కెప్టెన్కి డీఎంకే గాలం
టీనగర్: తమ కూటమి నుంచి విజయకాంత్‌ను తమ వైపు తిప్పుకునేందుకు డీఎంకే ప్రయత్నిస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజా ఆరోపించారు. ఇది సత్సంప్రదాయం కాదని మండిపడ్డారు. హెచ్.రాజా శుక్రవారం చెన్నై టీనగర్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని హిందువులు ఎటువంటి గొడవల్లోనూ పాల్గొనరని తెలిపారు. ముస్లిం తీవ్రవాదులు మాత్రమే రాష్ట్రంలో ఏదో ఒక ఉత్పాతాన్ని సృష్టిస్తున్నట్లు ఆరోపించారు.
బాబ్రీ మసీదు కూల్చివేసిన ఉత్తరప్రదేశ్‌లో మాత్రం ప్రజలు మౌనం పాటిస్తూ, రాష్ట్రంలో ప్రతి ఏడాదీ డిసెంబర్ ఆరో తేదీన స్మారకదినం అంటూ ఉద్రిక్త వాతావరణాన్ని కలిగిస్తున్నారని విమర్శించారు. శుక్రవారం కొత్త సంవత్సరంలో మొదటి రోజుని వాణియంబాడి న్యూటౌన్‌లో అవాంఛనీయ సంఘటనకు శ్రీకారం చుట్టారని ఆయన తెలిపారు. బీజేపీకి చెందిన జిల్లా మాజీ నిర్వాహకుడు శివప్రకాశంపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆయన ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలిపారు.
ఆంబూరు ఉద్రిక్తతకు సంబంధించి అరెస్టయిన ముస్లిం తీవ్రవాదులు బెయిలుపై విడుదలై స్వేచ్ఛగా తిరుగుతున్నారని రాజా పేర్కొన్నారు. వారిని గూండా చట్టం కింద అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తీవ్రవాదాన్ని అణచివేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వానికి సూచించారు. మహిళలు లెగిన్స్, జీన్స్ ధరించి ఆలయాలకు వెళ్లడాన్ని నిషేధించడం హర్షణీయమని, దీన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. చెరువులు, జలాశయాలను ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించడం వల్లే చెన్నై నగరానికి వరదలు వచ్చాయని గుర్తు చేశారు.
ఈ ఆక్రమణలు డీఎంకే ప్రభుత్వ హయాంలోనే అధికంగా జరిగాయన్నారు. విజయకాంత్ డీఎంకే కూటమిలోకి రావాలంటూ కరుణానిధి ఆహ్వానించడంపై విలేకరులు ప్రశ్నించగా విజయకాంత్ తమ కూటమిలోనే ఉన్నారని రాజా స్పష్టం చేశారు. ఈ కూటమి ఇంకా కొనసాగుతోందన్నారు. విజయ్ కాంత్ ని డీఎంకే ఆహ్వానించడం సత్సంప్రదాయం కాదని విమర్శించారు. ఈ సమావేశంలో మీడియా ప్రతినిధి ఏఎన్‌ఎస్ ప్రసాద్ ఉన్నారు.