ఢిల్లీకి ‘కెప్టెన్’సేన | DMDK leader Vijaykanth to meet Prime Minister: Congress sources | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి ‘కెప్టెన్’సేన

Published Fri, Feb 14 2014 1:22 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

DMDK leader Vijaykanth to meet Prime Minister: Congress sources

డీఎండీకే అధినేత విజయకాంత్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం గురువారం ఢిల్లీకి బయలు దేరింది. శుక్రవారం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో ఈ బృందం భేటీ కానుంది. ఈ పర్యటన కెప్టెన్ రాజకీయ ఎత్తుగడకు వేదిక కాబోతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. 
 
 సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న డీఎండీకే ఓటు బ్యాంకు కోసం బీజేపీ, డీఎంకే, కాంగ్రెస్ తీవ్రంగానే కుస్తీలు పడుతున్నాయి. విజయకాంత్ మాత్రం ఎవరికీ చిక్కకుండా చకచకా ముందుకు కదులుతున్నారు. పార్టీ తరపు న ఎన్నికల బరిలో నిలబడే ఆశావహులతో ఇం టర్వ్యూలు ముగించారు. నాలుగు రోజుల పాటుగా జరిపిన ఇంటర్వ్యూల మేరకు నియోజకవర్గానికి ఇద్దరు అభ్యర్థుల చొప్పున ఎంపిక చేశారు. వీరి పనితీరు, వీరికున్న అన్ని రకాల బలం గురించి ఆయా జిల్లాల నేతల ద్వారా ఆరా తీసే పనిలో ఉన్న విజయకాంత్ హఠాత్తు గా ఢిల్లీ వెళ్లేందుకు నిర్ణయించారు. దీంతో ఈ పర్యటన రాజకీయ ఎత్తుగడలకు వేదిక కాబోతోందన్న సంకేతాలు ఆ పార్టీ శ్రేణుల నుంచే వెలువడుతున్నాయి. 
 
 సొంత  నియోజకవర్గాలతోపాటు స్వగ్రామాల్లో ఉన్న  ఎమ్మెల్యేలందరూ గురువారం ఉదయం పార్టీ కార్యాలయానికి చేరుకోవాలని విజయకాంత్ ఆదేశించారు. దీంతో ఉదయాన్నే ఎమ్మెల్యేలందరూ కోయంబేడుకు చేరుకున్నారు. ఎమ్మెల్యేలతో విజయకాంత్ భేటీ అయ్యారు. రాత్రి ఏడు గంటలకు 21 మంది ఎమ్మెల్యేలతో కలసి కెప్టెన్ విజయకాంత్ తన సతీమణి ప్రేమలత, బావమరిది సుదీష్‌ను వెంటపెట్టుకుని ఢిల్లీకి బయలు దేరారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలో ప్రధాని మన్మోహన్ సింగ్‌తో విజయకాంత్ బృందం భేటీ కానుంది. రాష్ట్రంలోని సమస్యలు, జాలర్ల సమస్య, ఈలం తమిళుల సమస్య, శ్రీలంకకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో తీర్మానం తదితర అంశాలపై చర్చించి, వినతి పత్రాన్ని సమర్పించబోతున్నారు. రాజకీయ భేటీకి ఆస్కారం ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఢిల్లీకి వస్తున్న విజయకాంత్‌ను తమ వైపు తిప్పుకోవడం లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు వ్యూహ రచనలు చేశారు. 
 
 పొత్తుకు మార్గం: కాంగ్రెస్, డీఎంకే, డీఎండీకేలు ఒకే వేదిక మీదకు వచ్చే రీతిలో పది జనపథ్ వేదికగా వ్యూహ రచనలు జరుగుతున్నారుు. బుధవారం డీఎంకే అధినేత ఎం కరుణానిధి గారాలపట్టి కనిమొళి కూడా జన్‌పథ్ మెట్లు ఎక్కారు. ఏఐసీసీ అధినేత్రి సోనియాతో భేటీ అయ్యారు. ఈ భేటీ అంతా పొత్తు వ్యవహారం చుట్టూ సాగినట్టు డీఎంకే వర్గాలు పేర్కొంటున్నారుు. విజయకాంత్ సైతం ఢిల్లీ వస్తుండటంతో ఆయన్ను టెన్ జన్‌పథ్ మెట్లు ఎక్కించేందుకు కసరత్తులు జరిగినట్టు సమాచారం. కేంద్ర మంత్రి జీకే వాసన్‌కు విజయకాంత్ సన్నిహితుడు కావడంతో ఆయన ద్వారానే ఈ ప్రయత్నాలు జరిగినట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. విజయకాంత్‌ను ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ ముకుల్ వాస్నిక్ తొలుత భేటీ అవుతారని, అనంతరం టెన్ జన్‌పథ్‌లో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్‌తో సమావేశం ఉంటుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అదే సమయంలో తమ నేత ఢిల్లీకి రమ్మంటే వెళ్తున్నామని, ఆయన మదిలో ఏమున్నదో తమకు ఇంత వరకు తెలియదంటూ ఓ ఎమ్మెల్యే పేర్కొనడం గమనార్హం. ప్రధానితో భేటీ వరకు తనకు తెలుసునని, ఆ తర్వాత ఎలాంటి చర్చలు ఉంటాయో ఒక్క కెప్టెన్‌కు తప్ప మరెవ్వరికీ తెలియదంటూ ఆ పార్టీ నేత ఒకరు పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement