ఈసీపై కస్సుమన్న కరుణానిధి
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై డీఎంకే అధినేత ఎం. కరుణానిధి స్పందించారు. ఎన్నికల సంఘం(ఈసీ)పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికార అన్నాడీఎంకేకు ఈసీ.. లొంగిపోయిందని, అనుకూలంగా పనిచేసిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో రూ. 570 కోట్లు పట్టుబడితే ఈసీ నుంచి ఎటువంటి సమాధానం లేదని వాపోయారు.
అవరకురిచ్చి, తంజావూరు అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల వాయిదాకు కారణమైన బీజేపీ, పీఎంకే ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు స్థానాల్లో ఎన్నికలు వాయిదా ఎన్ని సీట్లు గెలుస్తారని ఆయన ప్రశ్నించారు. మరోసారి వాయిదా వేస్తే ఆందోళనకు దిగుతానని కరుణానిధి హెచ్చరించారు.
అధికారంలోకి వస్తామని భావించిన కరుణానిధికి ఆశాభంగం ఎదురైంది. తమిళనాడు అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని డీఎంకే కూటమి 98 స్థానాలు గెల్చుకుంది. జయలలిత నాయకత్వంలోని అన్నాడీఎంకే 134 సీట్లలో విజయం సాధించి అధికారం నిలబెట్టుకుంది.