పాకిస్థాన్ పై భారత్ దాడి జరపడం అబద్ధమా? | doubt on Indian surgical strikes claim | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్ పై భారత్ దాడి జరపడం అబద్ధమా?

Published Tue, Oct 4 2016 4:00 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM

పాకిస్థాన్ పై భారత్ దాడి జరపడం అబద్ధమా?

పాకిస్థాన్ పై భారత్ దాడి జరపడం అబద్ధమా?

న్యూఢిల్లీ: పాకిస్థాన్ భూభాగంలోకి భారత సైనిక కమాండోలు చొచ్చుకుపోయి తీవ్రవాదుల లాంచ్ ప్యాడ్లపై దాడులు జరపడం, 38 మంది ఉగ్రవాదులను హతమార్చడం నిజమా, కాదా? అన్నది ప్రస్తుతం భారత్, పాక్ ప్రజలతోపాటు అంతర్జాతీయ సమాజాన్ని తొలుస్తున్న ప్రశ్న. దీనిపై సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది.

దాడులు జరిపినట్లు భారత్ పదే, పదే ప్రకటించడం, దాన్ని పదే పదే పాకిస్థాన్ ఖండించడం పట్ల అంతర్జాతీయ సమాజంలోను అనుమానాలు రేకెత్తుతున్నాయి. పాకిస్థాన్ కు కనువిప్పు కలిగేలా దాడులకు సంబంధించి రికార్డు చేసిన సాక్ష్యాధారాలను విడుదల చేయడమే మంచిదని సోషల్ మీడియాలో మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ సమాజం ముందు పాక్ పరువుతీసి మరింత ఏకాకిని చేయాలంటే సాక్ష్యాధారాలను విడుదల చేయడమే మంచిదని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా సూచిస్తున్నాయి.
 
పాకిస్థాన్ భూభాగంలోకి భారత సైనికులు చొచ్చుకుపోయి తీవ్రవాద స్థావరాలపై దాడులు జరపడం ఇదే మొదటిసారి కాదు. కాకపోతే బహిరంగంగా ప్రకటించడం మొదటిసారి. కార్గిల్ యుద్ధానంతరం 1998 నుంచి 2014 సంవత్సరాల మధ్య భారత సైనికులు అనేకసార్లు పాక్ భూభాగంలోకి చొచ్చుకుపోయి లక్షిత దాడులు జరిపారు. అలాంటిప్పుడు ఇప్పుడు దాడులు జరపకుండానే జరిపినట్లు బూటకపు ప్రకటనలు చేయాల్సిన అవసరం భారత్ కు లేదు. కానీ అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది.

ఇలాంటి దాడి జరిగినట్లు తమ దృష్టికి రాలేదని, భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య కశ్మీర్ కు ఇరువైపుల సైనిక కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన సైనిక పరిశీలక బృందం (యుఎన్ఎంజిఐపి) ప్రకటించడం అంతర్జాతీయంగాను, సాధారణంగా ఇలాంటి దాడులు జరిగినప్పుడు తీవ్రవాదుల మధ్య సంభాషణలు లేదా సందేశాలు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుందని, ఈసారి అలాంటివేవి జరగినట్లు బయటపడలేదని లక్షిత దాడులతో సంబంధంలేని  సైనిక, ఇంటిలెజెన్స్ వర్గాలు ప్రకటించడం దేశీయంగా అనుమానాలకు దారితీసింది.

38 మంది తీవ్రవాదులు హతమార్చడం సామాన్య విషయం కాదని, కచ్చితంగా ఈ విషయమై టెర్రరిస్టులు మధ్య చర్చ జరుగుతుందని, అలా జరగకుండా పాకిస్థాన్ ఐఎస్ఐ వర్గాలు ఉగ్రవాదులను నియంత్రించైనా ఉండాలని లేదా ఒకరిద్దరు మాత్రమే చనిపోతే ఎక్కువ మంది మరణించినట్లు భారత వర్గాలు ప్రకటించి ఉండాలని ఆ సైనిక, ఇంటెలిజెన్స్ వర్గాలు వ్యాఖ్యానించాయి. లక్షిత దాడులకు సంబంధించిన సాక్ష్యాధారాలను బయటపెట్టడం, పెట్టకపోవడం రాజకీయపరమైన నిర్ణయమని, ప్రస్తుతం సందిగ్ధత కొనసాగించడమే మంచిదని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని భద్రతా విశ్లేషకుడొకరు అభిప్రాయపడ్డారు.

పాకిస్థాన్ సైనికులు కార్గిల్లోకి చొచ్చుకువచ్చినప్పుడు అలాంటిదేమీ లేదని పాకిస్థాన్ ప్రభుత్వం బుకాయించింది. ఆ విషయాన్ని అంతర్జాతీయ సమాజం ముందు నిరూపించేందుకు అప్పటి భారత ప్రభుత్వం పాక్ జనరల్ పర్వేజ్ ముషారఫ్, అప్పటి పాక్ సైనిక దళాల ప్రధానాధికారి లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అజీజ్ మధ్య జరిగిన సంభాషణలను బయటపెట్టింది. వారి మధ్య జరిగిన సంభాషణలను భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ‘రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్’ రికార్డు చేసింది. పాకిస్థాన్ కు ఇప్పుడు కూడా అలాంటి షాకివ్వాలి అని భారతీయులు వాంఛిస్తున్నారు.

భారత దాడులు బూటకమని పాకిస్థాన్ వాదిస్తుందంటే భారత్ పై ప్రతీకార దాడులకు పాల్పడే ఉద్దేశం పాకిస్థాన్ కు లేదని, సాక్ష్యాధారాలను బయటపెట్టి ప్రతీకార దాడులకు పాక్ ను రెచ్చగొట్టడం ఎందుకని శాంతికాముకులు అంటున్నారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ నవంబర్ నెలలో పదవీ విరమణ చేస్తారని, ఈలోగా ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి.
 
భారత్ గత దాడులకు సాక్ష్యాలివిగో....
కార్గిల్ యుద్ధానంతరం కెప్టెన్ గుజిందర్ సింగ్ సూరి నాయకత్వాన 12వ బిహార్ బటాలియన్ కు చెందిన ఘటక్స్ (పదాతిదళం కమాండోలు) పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి లక్షిత దాడులు జరిపారు. ఆ దాడుల్లో గుజిందర్ సింగ్ వీర మరణం పొందారు. ఆ తర్వాత ఆయనకు ‘మహావీర్ చక్ర’ ప్రదానం చేశారు. 2000, మార్చి 2వ తేదీన పంజాబ్ సరిహద్దుల్లో 35 మంది సిక్కులను లష్కరే తోయిబా తీవ్రవాదులు హతమార్చగా, అందుకు ప్రతీకారంగా 9వ పారా మిలటరీ దళానికి చెందిన భారత సైనికులు ఓ మేజర్ నాయకత్వాన పాక్ భూభాగంలోకి చొరబడి 28 మంది టెర్రరిస్టులను, పాక్ సైనికులను హతమార్చారు. 9వ పారా మిలటరీ దళానికి శ్రీలంకలో ఎల్టీటీఈపై యుద్ధం చేసిన అనుభవం ఉన్న విషయం తెల్సిందే.

ఆ తర్వాత 2007, 2008 సంవత్సరాల్లో కూడా భారత్ సర్జికల్ దాడులు జరిపింది. పాకిస్థాన్ ముందుగానీ, అంతర్జాతీయ సమాజం ముందుగానీ భారత ప్రభుత్వం అధికారికంగా ఈ విషయాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు. ఇప్పుడు భారత్ వ్యూహం మార్చుకొని మొట్టమొదటిసారిగా దాడులు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. కనుక సాక్ష్యాధారాలను బయటపెట్టమని ప్రభుత్వానికి రాజకీయ ప్రత్యర్థులైన రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రివాల్ కూడా కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement