
ఛత్తీస్‌గఢ్‌లో మావోల పంజా
మందుపాతర పేలుడులో ఏడుగురు జవాన్ల బలి
సాక్షి, చింతూరు: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోమారు రెచ్చిపోయారు. సీఆర్‌పీఎఫ్ బలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని బుధవారం శక్తిమంతమైన మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో సీఆర్‌పీఎఫ్ 230 బెటాలియన్‌కు చెందిన ఏడుగురు జవాన్లు దుర్మరణం పాలయ్యారు. దంతెవాడ జిల్లా కౌకొండ పోలీస్ స్టేషన్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్ 230 బెటాలియన్‌కు చెందిన 30 మంది జవాన్లు మూడు వాహనాల్లో సెలవు అనంతరం దంతెవాడకు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో దంతెవాడ, సుక్మా రహదారిలోని మెలవాడ గ్రామం వద్ద జవాన్ల వాహనాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు భారీ మందుపాతరను పేల్చారు.
పేలుడు ధాటికి ఘటనా స్థలంలో 4 అడుగుల భారీ గొయ్యి ఏర్పడగా జవాన్లు ప్రయాణిస్తున్న టాటా-709 మినీట్రక్కు తునాతునకలైంది. అనంతరం మావోయిస్టులు సీఆర్‌పీఎఫ్ జవాన్లపై కాల్పులు కూడా జరిపారు. ఈ ఘటనలో సీఆర్‌పీఎఫ్ 230 బెటాలియన్‌కు చెందిన ఏఎస్‌ఐ విజయ్‌రాజ్, హెడ్ కానిస్టేబుళ్లు ప్రదీప్ తిర్కి, రంజన్‌దాస్, కానిస్టేబుళ్లు ఉదయ్‌కుమార్, దేవేంద్ర చౌరాసియా, ఆర్‌ఎన్ దాస్, కేదారుసులు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన మరికొందరు జవాన్లను దంతెవాడ ఆసుపత్రికి తరలించారు.
బస్తర్ ప్రాంతంలో తమ ఉనికిని చాటుకుంటున్న మావోయిస్టు దర్బా డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడుకు 20 కేజీల పేలుడు పదార్ధాన్ని వినియోగించి ఉండొచ్చని భావిస్తున్నారు. జవాన్ల ఆయుధాలను మావోలు తీసుకువెళ్లారన్న వాదనను సీఆర్‌పీఎఫ్ ఉన్నతాధికారి ఒకరు ఖండించారు. జవాన్లంతా సివిల్ డ్రెస్‌ల్లో ఉన్నారన్నారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో జవాన్లు ట్రక్కుల్లో ప్రయాణించడంపై ఉన్న నిషేధాన్ని ఉల్లంఘించడంపై, ఆయుధాలు లేకుండా వెళ్లడంపై సంస్థాగత దర్యాప్తు జరుపుతామని సీఆర్‌పీఎఫ్ ప్రకటించింది.