రువు రాకను ఈ శునకాలే పసిగట్టి ఆచూకీ ఇస్తాయి. సి.ఆర్‌.పి.ఎఫ్‌ దళాలు తాజాగా తమ శునకాలకు కెమెరాలు బిగించడానికి నిర్ణయించాయి. వాటిని వదిలిపెట్టి శత్రుశిబిరాల వైపు చొచ్చుకెళ్లేలా చేసి అవి చూపిన దృశ్యాల ఆధారంగా దాడులు చేయొచ్చని ఆలోచన. తమ ధైర్యం, తెగువ, విశ్వాసంతో ఎన్నో శునకాలు ప్రజలను కాపాడటమే కాదు తమ ప్రాణాలు కూడా త్యాగం చేశాయి. వాటి త్యాగం చాలామందికి పట్టదు. పెద్దగా ప్రచారానికి నోచుకోదు. వీటిని కుక్కబతుకు కాదు. నిజంగా గొప్ప బతుకు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement