పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్న విజయకాంత్
అనేక పార్టీలతో బేరసారాలు
తలపట్టుకుంటున్న డీఎంకే, బీజేపీ
అన్నాడీఎంకేలోకి రెబల్ ఎమ్మెల్యేలు
చెన్నై : ఎన్నికల కూటమికై అన్ని పార్టీల్లో జోరుగా కసరత్తులు సాగుతున్న తరుణంలో డీఎండీకే అధినేత విజయకాంత్ తన వింత వైఖరితో పార్టీలను ముచ్చెమటలు పట్టిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీల్లో అన్నాడీఎంకే, డీఎంకే తరువాత డీఎండీకే మూడోస్థానాన్ని ఆక్రమించి ఉంది. ఏ ఎన్నికలు జరిగినా ప్రాంతీయ పార్టీలదే ఆధిపత్యం. ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ అన్నాడీఎంకే, డీఎంకేల మధ్యనే గట్టిపోటీ నెలకొనగా ఈ రెండు పార్టీల్లో ఏదో ఒకటి అధికార పీఠాన్ని దక్కించుకుంటాయి.
అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మారిపోయింది. జార్జికోటపై జెండా పాతేందుకు మరో రెండు కూటములు సిద్దం అవుతున్నాయి. పొత్తులపై ఇప్పట్లో నిర్ణయం ఉండదని అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తన మనస్సులోని మాట గురువారం నాటి సమావేశంలో బైటపెట్టింది. ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ, అన్నాడీఎంకే కలిసి పోటీ చేసే అంశాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకున్న డీఎండీకే ఆ తరువాతి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పంచన చేరింది.
ఎన్నికల అనంతరం బీజేపీతో తెగతెంపులు చేసుకున్నట్లుగా విజయకాంత్ వ్యవహరిస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం కెప్టెన్‌ను వదులుకోరాదని మంచిగా మెలుగుతోంది. ఇటీవల ఆయన ఇంటికి సైతం వెళ్లి పొత్తు ఖరారుకు ప్రయత్నాలు చేసింది. అయితే విజయకాంత్ తనదైన శైలిలో దాటవేయడంతో బీజేపీ నేతలు బిక్కమొహం వేశారు. విజయకాంత్‌తో బీజేపీ సాగించిన రెండు విడదల చర్చలు విఫలం కావడంతో డీఎంకే వేగం పెంచింది. విజయకాంత్‌తో తన జట్టులో కలుపుకోవాలని డీఎంకే గట్టి ప్రయత్నాలు సాగిస్తోంది. ప్రత్యక్షంగా ఆహ్వానం కూడా పలికింది.
ఏ పార్టీతో పొత్తుపెట్టుకున్నా తాను ముఖ్యమంత్రి అభ్యర్దిగా ఉంటానని విజయకాంత్ డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌కు బీజేపీ ఎంతోకొంత మొగ్గుచూపుతోంది. అయితే డీఎంకేతో చేతులు కలిపితే విజయకాంత్‌కు ముఖ్యమంత్రి అభ్యర్దిత్వం దక్కే అవకాశమే లేదు. కనీసం ఉప ముఖ్యమంత్రిగానైనా ప్రకటించాలని డీఎంకే వద్ద విజయకాంత్ బేరమాడుతున్నట్లు సమాచారం. అయితే అన్నాడీఎంకేతో కయ్యానికి కాలుదువ్వడం అనే అంశంలో డీఎంకే, డీఎండీకేల వైఖరి ఒకేలా ఉండటంతో చెలిమికి ఆస్కారం ఉంది.
ఇతర పార్టీలతో పోల్చుకుంటే బీజే పీతో కొంత సఖ్యత ఉన్నా విజయకాంత్..అకస్మాత్తుగా బీజేపీ అన్నాడీఎంకేల మధ్య సంధికుదిరిన పక్షంలో దూరం జరగక తప్పదు. ఇదిలా ఉండగా, విజయకాంత్‌ను సీఎం అభ్యర్దిగా ప్రకటించేందుకుక మక్కల్ నల కూట్టని సిద్దంగా ఉన్నట్లు సమాచారం. సీఎం, డిప్యూటీ సీఎం అభ్యర్దిత్వం, పెద్ద సంఖ్యలో పోటీకి సీట్లు వంటి అనేక అజెండాలతో అన్ని పార్టీలతోనూ విజయకాంత్ మంతనాలు సాగించడంతో డీఎంకే, బీజేపీలకు అంతు బట్టడంలేదు. ప్రాంతీయ పార్టీల జాబితాలో మూడోస్థానంలో ఉన్న డీఎండీకే ముప్పతిప్పలు పెట్టడాన్ని మింగలేక, కక్కలేక అవస్థలు పడుతున్నారు.
అన్నాడీఎంకేలోకి రెబల్ ఎమ్మెల్యేలు:
పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు డీఎండీకే అధినేత విజయకాంత్ అష్టకష్టాలు పడుతుండగా, అదే పార్టీకి చెందిన 8 మంది రెబల్ ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే వైపు వలసబాట పడుతున్నారు. సుమారు ఏడాది క్రితమే అమ్మ పంచన చేసిన డీఎండీకే ఎమ్మెల్యేలు సుందరరాజన్ (మదురై సెంట్రల్), తమిళ్ అళగన్ (తిట్టకుడి), అరుణ్ సుబ్రమణియన్ (తిరుత్తణి), సురేష్‌కుమార్ (సెంగమ్), శాంతి ( సేందమంగళం), పాండియరాజన్ (విరుదనగర్), మైకేల్ రాయప్పన్( రాధాపురం), అరుణ్ పాండియన్ (పేరావూరణి) జనవరి చివరి వారంలో అన్నాడీఎంకేలో చేరుతున్నట్లు సమాచారం. అన్నాడీఎంకే చివరి అసెంబ్లీ సమావేశాలు ముగియగానే అన్నాడీఎంకే తీర్దం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది.