సీవీ ఆనంద్‌కు కీలక బాధ్యతలు
♦ తమిళనాడు, పాండిచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రత్యేక పరిశీలకునిగా నియామకం
♦ ఈ అవకాశం దక్కించుకున్న తొలి ఐపీఎస్‌గా గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌కు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడు, పాండిచ్చేరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రత్యేక పరిశీలకునిగా నియమిస్తూ భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన ఆయా రాష్ట్రాల్లో విధులు నిర్వర్తించేందుకు ఆనంద్ బుధవారం బయలుదేరి వెళ్లారు. సాధారణంగా ప్రత్యేక పరిశీలకులుగా ఐఏఎస్ అధికారులను నియమించే ఈసీఐ... దేశంలో తొలిసారిగా ఓ ఐపీఎస్ అధికారిని నియమించడం విశేషం. దీనిపై తెలంగాణలోని పోలీసు వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. 2014లో తెలంగాణలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి రూ.25 కోట్లు సీజ్ చేసిన ఆనంద్‌కు ఈసీఐ ‘బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్’ అవార్డును కూడా ప్రదానం చేసింది.
ఢిల్లీలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల అధికారుల సమావేశంలో ఆనంద్‌ను ప్రత్యేక ఆహ్వనితుడిగా పిలిపించి ఎన్నికల్లో అక్రమ నగదు, మద్యం పంపిణీ, ప్రశాంత నిర్వహణ తదితర అంశాలపై పాఠాలు చెప్పించింది. తాజాగా ఈఎస్‌ఐ ప్రత్యేక పరిశీలకునిగా ఆనంద్‌ను నియమించింది. ఈసీఐ ఆదేశాల మేరకు ఆయన తమిళనాడు, పాండిచ్చేరిలలో ఐదు రోజుల పాటు పర్యటించి స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, వాహనాలకు జీపీఎస్, బూత్ స్థాయి అవగాహన గ్రూప్‌లు, సీపీఎంఎఫ్, ఎక్సైజ్, బ్యాంకింగ్ లావాదేవీలు, పెయిడ్ న్యూస్ తదితరాలను సంబంధిత బృందాలు ఎలా నియంత్రిస్తున్నాయో పరిశీలించి నివేదిక సమర్పిస్తారు. ఈసీఐ తనకు ఈ బాధ్యతలు అప్పగించడం గౌరవంగా భావిస్తున్నానని ఆనంద్ చెప్పారు.