ట్యాక్సీ యాప్ లకు కళ్లెం
న్యూఢిల్లీ:యాప్ ఆధారిత ట్యాక్సీ రంగంలో ఉన్న ఉబర్, ఓలా, ట్యాక్సీ ఫర్ ష్యూర్ వంటి కంపెనీల సేవలకు ఢిల్లీలో కళ్లెం పడింది. ఈ తరహా కంపెనీల యాప్స్‌ను వినియోగించకుండా అడ్డుకట్ట వేయాలని ఢిల్లీ ప్రభుత్వ ప్రతిపాదన నేపథ్యంలో డీవోటీ(డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాం).. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ఐఎస్ పీ)కు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆయా ట్యాక్సీ సర్వీస్ ల యాప్ లపై నిషేధం విధించాలని కోరినట్లు డీవోటీ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. గత రెండు రోజుల క్రితమే ట్యాక్సీ యాప్ లపై చర్యలు తీసుకోవాల్సిందిగా లేఖ రాసినట్లు తెలిపారు. ఇన్ ఫార్మమేషన్ టెక్నాలజీ యాక్ట్ 69ఎ, 2000 మరియు ప్రజా రక్షణ నిబంధనలను వర్తింపచేస్తూ డీవోటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా సాంకేతిక పరమైన సమస్యల వల్లే ఈ యాప్ లపై నిషేధం విధించినట్లు ఐఎస్పీఏఐ ప్రెసిడెంట్ రాజేశ్ చారియా స్పష్టం చేశారు.
గతేడాది ఓ ప్రయాణికురాలి(25)పై ఉబర్ కంపనీకి చెందిన డ్రైవర్ అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ అత్యాచార సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం అనుమతుల్లేని వెబ్ ఆధారిత టాక్సీ కంపనీల సేవలపై నిషేధం విధించింది. అయితే ఉబర్, ఓలా కంపనీలు ఈ నిషేధాన్ని పట్టించుకోకుండా తమ సేవలను కొనసాగించాయి. ఈ సంచలనాత్మక సంఘటన జరిగిన తర్వాత ఉబర్ కంపనీ కొన్ని రోజుల పాటు తన సేవలను నిలిపివేసింది. కానీ, వెనువెంటనే రేడియో టాక్సీ లెసైన్స్ కోసం ఉబర్ కంపనీ దరఖాస్తు చేసుకుని జనవరిలో మళ్లీ సేవలను ప్రారంభించింది. దీంతో గత నాలుగు నెలల క్రితం డీవోటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఓ కమిటీ ట్యాక్సీ సర్వీస్ ల యాప్ లపై చర్యలకు శ్రీకారం చుట్టింది.