
శ్రీనగర్ : జనవరి నెలలో తప్పిపోయిన భారత ఆర్మీ జవాన్ హవల్దర్ రాజేంద్ర సింగ్ నేగి(36) మృతదేహాన్ని భారత సైన్యం కనుక్కొంది. దాదాపు ఎనిమిది నెలల తర్వాత శనివారం కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) సమీపంలో మంచు చరియల కింద ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని నేగి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. భారతీయ సైన్యం యొక్క 11 గర్హ్వాల్ రైఫిల్స్‌కు అనుబంధంగా ఉన్న నేగి, ఈ ఏడాది జనవరిలో కశ్మీర్‌లోని గుల్‌మార్గ్ ప్రాంతంలోని నియంత్రణ రేఖకు సమీపంలో విధుల్లో ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు భారీ మంచులో పడిపోవడంతో తప్పిపోయాడు.
అతని మృతదేహాన్ని కనుగొనడంలో విఫలమైన సైన్యం జూన్‌లో అతన్ని 'అమరవీరుడు' గా ప్రకటించి, ఈ విషయాన్ని జూన్ 21న నేగి కుటుంబ సభ్యులకు తెలియజేసింది. అయితే, అతని భార్య రాజేశ్వరి దేవి నేగిని అమరవీరుడిగా అంగీకరించడానికి నిరాకరించింది. తన భర్త మృతదేహాన్ని కళ్లతో చూసే వరకు అతను మరణించినట్లు భావించనని ఆమె తేల్చి చెప్పారు.
ఇదిలా ఉంటే శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేగి మృతదేహం లభించిన విషయాన్ని ఆతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. నేగి మృతదేహాన్ని శ్రీనగర్‌లోని మిలిటరీ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలియజేశారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఆదివారం సాయంత్రం నాటికి మృతదేహం డెహ్రాడూన్‌కు చేరుకుంటుందని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. డెహ్రాడూన్‌కు చెందిన నేగి..2001లో సైన్యంలో చేరారు. అతనికి భార్య,ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment