DMDK leader
-
విద్యార్థులపై పైశాచికత్వం
టీ.నగర్: తోటలోని కర్బూజా పండును తిన్నారని పాఠశాల విద్యార్థులను చెట్టుకు కట్టి దాడి చేసిన డీఎండీకే నేతపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. వివరాలు.. తిరుపూర్ జిల్లా ధారాపురం కరుంగాలివలసు గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఆదివారం ఉదయం నల్లతంగాల్ కాలువలో స్నానం చేసేందుకు వెళ్లిన వీరు సాయంత్రం ఇళ్లకు రాలేదు. వారి తల్లిదండ్రులు, స్థానికులు ఊరంతా గాలించారు. ఇలా ఉండగా కాలువ పక్కన ఉన్న రామస్వామికి చెందిన తోటలో చెట్టుకు ఈ ముగ్గురిని తాళ్లతో బంధించారు. గమినంచిన స్థానికులు వారి తాళ్లను విప్పి విచారించారించగా తోటలో ఉన్న కర్బూజా పండును తిన్నామని ఆతోట యజమాని రామస్వామి(50) తమను తాళ్లతో చెట్టుకు బంధించినట్లు తెలిపారు. అంతేకాకుండా తమపై రబ్బర్ పైప్, పాదరక్షలతో దాడి చేసినట్లు చెప్పారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు అతని కోసం గాలించగా పరారైనట్లు తెలిసింది. రామస్వామి డీఎండీకే పట్ట ణపంచాయితీ కార్యదర్శిగా ఉన్నాడు. ఆకలిదప్పులతో ఉన్న ముగ్గురు విద్యార్థులను అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రామస్వామి కోసం గాలిస్తున్నారు. -
అన్నా నీవే దిక్కు!
మా దగ్గర డబ్బుల్లేవ్ కెప్టెన్‌కు నేతల షాక్ ఇక దరఖాస్తుల హోరు ‘స్థానిక’ సమరం డీఎండీకే వర్గాలకు జీవన్మరణ సమస్యగా మారింది. ఓ వైపు బల నిరూపణ, మరో వైపు ఎన్నికల ఖర్చుకు నిధి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఉన్నదంతా పార్టీ కోసం ఇన్నాళ్లు ఖర్చు పెట్టిన వాళ్లంతా, ఇప్పుడు ‘అన్నా’ డబ్బుల్లేవు... నీవే దిక్కు అని కెప్టెన్ కోర్టులోకి బంతిని నెట్టే పనిలో పడ్డారు. ఇందుకు తగ్గ షాక్‌లను పార్టీ అధినేత విజయకాంత్‌కు ఇచ్చే పనిలో జిల్లా నేతలు ఉన్నారు. చెన్నై : రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయ శక్తి డీఎండీకే అన్నట్టుగా ప్రజల మన్ననల్ని అందుకున్న నాయకుడు విజయకాంత్. పార్టీ ఆవిర్భావ సమయంలో సినీ అభిమానం ఆయన వెంట కదిలింది. అభిమాన లోకం రాజకీయంగా ఎదిగారు. తమ నేత ఇచ్చే పిలుపు మేరకు చేపట్టే కార్యక్రమాలకు ఇళ్లు గుళ్ల చేసుకున్న వాళ్లెందరో ఉన్నారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించినా, చివరకు అధికార పక్షంతో విజయకాంత్ పెట్టుకున్న వైర్యం డీఎండీకే వర్గాల్ని ఆర్థికంగా మరింత కష్టాల్లోకి నెట్టిందని చెప్పవచ్చు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అయితే చావు దెబ్బే తిన్నారు. ఇక, తాము ఇమడలేమంటూ పెద్ద సంఖ్యలో కేడర్ డీఎండీకేను వీడింది. దీంతో మిగిలిన వాళ్లను రక్షించుకునేందుకు విజయకాంత్ తీవ్రంగానే కుస్తీలు పట్టారు. ఇప్పుడు ఉన్న కేడర్‌లో ఆర్థికంగా దెబ్బ తిన్న వాళ్లు కొందరు అయితే, మరి కొందరు చేతిలో చిల్లిగవ్వకూడా లేకుండా రాజకీయాలు చేసే వాళ్లు ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ నేతల్లో స్థానిక ఎన్నికల ఖర్చు గుబులు బయలు దేరింది. ఎక్కడ తమ నెత్తిన వేసే రీతిలో కెప్టెన్ పిలుపునిస్తారో అన్న ఉత్కంఠ బయలు దేరింది. దీంతో ముందస్తుగా మేల్కొన్న జిల్లాల నేతలు అన్నా..డబ్బుల్లేవు...నీవే దిక్కు అన్నట్టు విజయకాంత్ వద్ద మొరపెట్టుకునే పనిలో పడ్డారు. అన్నా డబ్బుల్లేవు..: స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? పొత్తా? ఒంటరా..? అన్న అంశాలపై కేడర్ అభిప్రాయాల్ని విజయకాంత్ స్వీకరించే పనిలో పడ్డారు. మంగళవారం నుంచి ఈ ప్రక్రియ సాగుతూ వస్తోంది. ఇందులో జిల్లాలు, డివిజన్ల నుంచి వస్తున్న నేతలు విజయకాంత్‌కు షాక్‌లు ఇచ్చే పనిలో పడ్డారట..!. బలోపేతం లక్ష్యంగా కెప్టెన్ ఇచ్చే సూచనలు, సలహాలను నేతలు చక్కగా ఆలకిస్తున్నారు. అదే అభిప్రాయాల విషయానికి వచ్చే కొద్ది నేతలు తమ గళాన్ని విప్పే పనిలో పడడం కెప్టెన్‌కు పెద్ద షాక్కే అంట..!. డబ్బుల్లేవు, మళ్లీ..మళ్లీ తాము సొంత డబ్బులు ఖర్చు పెట్టలేం అన్న సమాధానాలు పెద్ద సంఖ్యలో వచ్చినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలకు దూరంగా ఉంటే మంచిదన్నట్టుగా సలహాలు ఇచ్చే పనిలో పడ్డట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అందరి అభిప్రాయాల్ని శ్రద్ధంగా వినే విజయకాంత్, చివరలో ఎన్నికల్లోకి వెళ్తున్నాం...తాను సూచించే వ్యక్తి గెలుపునకు శ్రమించాల్సిందే అంటూ కేడర్‌కు హుకుం జారీ చేసి పంపించేస్తున్నట్టు సమాచారం. ఇంత మాత్రానికి తమను పిలిపించి అభిప్రాయాలు సేకరించడం ఏమిటో అంటూ పలువురు నేతలు కోయంబేడులోని పార్టీ కార్యాలయం వద్ద పెదవి విప్పడం గమనార్హం. అదే సమయంలో తాను మాత్రం తగ్గేది లేదన్నట్టుగా విజయకాంత్ ముందుకు సాగుతుండడంతో స్థానికంలో బలాన్ని చాటగలమా అన్న అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారట! ఇక, ఓ వైపు కేడర్ అభిప్రాయాలు అంటూ, మరో వైపు దరఖాస్తుల స్వీకరణ అంటూ విజయకాంత్ తనదైన రూట్లో పయనం సాగిస్తుండడం గమనార్హం. దరఖాస్తుల హోరు : ఎన్నికలపై అభిప్రాయ సేకరణ ఓ వైపు కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో సాగితే, మరో వైపు బుధవారం నుంచి ఎన్నికల బరిలో నిలబడే ఆశావహులు దరఖాస్తులు సమర్పించుకునే విధంగా ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయడం ఆలోచించదగ్గ విషయమే. ఇక విజయకాంత్ రూటే సెపరేటుగా ఉంటే, పీఎంకే అయితే, తాము ఒంటరే అన్నది స్పష్టం చేశారు. ఎన్నికల బరిలో నిలబడే ఆశావహుల నుంచి దరఖాస్తుల ఆహ్వానానికి శ్రీకారం చుట్టారు. అలాగే, బీజేపీ సైతం ఒంటరి అన్నట్టుగానే దరఖాస్తుల పర్వానికి శ్రీకారం చుట్టింది. కోడంబాక్కంలో ఈ దరఖాస్తుల పంపిణీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ ప్రారంభించేశారు. దీంతో ఆయా పార్టీలో దరఖాస్తుల వేగం పుంజుకుంది. -
దింపుడు కళ్లం ఆశ
డీఎండీకే కోసం డీఎంకే ఎదురుచూపులు విజయకాంత్ వస్తాడన్న కరుణానిధి ఎన్నికలకు సిద్ధమన్న స్టాలిన్ ఎన్నికల వేళ డీఎంకే దింపుడు కళ్లం ఆశలో పడిపోయింది. డీఎండీకే తమ జట్టులో చేరడం ఖాయమని డీఎంకే అధినేత కరుణానిధి సోమవారం ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో ఎన్ని కూటములు ఏర్పడినా ప్రధాన పోటీ అన్నాడీఎంకే, డీఎంకే మధ్యనే అన్నది నిర్వివాదాంశం. డీఎంకే, కాంగ్రెస్ కలిసిపోగా డీఎండీకేకు కరుణ ఆహ్వానం పంపా రు. డీఎంకేలో కాంగ్రెస్‌తోపాటూ మనిదనేయ మక్కల్ కట్చి, ఇండియ యూనియన్ ముస్లింలీగ్, ఎస్టీపీఐ, పెరుందలైవర్ మక్కల్ కట్చి తదితర పార్టీలు ఉన్నాయి. అయితే డీఎంకే కూటమిలో ఉన్న పార్టీల్లో కాంగ్రెస్ మాత్రమే పెద్దపార్టీ. పేరుకు జాతీయ పార్టీ అయినా ప్రజల్లో పరపతి అంతంత మాత్రమే. రాష్ట్రంలో ఎంతో కొంత ప్రజాబలం, కార్యకర్తల బలం ఉన్న పార్టీగా పేరొందిన డీఎండీకే మాత్రం డీఎంకేకు ముఖం చాటేసింది. డీఎండీకేను కూటమిలోకి తెచ్చే బాధ్యతను మిత్రపక్ష కాంగ్రెస్‌కు అప్పగించారు. కాంగ్రెస్ కంటే డీఎండీకేనే బలమైన పార్టీగా డీఎంకే నమ్ముతోంది. ఈ విషయాన్ని గమనించిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ తమ సీట్లు తగ్గించుకుని డీఎండీకేకు దక్కేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఎవరెన్ని ఆఫర్లు ప్రకటించినా మీనమేషాలు లెక్కించుకుంటూ కూర్చున్న విజయకాంత్ ఒంటరిపోరుకు పోతున్నట్లు ప్రకటించారు. కింగా, కింగ్‌మేకరా అంటూ నినాదాలు చేసిన పార్టీ శ్రేణులు తనను కింగ్‌గా ఉండాలని కోరుకుంటున్నట్లు విజయకాంత్ తేల్చిచెప్పారు. డీఎండీకే కలిసిన పక్షంలో మాత్రమే డీఎంకే బలమైన కూటమిగా మారి అన్నాడీఎంకేను ఎదుర్కోగలదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విశ్లేషణ కొంత వరకు నిజమేనని పలువురు హెచ్చరిస్తున్న తరుణంలో విజయకాంత్‌ను బుజ్జగించే చర్యలు ప్రారంభమైనాయి. ఓట్లను చీల్చడం ద్వారా విజయకాంత్ అన్నాడీఎంకేకు గెలుపు సులువు చేయగలడని డీఎంకే ఆందోళన చెందుతోంది. నేను రాను మొర్రో అంటూ విజయకాంత్ స్పష్టం చేసినా డీఎంకే మాత్రం చివరి ప్రయత్నంలో పడింది. కెప్టెన్ మాతోనే: కరుణ : ఈ నేపథ్యంలో అన్నా అరివాలయంలో సోమవారం డీఎంకే ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. సమావేశం అనంతరం కరుణానిధి మీడియాతో మాట్లాడుతూ డీఎండీకే తమ కూటమిలో చేరుతుందనే విశ్వాసాన్ని కోల్పోలేదని వ్యాఖ్యానించారు. కూటమి పార్టీలతో సీట్ల సర్దుబాటు చర్చలు ఈ నెల 23వ తేదీన ప్రారంభం అవుతాయని తెలిపారు. పార్టీ పరంగా కనీసం 190 సీట్లలో పోటీచేయనున్నట్లు చెప్పారు. చర్చలను వేగంగా ముగించి అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటిస్తామని అన్నారు. అలాగే మరోవైపు ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. మరి డీఎండీకే మా టేమిటని ప్రశ్నించగా, తమ కూటమిలోకి విజయకాంత్ వస్తాడని తాను మొద టి నుంచి నమ్ముతున్నానని, ఆ నమ్మకం వమ్ము కాదని కరుణ స్పష్టం చేశారు. అధికారం మాదే - స్టాలిన్ ధీమా :రాబోయే ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ కోశాధికారి స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. డీఎండీకే కోసం పార్టీ అర్రులు చాస్తున్న క్రమంలో స్టాలిన్ ప్రకటన చర్చనీయాంశమైంది. తాను చేపట్టిన నమక్కు నామే పర్యటన ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకాన్ని పెంచిందని స్టాలిన్ పేర్కొన్నారు. తన పర్యటన సమయంలో ప్రజలతో చేసిన సంభాషణలు పార్టీ అధికారంలోకి రావడం ఖాయమనే నమ్మకాన్ని పెంచిందని తెలిపారు. సుమారు నాలుగున్నర లక్షమంది ప్రజలు తను విజ్ఞప్తులను ఇచ్చి డీఎంకే అధికారంలోకి వచ్చి తమ కోర్కెలను నెరవేర్చాలని కోరినట్లు స్టాలిన్ తెలిపారు. అలాగే అన్నాడీఎంకే ప్రభుత్వ వైఫల్యాలు, పార్టీలోని కుమ్ములాటలు తమకు కలిసొచ్చే అంశాలని ఆయన చెబుతున్నారు. ‘అన్నాడీఎంకేను అధికారంలో నుంచి దింపుతాను, జయలలితను మరోసారి ముఖ్యమంత్రిని కానివ్వను, ఇవే లక్ష్యాలున్న కూటమితోనే పొత్తుపెట్టుకుంటా ను’ అంటూ విజయకాంత్ ప్రతిజ్ఞ చేశారని స్టాలిన్ అన్నారు. ఈ ప్రతిజ్ఞలకు ఆకర్షితుడై కరుణానిధి పొత్తుకు ఆహ్వానం పంపారని తెలిపారు. అయితే విజ యకాంత్ ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారోనని అన్నారు. ఏదైమైనా ఎన్నికలను ఎదుర్కొనేందుకు డీఎంకే సిద్ధంగా ఉందని స్టాలిన్ స్పష్టం చేశారు. -
మౌనం దేనికి అంగీకారమో?
కులదైవానికి కెప్టెన్ పూజలు మీడియా ఎదుట మౌనం చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్ రానున్న ఎన్నికల్లో ఏదో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అది ఏమిటో అన్నది మాత్రం ప్రశ్నార్థకమే. మంగళవారం తన కుల దైవం వీర చిన్నమ్మాల్ సన్నిధిలో సతీమణి ప్రేమలతతో కలిసి విజయకాంత్ ప్రత్యేక పూజలు చేశారు. పొత్తు పై మీడియా గుచ్చి గుచ్చి ప్రశ్నల్ని సంధించినా, మౌన ముద్రతో ముందుకు సాగారు. డీఎండీకే అధినేత విజయకాంత్ ఎన్నికల ముందు కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏదేని కీలక ప్రకటనలు చేయాలన్న ముందుగా తన కుల దైవం ఆలయాన్ని సందర్శించడం జరుగుతూ వస్తున్నది. తాజాగా, అసెంబ్లీ ఎన్నికల్లో తన చుట్టూ రాజకీయం తిరుగుతుండటంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై విజయకాంత్ మల్లగుల్లాలు పడుతున్నారని సమాచారం. ఓవైపు బీజేపీ, మరో వైపు డిఎంకే, ఇంకో వైపు ప్రజా కూటములు ఆహ్వానం పలికి ఉండటంతో ఏదో ఒక కూటమిని ఎంపిక చేసుకునేందుకు ఆయన సిద్ధమయ్యారని తెలిసింది. డిఎంకే కూటమి వైపుగా వస్తారన్న ప్రచారం ఉన్నా... ఆయన సతీమణి ప్రేమలత వ్యాఖ్యలు కొంత గందరగోళంలోకి నెట్టి ఉన్నాయి. బీజేపీ వైపుగా నడుస్తారా..? లేదా, ప్రజా కూటమిలో సీఎం అభ్యర్థిగా నేతృత్వ పగ్గాలు చేపడుతారా..? అన్న ప్రశ్న ఉత్పన్నమయింది.. ఈ సమయంలో తన నిర్ణయం ఏమిటో ప్రకటించేందుకు మహానాడు వేదికగా కాంచీపురంను ఎంపిక చేసుకున్న విజయకాంత్, అందుకు తగ్గ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈనెల 20వ తేదీన జరగనున్న ఈ మహానాడు ద్వారా కీలక ప్రకటన చేయడానికి ఆయన సిద్ధం అయ్యారని చెప్పవచ్చు. ఇందుకు అద్దం పట్టే విధంగా మంగళవారం తన కుల దైవాన్ని దర్శించుకుని, మహానాడు ఆహ్వాన పత్రికకు పూజలు చేయడం గమనార్హం. కుల దైవానికి పూజలు : తన సతీమణి ప్రేమలతతో కలసి మదురై జిల్లా తిరుమంగళం సమీపంలోని కాంగేయంకు ఉదయం విజయకాంత్ చేరుకున్నారు. అక్కడ కొలువు దీరి ఉన్న తన కుల దైవం వీర చిన్నమ్మాల్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ ఆలయంలోకి వెళ్లే సమయంలో మరొకరి సాయంతో ముందుకు సాగిన విజయకాంత్ పూజల అనంతరం మౌనంగా బయటకు వచ్చారు. మీడియా చుట్టుముట్టినా, ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ముందుకు సాగారు. అయితే, ప్రేమలత మాత్రం తమ కులదైవాన్ని సందర్శించే విషయం తెలిసిందేగా అని సమాధానం ఇచ్చి కదిలారు. తదుపరి శ్రీవిళ్లి పుత్తూరు అండాల్ అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన విజయకాంత్, తదుపరి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ ఆలయబాట తదుపరి ఆయన కీలక నిర్ణయం ప్రకటించడం ఖాయం. అయితే, ఆ నిర్ణయం ఏమిటో అన్న ఉత్కంఠ బీజేపీ, డీఎంకే, ప్రజా కూటమికి మరికొద్ది రోజులు తప్పదు. -
కెప్టెన్‌కి డీఎంకే గాలం
టీనగర్: తమ కూటమి నుంచి విజయకాంత్‌ను తమ వైపు తిప్పుకునేందుకు డీఎంకే ప్రయత్నిస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజా ఆరోపించారు. ఇది సత్సంప్రదాయం కాదని మండిపడ్డారు. హెచ్.రాజా శుక్రవారం చెన్నై టీనగర్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని హిందువులు ఎటువంటి గొడవల్లోనూ పాల్గొనరని తెలిపారు. ముస్లిం తీవ్రవాదులు మాత్రమే రాష్ట్రంలో ఏదో ఒక ఉత్పాతాన్ని సృష్టిస్తున్నట్లు ఆరోపించారు. బాబ్రీ మసీదు కూల్చివేసిన ఉత్తరప్రదేశ్‌లో మాత్రం ప్రజలు మౌనం పాటిస్తూ, రాష్ట్రంలో ప్రతి ఏడాదీ డిసెంబర్ ఆరో తేదీన స్మారకదినం అంటూ ఉద్రిక్త వాతావరణాన్ని కలిగిస్తున్నారని విమర్శించారు. శుక్రవారం కొత్త సంవత్సరంలో మొదటి రోజుని వాణియంబాడి న్యూటౌన్‌లో అవాంఛనీయ సంఘటనకు శ్రీకారం చుట్టారని ఆయన తెలిపారు. బీజేపీకి చెందిన జిల్లా మాజీ నిర్వాహకుడు శివప్రకాశంపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆయన ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలిపారు. ఆంబూరు ఉద్రిక్తతకు సంబంధించి అరెస్టయిన ముస్లిం తీవ్రవాదులు బెయిలుపై విడుదలై స్వేచ్ఛగా తిరుగుతున్నారని రాజా పేర్కొన్నారు. వారిని గూండా చట్టం కింద అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తీవ్రవాదాన్ని అణచివేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వానికి సూచించారు. మహిళలు లెగిన్స్, జీన్స్ ధరించి ఆలయాలకు వెళ్లడాన్ని నిషేధించడం హర్షణీయమని, దీన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. చెరువులు, జలాశయాలను ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించడం వల్లే చెన్నై నగరానికి వరదలు వచ్చాయని గుర్తు చేశారు. ఈ ఆక్రమణలు డీఎంకే ప్రభుత్వ హయాంలోనే అధికంగా జరిగాయన్నారు. విజయకాంత్ డీఎంకే కూటమిలోకి రావాలంటూ కరుణానిధి ఆహ్వానించడంపై విలేకరులు ప్రశ్నించగా విజయకాంత్ తమ కూటమిలోనే ఉన్నారని రాజా స్పష్టం చేశారు. ఈ కూటమి ఇంకా కొనసాగుతోందన్నారు. విజయ్ కాంత్ ని డీఎంకే ఆహ్వానించడం సత్సంప్రదాయం కాదని విమర్శించారు. ఈ సమావేశంలో మీడియా ప్రతినిధి ఏఎన్ఎస్ ప్రసాద్ ఉన్నారు. -
పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్న విజయకాంత్
అనేక పార్టీలతో బేరసారాలు తలపట్టుకుంటున్న డీఎంకే, బీజేపీ అన్నాడీఎంకేలోకి రెబల్ ఎమ్మెల్యేలు చెన్నై : ఎన్నికల కూటమికై అన్ని పార్టీల్లో జోరుగా కసరత్తులు సాగుతున్న తరుణంలో డీఎండీకే అధినేత విజయకాంత్ తన వింత వైఖరితో పార్టీలను ముచ్చెమటలు పట్టిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీల్లో అన్నాడీఎంకే, డీఎంకే తరువాత డీఎండీకే మూడోస్థానాన్ని ఆక్రమించి ఉంది. ఏ ఎన్నికలు జరిగినా ప్రాంతీయ పార్టీలదే ఆధిపత్యం. ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ అన్నాడీఎంకే, డీఎంకేల మధ్యనే గట్టిపోటీ నెలకొనగా ఈ రెండు పార్టీల్లో ఏదో ఒకటి అధికార పీఠాన్ని దక్కించుకుంటాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మారిపోయింది. జార్జికోటపై జెండా పాతేందుకు మరో రెండు కూటములు సిద్దం అవుతున్నాయి. పొత్తులపై ఇప్పట్లో నిర్ణయం ఉండదని అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తన మనస్సులోని మాట గురువారం నాటి సమావేశంలో బైటపెట్టింది. ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ, అన్నాడీఎంకే కలిసి పోటీ చేసే అంశాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకున్న డీఎండీకే ఆ తరువాతి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పంచన చేరింది. ఎన్నికల అనంతరం బీజేపీతో తెగతెంపులు చేసుకున్నట్లుగా విజయకాంత్ వ్యవహరిస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం కెప్టెన్‌ను వదులుకోరాదని మంచిగా మెలుగుతోంది. ఇటీవల ఆయన ఇంటికి సైతం వెళ్లి పొత్తు ఖరారుకు ప్రయత్నాలు చేసింది. అయితే విజయకాంత్ తనదైన శైలిలో దాటవేయడంతో బీజేపీ నేతలు బిక్కమొహం వేశారు. విజయకాంత్‌తో బీజేపీ సాగించిన రెండు విడదల చర్చలు విఫలం కావడంతో డీఎంకే వేగం పెంచింది. విజయకాంత్‌తో తన జట్టులో కలుపుకోవాలని డీఎంకే గట్టి ప్రయత్నాలు సాగిస్తోంది. ప్రత్యక్షంగా ఆహ్వానం కూడా పలికింది. ఏ పార్టీతో పొత్తుపెట్టుకున్నా తాను ముఖ్యమంత్రి అభ్యర్దిగా ఉంటానని విజయకాంత్ డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌కు బీజేపీ ఎంతోకొంత మొగ్గుచూపుతోంది. అయితే డీఎంకేతో చేతులు కలిపితే విజయకాంత్‌కు ముఖ్యమంత్రి అభ్యర్దిత్వం దక్కే అవకాశమే లేదు. కనీసం ఉప ముఖ్యమంత్రిగానైనా ప్రకటించాలని డీఎంకే వద్ద విజయకాంత్ బేరమాడుతున్నట్లు సమాచారం. అయితే అన్నాడీఎంకేతో కయ్యానికి కాలుదువ్వడం అనే అంశంలో డీఎంకే, డీఎండీకేల వైఖరి ఒకేలా ఉండటంతో చెలిమికి ఆస్కారం ఉంది. ఇతర పార్టీలతో పోల్చుకుంటే బీజే పీతో కొంత సఖ్యత ఉన్నా విజయకాంత్..అకస్మాత్తుగా బీజేపీ అన్నాడీఎంకేల మధ్య సంధికుదిరిన పక్షంలో దూరం జరగక తప్పదు. ఇదిలా ఉండగా, విజయకాంత్‌ను సీఎం అభ్యర్దిగా ప్రకటించేందుకుక మక్కల్ నల కూట్టని సిద్దంగా ఉన్నట్లు సమాచారం. సీఎం, డిప్యూటీ సీఎం అభ్యర్దిత్వం, పెద్ద సంఖ్యలో పోటీకి సీట్లు వంటి అనేక అజెండాలతో అన్ని పార్టీలతోనూ విజయకాంత్ మంతనాలు సాగించడంతో డీఎంకే, బీజేపీలకు అంతు బట్టడంలేదు. ప్రాంతీయ పార్టీల జాబితాలో మూడోస్థానంలో ఉన్న డీఎండీకే ముప్పతిప్పలు పెట్టడాన్ని మింగలేక, కక్కలేక అవస్థలు పడుతున్నారు. అన్నాడీఎంకేలోకి రెబల్ ఎమ్మెల్యేలు: పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు డీఎండీకే అధినేత విజయకాంత్ అష్టకష్టాలు పడుతుండగా, అదే పార్టీకి చెందిన 8 మంది రెబల్ ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే వైపు వలసబాట పడుతున్నారు. సుమారు ఏడాది క్రితమే అమ్మ పంచన చేసిన డీఎండీకే ఎమ్మెల్యేలు సుందరరాజన్ (మదురై సెంట్రల్), తమిళ్ అళగన్ (తిట్టకుడి), అరుణ్ సుబ్రమణియన్ (తిరుత్తణి), సురేష్‌కుమార్ (సెంగమ్), శాంతి ( సేందమంగళం), పాండియరాజన్ (విరుదనగర్), మైకేల్ రాయప్పన్( రాధాపురం), అరుణ్ పాండియన్ (పేరావూరణి) జనవరి చివరి వారంలో అన్నాడీఎంకేలో చేరుతున్నట్లు సమాచారం. అన్నాడీఎంకే చివరి అసెంబ్లీ సమావేశాలు ముగియగానే అన్నాడీఎంకే తీర్దం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. -
ఢిల్లీకి ‘కెప్టెన్’సేన
డీఎండీకే అధినేత విజయకాంత్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం గురువారం ఢిల్లీకి బయలు దేరింది. శుక్రవారం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో ఈ బృందం భేటీ కానుంది. ఈ పర్యటన కెప్టెన్ రాజకీయ ఎత్తుగడకు వేదిక కాబోతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న డీఎండీకే ఓటు బ్యాంకు కోసం బీజేపీ, డీఎంకే, కాంగ్రెస్ తీవ్రంగానే కుస్తీలు పడుతున్నాయి. విజయకాంత్ మాత్రం ఎవరికీ చిక్కకుండా చకచకా ముందుకు కదులుతున్నారు. పార్టీ తరపు న ఎన్నికల బరిలో నిలబడే ఆశావహులతో ఇం టర్వ్యూలు ముగించారు. నాలుగు రోజుల పాటుగా జరిపిన ఇంటర్వ్యూల మేరకు నియోజకవర్గానికి ఇద్దరు అభ్యర్థుల చొప్పున ఎంపిక చేశారు. వీరి పనితీరు, వీరికున్న అన్ని రకాల బలం గురించి ఆయా జిల్లాల నేతల ద్వారా ఆరా తీసే పనిలో ఉన్న విజయకాంత్ హఠాత్తు గా ఢిల్లీ వెళ్లేందుకు నిర్ణయించారు. దీంతో ఈ పర్యటన రాజకీయ ఎత్తుగడలకు వేదిక కాబోతోందన్న సంకేతాలు ఆ పార్టీ శ్రేణుల నుంచే వెలువడుతున్నాయి. సొంత నియోజకవర్గాలతోపాటు స్వగ్రామాల్లో ఉన్న ఎమ్మెల్యేలందరూ గురువారం ఉదయం పార్టీ కార్యాలయానికి చేరుకోవాలని విజయకాంత్ ఆదేశించారు. దీంతో ఉదయాన్నే ఎమ్మెల్యేలందరూ కోయంబేడుకు చేరుకున్నారు. ఎమ్మెల్యేలతో విజయకాంత్ భేటీ అయ్యారు. రాత్రి ఏడు గంటలకు 21 మంది ఎమ్మెల్యేలతో కలసి కెప్టెన్ విజయకాంత్ తన సతీమణి ప్రేమలత, బావమరిది సుదీష్‌ను వెంటపెట్టుకుని ఢిల్లీకి బయలు దేరారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలో ప్రధాని మన్మోహన్ సింగ్‌తో విజయకాంత్ బృందం భేటీ కానుంది. రాష్ట్రంలోని సమస్యలు, జాలర్ల సమస్య, ఈలం తమిళుల సమస్య, శ్రీలంకకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో తీర్మానం తదితర అంశాలపై చర్చించి, వినతి పత్రాన్ని సమర్పించబోతున్నారు. రాజకీయ భేటీకి ఆస్కారం ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఢిల్లీకి వస్తున్న విజయకాంత్‌ను తమ వైపు తిప్పుకోవడం లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు వ్యూహ రచనలు చేశారు. పొత్తుకు మార్గం: కాంగ్రెస్, డీఎంకే, డీఎండీకేలు ఒకే వేదిక మీదకు వచ్చే రీతిలో పది జనపథ్ వేదికగా వ్యూహ రచనలు జరుగుతున్నారుు. బుధవారం డీఎంకే అధినేత ఎం కరుణానిధి గారాలపట్టి కనిమొళి కూడా జన్‌పథ్ మెట్లు ఎక్కారు. ఏఐసీసీ అధినేత్రి సోనియాతో భేటీ అయ్యారు. ఈ భేటీ అంతా పొత్తు వ్యవహారం చుట్టూ సాగినట్టు డీఎంకే వర్గాలు పేర్కొంటున్నారుు. విజయకాంత్ సైతం ఢిల్లీ వస్తుండటంతో ఆయన్ను టెన్ జన్‌పథ్ మెట్లు ఎక్కించేందుకు కసరత్తులు జరిగినట్టు సమాచారం. కేంద్ర మంత్రి జీకే వాసన్‌కు విజయకాంత్ సన్నిహితుడు కావడంతో ఆయన ద్వారానే ఈ ప్రయత్నాలు జరిగినట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. విజయకాంత్‌ను ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ ముకుల్ వాస్నిక్ తొలుత భేటీ అవుతారని, అనంతరం టెన్ జన్‌పథ్‌లో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్‌తో సమావేశం ఉంటుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అదే సమయంలో తమ నేత ఢిల్లీకి రమ్మంటే వెళ్తున్నామని, ఆయన మదిలో ఏమున్నదో తమకు ఇంత వరకు తెలియదంటూ ఓ ఎమ్మెల్యే పేర్కొనడం గమనార్హం. ప్రధానితో భేటీ వరకు తనకు తెలుసునని, ఆ తర్వాత ఎలాంటి చర్చలు ఉంటాయో ఒక్క కెప్టెన్‌కు తప్ప మరెవ్వరికీ తెలియదంటూ ఆ పార్టీ నేత ఒకరు పేర్కొన్నారు. -
బన్రూటికి ‘అన్నా’
సాక్షి, చెన్నై: రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో ప్రతి ఏటా తిరువళ్లువర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తమిళ మేధావులు, సమాజ హితాన్ని కాంక్షిస్తూ సేవల్ని అందిస్తున్న వారికి బిరుదుల్ని ప్రదానం చేస్తారు. ఈ ఏడాదికి గాను బిరుదులకు ఎంపికైన వారి వివరాల్ని సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి అన్నా బిరుదుకు బన్రూటి రామచంద్రన్ ఎంపికయ్యారు. ఇటీవల డీఎండీకే నుంచి బన్రూటి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. రాజకీయాల నుంచి తాను వైదొలగుతున్నట్టు బన్రూటి ప్రకటించినా, ఆయన సేవల్ని తమ పార్టీకి ఉపయోగించుకునేందుకు అన్నాడీఎంకే వ్యూహ రచన చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో సేవలకు గుర్తింపుగా దివంగత నేత అన్నాదురై అడుగుజాడల్లో నడుస్తున్న బన్రూటికి అన్నా బిరుదును ప్రకటించడం గమనార్హం. బిరుదులు: తిరువళ్లువర్ బిరుదును యూసీ(తైవాన్), ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్ బిరుదును అన్నాడీఎంకే నాయకురాలు సులోచనా సంపత్, అంబేద్కర్ బిరుదును ప్రొఫెసర్ ఎం ప్రకాష్, అన్నా బిరుదును బన్రూటి రామచ ంద్రన్, విద్యా ప్రదాత, మాజీ ముఖ్యమంత్రి కామరాజర్ బిరుదును అయ్యారు వాండయార్, భారతీయార్ బిరుదును ప్రొఫెసర్ కె జ్ఞాన సంబంధన్, భారతీ దాసన్ బిరుదును రాధాచల్లప్పన్, తిరువికా బిరుదును అశోక్ మిత్రన్, ముత్తమిళ్ కావలర్ విశ్వనాథన్ బిరుదును ప్రొఫెసర్ జయ దేవన్‌కు ఇవ్వనున్నారు. బుధవారం తిరువళ్లువర్ దినోత్సవ వేడుకలు ఎగ్మూర్ మ్యూజియం ఆవరణలో ఘనంగా జరగనున్నాయి. ఇందులో వీరికి బిరుదులు ప్రదానం చేయనున్నారు. బిరుదులతోపాటుగా సర్టిఫికెట్లు, తలా రూ.లక్ష నగదు, ఒక సవరం బంగారు పతకం అందజేయనున్నారు. అలాగే, ఆర్థికంగా చితికిన తమిళ మేధావులు 30 మందికి ప్రభుత్వ సహకారం అందించనుంది. సంక్రాంతి పతకాలు: పోలీసుల సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం పలు అవార్డులను ప్రదానం చే స్తారు. నేరాల కట్టడిలో, సంఘ విద్రోహ శక్తులపై ఉక్కు పాదం మోపే రీతిలో పోలీసులకు సర్వాధికారాల్ని అప్పగించారు. ఈ ఏటా తొలి సారిగా సంక్రాంతి పతకాలు అందించేందుకు నిర్ణయించారు. ఈమేరకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఆ మేరకు పోలీసు విభాగాల్లో పనిచేస్తున్న 1685 మందికి సంక్రాంతి పతకాలను ప్రకటించింది. 1500 మంది పోలీసులకు, 119 మంది అగ్నిమాపక సిబ్బందికి, 60 మంది జైళ్లలో పనిచేస్తున్న వార్డెన్లు తదితర సిబ్బందికి, పోలీసు ఫొటోగ్రాఫర్లు, డాగ్ స్క్వాడ్, తదితర విభాగాల్లో పనిచేస్తున్న వాళ్లకు తలా ఇద్దరికి చొప్పున ఈ పతకాలను ప్రకటించారు. ఈ పతకాలతో పాటుగా వీరికి ప్రతి నెలా వేతనంతో పతకాల ప్రోత్సాహంగా రూ.200 అదనంగా ఇవ్వనున్నారు.