మూడో కూటమిని నమ్మని తంబి!
విజయ్‌కాంత్, వాసన్‌ల వల్లే మట్టికరిచామంటున్న పీడబ్ల్యూఎఫ్ నేతలు
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మూడో కూటమి ప్రభావం బలంగా ఉంటుందని రాజకీయ పరిశీలకులు ఎన్నికలకు ముందు అంచనా వేశారు. అధికార అన్నా డీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత అవినీతి కేసులో కొద్ది కాలం జైలుకు వెళ్లి రావటంతో పాటు పలు ఇతర ఆరోపణలు, వైఫల్యాల విమర్శల మధ్య గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోందని.. ప్రతిపక్ష డీఎంకే గత పాలనలో అవినీతి ఆరోపణల నుంచి ఇంకా బయటపడలేక క్లిష్ట పరిస్థితుల్లోనే ఉందని.. ఈ క్రమంలో ప్రధాన ద్రవిడ పార్టీలు రెండిటినీ వ్యతిరేకించే వారు.. కెప్టెన్ విజయ్‌కాంత్ సారథ్యంలోని డీఎండీకేతో కూడిన ప్రజా సంక్షేమ వేదిక (పీడబ్ల్యూఎఫ్)ను ప్రత్యామ్నాయంగా ఎంచుకునే అవకాశముందని భావించారు. 2011 ఎన్నికల్లో అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన డీఎండీకే దాదాపు 8 శాతం ఓట్లతో 29 సీట్లు గెలుచుకుంది. సీట్ల సంఖ్యలో డీఎంకే సైతం విజయ్‌కాంత్ పార్టీ తర్వాత మూడో స్థానానికి పడిపోయింది. అనంతర పరిణామాల్లో విజయ్‌కాంత్ విపక్ష నాయకుడయ్యారు. ఈ అంశాలన్నీ ఈసారి ఆయనపై అంచనాలు పెరగటానికి కారణమయ్యాయి.
మహామహులు మట్టికరిచారిలా... ఈ ఎన్నికల్లో తొలుత ఏ ప్రధాన పార్టీతోనూ పొత్తు పెట్టుకోవటానికి నిరాకరించిన విజయ్‌కాంత్ చివరికి పీడబ్ల్యూఎఫ్‌తో కలసి ఆ కూటమి సీఎంగాఅభ్యర్థిగా రంగంలోకి దిగారు. ప్రధాన పార్టీలు రెండిటికీ స్పష్టమైన ఆధిక్యం రాని పక్షంలో విజయ్‌కాంత్ కింగ్ మేకర్ అవుతారనుకున్నారు. కానీ వాస్తవం వేరేలా ఉంది. డీఎండీకేతో పాటు పీడబ్ల్యూఎఫ్ పక్షాలైన ఎండీఎంకే(వైకో), వీసీకే (తిరుమాళవన్), టీఎంసీ(జి.కె. వాసన్) లెఫ్ట్ దారుణంగా మట్టికరించింది. ఏ పార్టీకీ ఒక్క సీటూ లభించలేదు కెప్టెన్ సైతం ఉలుండూర్‌పేటలో డిపాజిట్ కోల్పోయి ఘోరంగా ఓడారు. ఆయనకు మూడో స్థానం లభించింది.
వారి రాకతో విశ్వాసం కోల్పోయాం: ఎండీఎంకే అధినేత వైకో తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయటం లేదని నామినేషన్ల రోజు ప్రకటించటం.. తమ కూటమిపై ప్రజావిశ్వాసాన్ని దెబ్బ తీసిందని సీపీఎం నేత ఒకరన్నారు. వైకో తాను ఓడిపోతానన్న భయంతోనే వెన్నుచూపారని విమర్శించారు. అయితే.. విజయ్‌కాంత్, వాసన్‌లను కూటమిలో చేరటం వల్లే ప్రజలు తమను వ్యతిరేకించారని సీపీఎం నేత ఒకరు వ్యాఖ్యానించారు. ‘ప్రజలను తక్కువ అంచనా వేశాం. ఇతర మార్గాలన్నీ మూసుకుపోయిన తర్వాత మా దగ్గరకు వచ్చిన వారిద్దరినీ నమ్మటానికి జనం పిచ్చివాళ్లు కాదు. విజయ్‌కాంత్ చివరి నిమిషం వరకూ బీజేపీతోనూ డీఎంకేతోనూ చర్చలు జరుపుతున్నారన్న విషయం అందరికీ తెలుసు. వాసన్ కూడా పొయస్ గార్డెన్ (జయనివాసం) ఎదుట పడిగాపులు పడటం జనం చూశారు. జయలలిత ఆయనకు సీటు ఇవ్వటానికి నిరాకరించిన తర్వాత వాసన్ మా దగ్గరకు వచ్చి చేరారు’ అని పేర్కొన్నారు.
డబ్బు పెట్టలేకపవటమూ కారణమే..!
సంపూర్ణ మద్య నిషేధం, రైతులకు విదేశీ ప్రయాణాలు వంటి ఈ కూటమి హామీలు అవాస్తవికమని ప్రజలకర్థమయింది. కూటమి అభ్యర్థులు మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు. పోటీ కోసం ఆస్తులను అమ్ముకున్నారు. అన్నా డీఎంకే, డీఎంకే అభ్యర్థులు రూ. 4 నుంచి రూ. 10 కోట్లు ఖర్చు చేస్తే.. వీరు ఖర్చు చేసింది నియోజకవర్గానికి రూ. 40 లక్షలు మాత్రమేనని సంబంధిత వర్గాలు చెప్పుకొస్తున్నాయి.
డీఎంకే ఎందుకు గెలవలేకపోయింది?
తమిళ ఓటరు 30 ఏళ్ల తర్వాత తొలిసారి అధికార పార్టీనే మళ్లీ గెలిపించారు. ఇది.. ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న డీఎంకేని దిగ్భ్రాంతికి గురిచేసింది. వాస్తవానికి పోలింగ్ రోజున ప్రకటించిన పలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు సైతం డీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుందనే అంచనాలు వేశాయి. కానీ.. గత ఎన్నికలకన్నా ఈ ఎన్నికల్లో కరుణ పార్టీ బలపడినప్పటికీ.. అధికారంలోకి వస్తామన్న ఆశలు తలకిందులయ్యాయి.
బలమైన పొత్తు లేకపోవటం.. రాష్ట్రంలో ప్రత్యేకించి ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా లేని పరిస్థితుల్లో విపక్షం స్థానిక పార్టీలను కలుపుకుని బలమైన కూటమిని కూడగట్టి అధికారంలోకి వచ్చిన ఉదంతాలు గతంలో ఉన్నాయి.
2001లో జయ కాంగ్రెస్, టీఎంసీ, పీఎంకే, లెఫ్ట్‌తో జట్టుకట్టి అధికారంలోకి వచ్చారు. 2006లో డీఎంకే కూడా కూటమి కట్టి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా డీఎండీకే వంటి ప్రాంతీయ పార్టీలను కూడగట్టుకుని బరిలోకి దిగితే ఫలితాలు వేరేలా వచ్చే అవకాశముండేదని అంచనా వేస్తున్నారు. సీఎంగా జయ తెచ్చిన పథకాలు అద్భుతం చేసినట్లు కనిపిస్తోంద చెప్తున్నారు. చౌక ధరల క్యాంటీన్లు, తాగునీరు, మందులు, బస్సులు, సిమెంటు, ఇంటి నిర్మాణం, ఉచిత మేకలు, ఆవులు, గ్రైండర్ల వంటి విద్యుత్ పరికరాల పంపిణీ వంటివి ‘అమ్మ’కు అనుకూలంగా పనిచేసినట్లుగా అంచనా వేస్తున్నారు. డీఎంకే పైన, మిత్రపక్షమైన కాంగ్రెస్‌పైన వచ్చిన అవినీతి ఆరోపణలు, దర్యాప్తులు.. పార్టీ అవకాశాలను దెబ్బతీశాయని పరిశీలకులు చెప్తున్నారు. కరుణ కుమారుడు స్టాలిన్‌ను నిర్ణయాత్మక నేతగా ముందుకు తెచ్చి, సీఎం అభ్యర్థిగా ప్రకటించి.. ప్రభుత్వ మార్పు కోసం ప్రచారం చేసినట్లయితే మరింత మెరుగైన ఫలితాలు వచ్చేవని భావిస్తున్నారు.