దింపుడు కళ్లం ఆశ
డీఎండీకే కోసం డీఎంకే ఎదురుచూపులు
విజయకాంత్ వస్తాడన్న కరుణానిధి
ఎన్నికలకు సిద్ధమన్న స్టాలిన్
ఎన్నికల వేళ డీఎంకే దింపుడు కళ్లం ఆశలో పడిపోయింది. డీఎండీకే తమ జట్టులో చేరడం ఖాయమని డీఎంకే అధినేత కరుణానిధి సోమవారం ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో ఎన్ని కూటములు ఏర్పడినా ప్రధాన పోటీ అన్నాడీఎంకే, డీఎంకే మధ్యనే అన్నది నిర్వివాదాంశం. డీఎంకే, కాంగ్రెస్ కలిసిపోగా డీఎండీకేకు కరుణ ఆహ్వానం పంపా రు. డీఎంకేలో కాంగ్రెస్‌తోపాటూ మనిదనేయ మక్కల్ కట్చి, ఇండియ యూనియన్ ముస్లింలీగ్, ఎస్‌టీపీఐ, పెరుందలైవర్ మక్కల్ కట్చి తదితర పార్టీలు ఉన్నాయి. అయితే డీఎంకే కూటమిలో ఉన్న పార్టీల్లో కాంగ్రెస్ మాత్రమే పెద్దపార్టీ. పేరుకు జాతీయ పార్టీ అయినా ప్రజల్లో పరపతి అంతంత మాత్రమే.
రాష్ట్రంలో ఎంతో కొంత ప్రజాబలం, కార్యకర్తల బలం ఉన్న పార్టీగా పేరొందిన డీఎండీకే మాత్రం డీఎంకేకు ముఖం చాటేసింది. డీఎండీకేను కూటమిలోకి తెచ్చే బాధ్యతను మిత్రపక్ష కాంగ్రెస్‌కు అప్పగించారు. కాంగ్రెస్ కంటే డీఎండీకేనే బలమైన పార్టీగా డీఎంకే నమ్ముతోంది. ఈ విషయాన్ని గమనించిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ తమ సీట్లు తగ్గించుకుని డీఎండీకేకు దక్కేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఎవరెన్ని ఆఫర్లు ప్రకటించినా మీనమేషాలు లెక్కించుకుంటూ కూర్చున్న విజయకాంత్ ఒంటరిపోరుకు పోతున్నట్లు ప్రకటించారు.
కింగా, కింగ్‌మేకరా అంటూ నినాదాలు చేసిన పార్టీ శ్రేణులు తనను కింగ్‌గా ఉండాలని కోరుకుంటున్నట్లు విజయకాంత్ తేల్చిచెప్పారు. డీఎండీకే కలిసిన పక్షంలో మాత్రమే డీఎంకే బలమైన కూటమిగా మారి అన్నాడీఎంకేను ఎదుర్కోగలదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విశ్లేషణ కొంత వరకు నిజమేనని పలువురు హెచ్చరిస్తున్న తరుణంలో విజయకాంత్‌ను బుజ్జగించే చర్యలు ప్రారంభమైనాయి. ఓట్లను చీల్చడం ద్వారా విజయకాంత్ అన్నాడీఎంకేకు గెలుపు సులువు చేయగలడని డీఎంకే ఆందోళన చెందుతోంది. నేను రాను మొర్రో అంటూ విజయకాంత్ స్పష్టం చేసినా డీఎంకే మాత్రం చివరి ప్రయత్నంలో పడింది.
కెప్టెన్ మాతోనే: కరుణ : ఈ నేపథ్యంలో అన్నా అరివాలయంలో సోమవారం డీఎంకే ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. సమావేశం అనంతరం కరుణానిధి మీడియాతో మాట్లాడుతూ డీఎండీకే తమ కూటమిలో చేరుతుందనే విశ్వాసాన్ని కోల్పోలేదని వ్యాఖ్యానించారు. కూటమి పార్టీలతో సీట్ల సర్దుబాటు చర్చలు ఈ నెల 23వ తేదీన ప్రారంభం అవుతాయని తెలిపారు. పార్టీ పరంగా కనీసం 190 సీట్లలో పోటీచేయనున్నట్లు చెప్పారు. చర్చలను వేగంగా ముగించి అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటిస్తామని అన్నారు. అలాగే మరోవైపు ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. మరి డీఎండీకే మా టేమిటని ప్రశ్నించగా, తమ కూటమిలోకి విజయకాంత్ వస్తాడని తాను మొద టి నుంచి నమ్ముతున్నానని, ఆ నమ్మకం వమ్ము కాదని కరుణ స్పష్టం చేశారు.
అధికారం మాదే - స్టాలిన్ ధీమా :రాబోయే ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ కోశాధికారి స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. డీఎండీకే కోసం పార్టీ అర్రులు చాస్తున్న క్రమంలో స్టాలిన్ ప్రకటన చర్చనీయాంశమైంది. తాను చేపట్టిన నమక్కు నామే పర్యటన ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకాన్ని పెంచిందని స్టాలిన్ పేర్కొన్నారు. తన పర్యటన సమయంలో ప్రజలతో చేసిన సంభాషణలు పార్టీ అధికారంలోకి రావడం ఖాయమనే నమ్మకాన్ని పెంచిందని తెలిపారు. సుమారు నాలుగున్నర లక్షమంది ప్రజలు తను విజ్ఞప్తులను ఇచ్చి డీఎంకే అధికారంలోకి వచ్చి తమ కోర్కెలను నెరవేర్చాలని కోరినట్లు స్టాలిన్ తెలిపారు. అలాగే అన్నాడీఎంకే ప్రభుత్వ వైఫల్యాలు, పార్టీలోని కుమ్ములాటలు తమకు కలిసొచ్చే అంశాలని ఆయన చెబుతున్నారు. ‘అన్నాడీఎంకేను అధికారంలో నుంచి దింపుతాను, జయలలితను మరోసారి ముఖ్యమంత్రిని కానివ్వను, ఇవే లక్ష్యాలున్న కూటమితోనే పొత్తుపెట్టుకుంటా ను’ అంటూ విజయకాంత్ ప్రతిజ్ఞ చేశారని స్టాలిన్ అన్నారు. ఈ ప్రతిజ్ఞలకు ఆకర్షితుడై కరుణానిధి పొత్తుకు ఆహ్వానం పంపారని తెలిపారు. అయితే విజ యకాంత్ ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారోనని అన్నారు. ఏదైమైనా ఎన్నికలను ఎదుర్కొనేందుకు డీఎంకే సిద్ధంగా ఉందని స్టాలిన్ స్పష్టం చేశారు.