న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లపై చర్చించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 27న అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ప్రతిఏటా నిర్వహించే వార్షిక సమావేశాల్లో భాగంగా ఏడు జాతీయ పార్టీలు, 51 ప్రాంతీయ పార్టీలకు ఈసీ ఆహ్వానం పంపింది. ఈ విషయమై ఈసీ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. అఖిలపక్ష భేటీలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా(ఈవీఎం)ల విశ్వసనీయతతో పాటు చెల్లింపు వార్తలు, ఎన్నికల నియమావళి, రెచ్చగొట్టే ప్రసంగాలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలను ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహించాలని దాదాపు 17 ప్రతిపక్ష పార్టీలు ఈ భేటీలో కోరే అవకాశముందని వ్యాఖ్యానించారు. గతేడాది నిర్వహించిన హ్యాకథాన్‌లో ఈవీఎంలను ఎవ్వరూ హ్యాక్ చేయలేకపోయారన్న విషయాన్ని మరోసారి ప్రతిపక్షాల దృష్టికి తీసుకువస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment