ఏపీ రెవెన్యూ లోటులో ప్రతి పైసా ఇస్తున్నాం
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రెవెన్యూ లోటులో ప్రతి పైసా చెల్లిస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ ఆయన మాట్లాడారు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రతి ఒక్క అంశాన్నీ తప్పనిసరిగా తాము నెరవేరుస్తామని, అందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు పూర్తిగా న్యాయం చేస్తామని, చట్టంలో ఉన్న అంశాలన్నింటినీ నెరవేరుస్తామని అన్నారు. రెవెన్యూ లోటుకు సంబంధించి గత ఏడాది ప్రతి ఒక్క రూపాయి ఇచ్చామని, ఈవాళ కూడా సరిపడ డబ్బులు ఇచ్చామని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తరఫున వివిధ సంస్థలకు ఇప్పటికే శంకుస్థాపనలు జరిగాయని గుర్తు చేశారు. ఐఐటీలు, ఐఐఎంలు.. ఇలా అన్నింటి విషయాలను ఆయన ప్రస్తావించారు. వీటికి సరిపడ నిధులను కూడా కేటాయించామని చెప్పారు. గత ఏడాది రెండు రకాల పన్ను రాయితీలు ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణకు సంబంధించి కూడా కొన్ని రాయితీలు ఇచ్చామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు గత ఏడాది మరికొన్ని నిధులు ఇచ్చామని తెలిపారు. బడ్జెట్‌మీద చర్చ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుపై మరింత స్పష్టత ఇచ్చామని జైట్లీ అన్నారు. నాబార్డు కింద నిధులను ఈ ప్రాజెక్టుకు కేటాయిస్తామన్నారు.