Tamil Nadu Assembly election
-
ఓటు వేయకపోవడానికి కారణం ఇదే: పార్థిబన్
సాక్షి, చైన్నై: రాష్ట్ర శాసనసభ ఎన్నికలు మంగళవారం జరిగిన విషయం తెలిసిందే. అయితే అతి తక్కువ మంది చిన్ని తారలు ఓటు వేయలేకపోయారు. అందులో నటుడు, దర్శకుడు పార్థిబన్ ఒకరు. కాగా పార్థిబన్ ఓటు హక్కును వినియోగించుకోకపోవడానికి గల కారణాన్ని బుధవారం ట్విట్టర్ ద్వారా వివరించారు. అందులో ఆయన పేర్కొంటూ తాను ఇటీవల కోవిడ్ వ్యాక్సిన్‌ను రెండవ సారి వేసుకున్నానన్నారు. అయితే వ్యాక్సిన్ కారణంగా ఎలర్జీ కలిగి ముఖమంతా వాచిపోయిందన్నారు. దీంతో తన ఫొటోలు వైద్యులకు పంపి వైద్య చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ కారణంగానే తాను ఓటు హక్కును వినియోగించుకోలేకపోయానని వివరించారు. అయితే అందరూ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని, అతి కొద్ది మందికి మాత్రమే వ్యాక్సిన్ కారణంగా ఎలర్జీ కలుగుతుందని, తనకు ఇంతకు ముందే ఎలర్జీ సమస్య ఉండడంతో ఇలా జరిగిందని పార్థిపన్ తెలిపారు. చదవండి: అలా అనుకున్నాను కాబట్టే ఇంత దూరం వచ్చా! -
లోక్‌సభ బరిలో లేను
సాక్షి, చెన్నై: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేయడం లేదని ప్రముఖ నటుడు రజనీకాంత్ స్పష్టం చేశారు. అలాగే తాను ఏ పార్టీకి కూడా మద్దతు తెలపడం లేదని అన్నారు. తమిళనాడు నీటి సంక్షోభాన్ని ఏ పార్టీ శాశ్వతంగా పరిష్కరిస్తుందని భావిస్తున్నారో దానికే ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఏడాది క్రితమే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన రజనీకాంత్..రజనీ మక్కల్ మంద్రమ్ అనే వేదికను ఏర్పాటుచేసి తన మద్దతుదారులు, అభిమానులలో విస్తృతంగా సంప్రదింపులు జరుపుతున్న సంగతి తెలిసిందే. ‘సార్వత్రిక ఎన్నికల్లో నేను పోటీచేయడంలేదు. మన లక్ష్యం అసెంబ్లీ ఎన్నికలే. నేను ఎవరికీ మద్దతివ్వడం లేదు. ప్రచార సమయంలో నా ఫొటోగానీ, సంస్థ జెండాను గానీ ఎవరూ వాడొద్దు’ అని ఆదివారం తన నివాసంలో రజనీ మక్కల్ మంద్రమ్ జిల్లా కార్యదర్శులతో జరిగిన కార్యక్రమంలో రజనీకాంత్ ప్రకటించారు. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికలు, పార్టీ ఏర్పాటు, సినిమాలు తదితరాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. 2020 ఆగస్టు నెలలో పార్టీని ఏర్పాటుచేద్దామని, ఆ తరువాత చాలా మంది పెద్దలు తమ పార్టీలో చేరతారని, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకుంటామని ఆయన కార్యకర్తల్లో ఉత్సాహం నింపినట్లు తెలిసింది. -
‘మెజారిటీ గుండ్లు’ కొట్టించిన ఎమ్మెల్యే
సాక్షి ప్రతినిధి, చెన్నై: కోరిక నెరవేరితే మన తలనీలాలు ఇస్తామని మనం దేవుడికి మొక్కుకుంటే ఓకే. అలాకాకుండా మన జుట్టుపై మరొకరు మొక్కుకుంటే? అదే జరిగింది తమిళనాడులో. ఇటీవలి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సేలం జిల్లా గెంగవళ్లి నుంచి అన్నాడీఎంకే అభ్యర్థి మరుదముత్తు విజయం సాధించారు. డీఎంకే అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురై ఓటమి భయం పట్టుకోవడంతో తాను ఎంత మెజార్టీతో గెలిస్తే అంతమందికి గుండ్లు కొట్టిస్తానని దేవుడికి మొక్కుకున్నాడు. ఆయన డీఎంకే అభ్యర్థిపై 1,185 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. ఇక ఊరంతా తిరిగి తనతోపాటు గుండు కొట్టించుకోవడానికి 1,185 మందిని ఒప్పించాడు. వారందరినీ చెన్నిమలై బాలమురుగన్ గుడికి తీసుకెళ్లి తలనీలాలు సమర్పింపజేసి మొక్కు తీర్చుకున్నాడు. -
లెక్కల చిట్టా విప్పిన కరుణానిధి
చెన్నై: తమిళనాడులో స్వల్ప తేడాతో తాము అధికారం కోల్పోయామని డీఎంకే అధినేత ఎం కరుణానిధి తెలిపారు. తమ పార్టీకి, అధికార అన్నాడీఎంకేకు మధ్య ఓట్ల తేడా 1.1 శాతం మాత్రమేనని ఆయన వెల్లడించారు. ప్రజల తీర్పును గౌరవిస్తామని, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని చెప్పారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల వివరాలను ఆదివారం ఆయన వెల్లడించారు. తమ పార్టీ కంటే అన్నాడీఎంకే కు 4,41,646 ఓట్లు ఎక్కువ వచ్చాయని తెలిపారు. అన్నాడీఎంకే, దాని మిత్రపక్షాలకు 1,76,17,060 ఓట్లు రాగా, డీఎంకే కూటమికి 1,71,75,374 ఓట్లు వచ్చాయని వెల్లడించారు. కేవలం 1.1 శాతం ఓట్ల స్వల్ప తేడాతో తాము అధికారం కోల్పోయామని, ఇది వాస్తవమని కరుణానిధి ఒక ప్రకటనలో తెలిపారు. 172 స్థానాల్లో ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోటీ జరగ్గా డీఎంకే 89, అన్నాడీఎంకే 83 సీట్లు గెలిచాయన్నారు. కాంగ్రెస్, ఐయూఎంఎల్ సహా తమ కూటమిలో ఉన్న పార్టీలు పోటీ చేసిన 60 స్థానాల్లో అన్నాడీఎంకే 51 సీట్లు కైవసం చేసుకుందని వివరించారు. దీన్నిబట్టి చూస్తే ప్రజలు తమకు మద్దతు పలికారని అన్నారు. అయితే మిత్రపక్షాలను తాము తప్పుబట్టడం లేదన్నారు. డీఎంకే కూటమి మొత్తం 98 సీట్లు గెలవగా కరుణానిధి పార్టీ 89, కాంగ్రెస్ 8, ఐయూఎంఎల్ ఒక్క సీటు దక్కించుకున్నాయి. -
మూడో కూటమిని నమ్మని తంబి!
విజయ్‌కాంత్, వాసన్ల వల్లే మట్టికరిచామంటున్న పీడబ్ల్యూఎఫ్ నేతలు చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మూడో కూటమి ప్రభావం బలంగా ఉంటుందని రాజకీయ పరిశీలకులు ఎన్నికలకు ముందు అంచనా వేశారు. అధికార అన్నా డీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత అవినీతి కేసులో కొద్ది కాలం జైలుకు వెళ్లి రావటంతో పాటు పలు ఇతర ఆరోపణలు, వైఫల్యాల విమర్శల మధ్య గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోందని.. ప్రతిపక్ష డీఎంకే గత పాలనలో అవినీతి ఆరోపణల నుంచి ఇంకా బయటపడలేక క్లిష్ట పరిస్థితుల్లోనే ఉందని.. ఈ క్రమంలో ప్రధాన ద్రవిడ పార్టీలు రెండిటినీ వ్యతిరేకించే వారు.. కెప్టెన్ విజయ్‌కాంత్ సారథ్యంలోని డీఎండీకేతో కూడిన ప్రజా సంక్షేమ వేదిక (పీడబ్ల్యూఎఫ్)ను ప్రత్యామ్నాయంగా ఎంచుకునే అవకాశముందని భావించారు. 2011 ఎన్నికల్లో అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన డీఎండీకే దాదాపు 8 శాతం ఓట్లతో 29 సీట్లు గెలుచుకుంది. సీట్ల సంఖ్యలో డీఎంకే సైతం విజయ్‌కాంత్ పార్టీ తర్వాత మూడో స్థానానికి పడిపోయింది. అనంతర పరిణామాల్లో విజయ్‌కాంత్ విపక్ష నాయకుడయ్యారు. ఈ అంశాలన్నీ ఈసారి ఆయనపై అంచనాలు పెరగటానికి కారణమయ్యాయి. మహామహులు మట్టికరిచారిలా... ఈ ఎన్నికల్లో తొలుత ఏ ప్రధాన పార్టీతోనూ పొత్తు పెట్టుకోవటానికి నిరాకరించిన విజయ్‌కాంత్ చివరికి పీడబ్ల్యూఎఫ్‌తో కలసి ఆ కూటమి సీఎంగాఅభ్యర్థిగా రంగంలోకి దిగారు. ప్రధాన పార్టీలు రెండిటికీ స్పష్టమైన ఆధిక్యం రాని పక్షంలో విజయ్‌కాంత్ కింగ్ మేకర్ అవుతారనుకున్నారు. కానీ వాస్తవం వేరేలా ఉంది. డీఎండీకేతో పాటు పీడబ్ల్యూఎఫ్ పక్షాలైన ఎండీఎంకే(వైకో), వీసీకే (తిరుమాళవన్), టీఎంసీ(జి.కె. వాసన్) లెఫ్ట్ దారుణంగా మట్టికరించింది. ఏ పార్టీకీ ఒక్క సీటూ లభించలేదు కెప్టెన్ సైతం ఉలుండూర్పేటలో డిపాజిట్ కోల్పోయి ఘోరంగా ఓడారు. ఆయనకు మూడో స్థానం లభించింది. వారి రాకతో విశ్వాసం కోల్పోయాం: ఎండీఎంకే అధినేత వైకో తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయటం లేదని నామినేషన్ల రోజు ప్రకటించటం.. తమ కూటమిపై ప్రజావిశ్వాసాన్ని దెబ్బ తీసిందని సీపీఎం నేత ఒకరన్నారు. వైకో తాను ఓడిపోతానన్న భయంతోనే వెన్నుచూపారని విమర్శించారు. అయితే.. విజయ్‌కాంత్, వాసన్‌లను కూటమిలో చేరటం వల్లే ప్రజలు తమను వ్యతిరేకించారని సీపీఎం నేత ఒకరు వ్యాఖ్యానించారు. ‘ప్రజలను తక్కువ అంచనా వేశాం. ఇతర మార్గాలన్నీ మూసుకుపోయిన తర్వాత మా దగ్గరకు వచ్చిన వారిద్దరినీ నమ్మటానికి జనం పిచ్చివాళ్లు కాదు. విజయ్‌కాంత్ చివరి నిమిషం వరకూ బీజేపీతోనూ డీఎంకేతోనూ చర్చలు జరుపుతున్నారన్న విషయం అందరికీ తెలుసు. వాసన్ కూడా పొయస్ గార్డెన్ (జయనివాసం) ఎదుట పడిగాపులు పడటం జనం చూశారు. జయలలిత ఆయనకు సీటు ఇవ్వటానికి నిరాకరించిన తర్వాత వాసన్ మా దగ్గరకు వచ్చి చేరారు’ అని పేర్కొన్నారు. డబ్బు పెట్టలేకపవటమూ కారణమే..! సంపూర్ణ మద్య నిషేధం, రైతులకు విదేశీ ప్రయాణాలు వంటి ఈ కూటమి హామీలు అవాస్తవికమని ప్రజలకర్థమయింది. కూటమి అభ్యర్థులు మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు. పోటీ కోసం ఆస్తులను అమ్ముకున్నారు. అన్నా డీఎంకే, డీఎంకే అభ్యర్థులు రూ. 4 నుంచి రూ. 10 కోట్లు ఖర్చు చేస్తే.. వీరు ఖర్చు చేసింది నియోజకవర్గానికి రూ. 40 లక్షలు మాత్రమేనని సంబంధిత వర్గాలు చెప్పుకొస్తున్నాయి. డీఎంకే ఎందుకు గెలవలేకపోయింది? తమిళ ఓటరు 30 ఏళ్ల తర్వాత తొలిసారి అధికార పార్టీనే మళ్లీ గెలిపించారు. ఇది.. ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న డీఎంకేని దిగ్భ్రాంతికి గురిచేసింది. వాస్తవానికి పోలింగ్ రోజున ప్రకటించిన పలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు సైతం డీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుందనే అంచనాలు వేశాయి. కానీ.. గత ఎన్నికలకన్నా ఈ ఎన్నికల్లో కరుణ పార్టీ బలపడినప్పటికీ.. అధికారంలోకి వస్తామన్న ఆశలు తలకిందులయ్యాయి. బలమైన పొత్తు లేకపోవటం.. రాష్ట్రంలో ప్రత్యేకించి ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా లేని పరిస్థితుల్లో విపక్షం స్థానిక పార్టీలను కలుపుకుని బలమైన కూటమిని కూడగట్టి అధికారంలోకి వచ్చిన ఉదంతాలు గతంలో ఉన్నాయి. 2001లో జయ కాంగ్రెస్, టీఎంసీ, పీఎంకే, లెఫ్ట్‌తో జట్టుకట్టి అధికారంలోకి వచ్చారు. 2006లో డీఎంకే కూడా కూటమి కట్టి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా డీఎండీకే వంటి ప్రాంతీయ పార్టీలను కూడగట్టుకుని బరిలోకి దిగితే ఫలితాలు వేరేలా వచ్చే అవకాశముండేదని అంచనా వేస్తున్నారు. సీఎంగా జయ తెచ్చిన పథకాలు అద్భుతం చేసినట్లు కనిపిస్తోంద చెప్తున్నారు. చౌక ధరల క్యాంటీన్లు, తాగునీరు, మందులు, బస్సులు, సిమెంటు, ఇంటి నిర్మాణం, ఉచిత మేకలు, ఆవులు, గ్రైండర్ల వంటి విద్యుత్ పరికరాల పంపిణీ వంటివి ‘అమ్మ’కు అనుకూలంగా పనిచేసినట్లుగా అంచనా వేస్తున్నారు. డీఎంకే పైన, మిత్రపక్షమైన కాంగ్రెస్‌పైన వచ్చిన అవినీతి ఆరోపణలు, దర్యాప్తులు.. పార్టీ అవకాశాలను దెబ్బతీశాయని పరిశీలకులు చెప్తున్నారు. కరుణ కుమారుడు స్టాలిన్‌ను నిర్ణయాత్మక నేతగా ముందుకు తెచ్చి, సీఎం అభ్యర్థిగా ప్రకటించి.. ప్రభుత్వ మార్పు కోసం ప్రచారం చేసినట్లయితే మరింత మెరుగైన ఫలితాలు వచ్చేవని భావిస్తున్నారు. -
ఈసీపై కస్సుమన్న కరుణానిధి
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై డీఎంకే అధినేత ఎం. కరుణానిధి స్పందించారు. ఎన్నికల సంఘం(ఈసీ)పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికార అన్నాడీఎంకేకు ఈసీ.. లొంగిపోయిందని, అనుకూలంగా పనిచేసిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో రూ. 570 కోట్లు పట్టుబడితే ఈసీ నుంచి ఎటువంటి సమాధానం లేదని వాపోయారు. అవరకురిచ్చి, తంజావూరు అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల వాయిదాకు కారణమైన బీజేపీ, పీఎంకే ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు స్థానాల్లో ఎన్నికలు వాయిదా ఎన్ని సీట్లు గెలుస్తారని ఆయన ప్రశ్నించారు. మరోసారి వాయిదా వేస్తే ఆందోళనకు దిగుతానని కరుణానిధి హెచ్చరించారు. అధికారంలోకి వస్తామని భావించిన కరుణానిధికి ఆశాభంగం ఎదురైంది. తమిళనాడు అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని డీఎంకే కూటమి 98 స్థానాలు గెల్చుకుంది. జయలలిత నాయకత్వంలోని అన్నాడీఎంకే 134 సీట్లలో విజయం సాధించి అధికారం నిలబెట్టుకుంది. -
విజయ్ కాంత్ కు మరో గండం!
చెన్నై: కుంటి కుక్కపై కొబ్బరి బొండం పడినట్టుగా తయారైంది డీఎండీకే నేత విజయ్ కాంత్ పరిస్థితి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన 'కెప్టెన్' పార్టీకి మరో గండం పొంచివుంది. ఆయన పార్టీ గుర్తింపు రద్దయ్యే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించిన విజయ్ కాంత్ తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. ప్రజా సంక్షేమ కూటమి(పీడబ్ల్యూపీ)తో జట్టు కట్టిన ఆయన ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయారు. ఆయన కూడా ఓటమి పాలయ్యారు. డీఎండీకే పార్టీకి కేవలం 2.4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్ర పార్టీగా ఎన్నికల సంఘం గుర్తింపు పొందాలంటే కనీసం 6 శాతం ఓట్లు కలిగివుండాలి. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన డీఎండీకే 29 సీట్లు దక్కించుకుంది. ఈసారి పరిస్థితి తారుమారైంది. డీఎండీకేతో పొత్తుకు డీఎంకే ప్రయత్నించినా ఫలించలేదు. కరుణానిధితో 'కెప్టెన్' చేతులు కలిపితే ఫలితాలు మరోలా ఉండేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఓటమి గల కారణాలను సమీక్షించుకుంటామని, తమ పరాజయానికి మనీ పవర్ ప్రధాన కారణంగా భావిస్తున్నామని మాజీ ఎంపీ కె. ధనరాజు తెలిపారు. -
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో నామినేషన్ల సందడి
చెన్నై: తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు శుక్రవారం ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల దాఖలుకు ఏప్రిల్ 29 చివరితేదీ కాగా, ఏప్రిల్ 30న పరిశీలిస్తారు. మే 2 వరకూ ఉపసంహరించుకోవచ్చు. మే 16న ఎన్నికలు నిర్వహించి, 19న ఓట్లను లెక్కిస్తారు. తమిళనాడులో 234 స్థానాల్లో 5.6 కోట్ల మంది ఓటేయనున్నారు. పుదుచ్చేరిలో 30 స్థానాలుండగా, 9,48,717 మంది ఓటర్లున్నారు. కేరళలో 2.5 కోట్ల మం ఓటర్లుండగా 140 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో 122 నామినేషన్లు దాఖలయ్యాయి. బెంగాల్లో సీపీఎం కార్యకర్తల హత్య కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ జిల్లా లోద్నాలో ఎన్నికల తర్వాత జరిగిన హింసలో ఇద్దరు సీపీఎం కార్యకర్తలు మరణించారు. ఎస్.కె.ఫజల్ హక్యూ, దుఖిరాం దాల్లు గురువారం రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా దుండగులు హత్య చేశారు. -
సీవీ ఆనంద్‌కు కీలక బాధ్యతలు
♦ తమిళనాడు, పాండిచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రత్యేక పరిశీలకునిగా నియామకం ♦ ఈ అవకాశం దక్కించుకున్న తొలి ఐపీఎస్‌గా గుర్తింపు సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌కు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడు, పాండిచ్చేరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రత్యేక పరిశీలకునిగా నియమిస్తూ భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన ఆయా రాష్ట్రాల్లో విధులు నిర్వర్తించేందుకు ఆనంద్ బుధవారం బయలుదేరి వెళ్లారు. సాధారణంగా ప్రత్యేక పరిశీలకులుగా ఐఏఎస్ అధికారులను నియమించే ఈసీఐ... దేశంలో తొలిసారిగా ఓ ఐపీఎస్ అధికారిని నియమించడం విశేషం. దీనిపై తెలంగాణలోని పోలీసు వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. 2014లో తెలంగాణలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి రూ.25 కోట్లు సీజ్ చేసిన ఆనంద్‌కు ఈసీఐ ‘బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్’ అవార్డును కూడా ప్రదానం చేసింది. ఢిల్లీలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల అధికారుల సమావేశంలో ఆనంద్‌ను ప్రత్యేక ఆహ్వనితుడిగా పిలిపించి ఎన్నికల్లో అక్రమ నగదు, మద్యం పంపిణీ, ప్రశాంత నిర్వహణ తదితర అంశాలపై పాఠాలు చెప్పించింది. తాజాగా ఈఎస్ఐ ప్రత్యేక పరిశీలకునిగా ఆనంద్‌ను నియమించింది. ఈసీఐ ఆదేశాల మేరకు ఆయన తమిళనాడు, పాండిచ్చేరిలలో ఐదు రోజుల పాటు పర్యటించి స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్, ఫ్లయింగ్ స్క్వాడ్లు, వాహనాలకు జీపీఎస్, బూత్ స్థాయి అవగాహన గ్రూప్‌లు, సీపీఎంఎఫ్, ఎక్సైజ్, బ్యాంకింగ్ లావాదేవీలు, పెయిడ్ న్యూస్ తదితరాలను సంబంధిత బృందాలు ఎలా నియంత్రిస్తున్నాయో పరిశీలించి నివేదిక సమర్పిస్తారు. ఈసీఐ తనకు ఈ బాధ్యతలు అప్పగించడం గౌరవంగా భావిస్తున్నానని ఆనంద్ చెప్పారు. -
రాష్ట్రంలో 5.79 కోట్ల ఓటర్లు
తమిళనాడు చట్టసభ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 5.79 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లుగా ఈ జాబితాలో పేర్కొన్నారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడు చట్టసభ గడువు మే 22వ తేదీతో ముగియనుంది. గడువు ముగిసిపోక ముందే చట్టసభకు ఎన్నికలను నిర్వహించి కొత్త ప్రభుత్వాన్ని కూర్చొబెట్టాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉంది. మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. తేదీ నిర్ణయం కోసం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) బృందం ఢిల్లీ నుంచి త్వరలో చెన్నై చేరుకోనుంది. అన్నిపార్టీల నేతలతో సీఈసీ సమావేశమై అభిప్రాయాలను సేకరించనుంది. ఎన్నికల ఏర్పాట్లను ముమ్మరం చేయడంలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజేష్ లఖానీ జిల్లా కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులతో తరచూ సమావేశం అవుతున్నారు. ఈ సమావేశాలు ఈనెలాఖరు వరకు సాగుతాయి. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఓటర్ల జాబితాను ఈసీ విడుదల చేసింది. ఈనెల 1వ తేదీ నాటికి 18 ఏళ్లు పూర్తయిన వారు ఓటరు గుర్తింపుకార్డు కోసం తమ పేర్లను నమోదుచేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇంతవరకు నమోదు చేసుకోనివారు,పేర్ల తొలగింపు, చిరునామా తదితర మార్పులకు గత ఏడాది అక్టోబరు వరకు అవకాశం ఇచ్చారు. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా 21 లక్షల మంది కొత్తగా పేర్లను నమోదుకు, తొలగింపుకు దరఖాస్తు చేసుకున్నారు. కొత్త ఓటర్లతో కూడిన జాబితాను జనవరి 5వ తేదీన ప్రకటిస్తామని గతంలో ఈసీ ప్రకటించింది. అయితే చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, కడలూరు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా ఓటర్ల జాబితా విడుదల వాయిదా పడింది. జనవరి 20వ తేదీన ప్రకటిస్తామని ఎన్నికల కమిషనర్ రాజేష్ లఖానీ ప్రకటించిన మేరకు బుధవారం ఓటర్ల జాబితా విడుదల చేశారు. తమిళనాడులో 5 కోట్ల, 79 లక్షల, 72 వేల, 690 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇందులో పురుష ఓటర్లు 2 కోట్ల 88 లక్షలా 60వేలా 889 మంది, స్త్రీ ఓటర్లు 2 కోట్ల 91లక్షలా 7వేలా 418 మంది ఉన్నారు. హిజ్రాలు 4,383 మంది ఉన్నట్టు గుర్తించారు. 12.33 లక్షల మంది ఓటర్ల జాబితాలో కొత్తగా చేరారు. కొత్త ఓటర్లకు ఫోటో గుర్తింపుకార్డులు ముద్రణ దశలో ఉన్నాయి. పోలింగ్ బూత్‌ల ద్వారా వచ్చేనెల 10వ తేదీన అందజేస్తారు. చెన్నైలో 39 లక్షల ఓటర్లు: ఇదిలా ఉండగా, చెన్నైలో 39 లక్షలా 47వేలా 16 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 19 లక్షలా 62 వేలా 414 మంది పురుష ఓటర్లు, 19 లక్షలా 83వేలా 766 మంది స్త్రీ ఓటర్లు, 836 మంది హిజ్రా ఓటర్లు ఉన్నట్లుగా ప్రకటించారు. అలాగే కాంచీపురంలో 35 లక్షలా 80వేలా 967 మంది, తిరువళ్లూరులో 31 లక్షలా 60వేలా 562 మంది ఓటర్లు ఉన్నారు. షోళింగనల్లూరులో అత్యధిక ఓటర్లు: తమిళనాడులోని అన్ని నియోజకవర్గాల్లోకి కాంచీపురం జిల్లా షోళింగనల్లూరు నియోజకవర్గం అత్యధిక ఓటర్లతో రికార్డు సృష్టించింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 5 లక్షలా 75వేలా 773 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2 లక్షలా 91వేల 909 మంది, స్త్రీ ఓటర్లు 2 లక్షలా 83 వేలా 819 మంది, హిజ్రాలు 45 మంది ఉన్నారు. అలాగే 18-19 మధ్య వయస్సులోని యువ ఓటర్లు సైతం ఇదే నియోజకవర్గంలో అధికంగా ఉన్నారు. షోళింగనల్లూరు నియోజకవర్గంలో మొత్తం యువ ఓటర్లు 12,797 కాగా, వీరిలో పురుషులు 7294, స్త్రీ ఓటర్లు 5583 ఉన్నారు. అతి తక్కువ ఓటర్లున్న నియోజకవర్గంగా నాగపట్టినం జిల్లాలోని కీళ్ వేలూరును గుర్తింపు పొందింది. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు ఒక లక్షా 63వేలా 189 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 81వేల 38 మంది, స్త్రీ ఓటర్లు 82 వేల 151 మంది ఉన్నారు.ప్రత్యేక శిబిరాలు: ఓటర్ల సౌలభ్యం కోసం ప్రత్యేక శిబిరాలను నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. కొత్తగా పేర్ల నమోదు, తొలగింపు వంటి సేవల కోసం అన్ని మండల కార్యాలయాల్లో దరఖాస్తులు లభ్యం అవుతాయని ఈసీ రాజేష్ లఖానీ తెలిపారు. అలాగే ఈనెల 30వ తేదీ, వచ్చేనెల 6వ తేదీల్లో ప్రత్యేక ఓటర్ల శిబిరాలను నిర్వహిస్తున్నామని అన్నారు.