విజయ్ కాంత్ కు మరో గండం!
చెన్నై: కుంటి కుక్కపై కొబ్బరి బొండం పడినట్టుగా తయారైంది డీఎండీకే నేత విజయ్ కాంత్ పరిస్థితి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన 'కెప్టెన్' పార్టీకి మరో గండం పొంచివుంది. ఆయన పార్టీ గుర్తింపు రద్దయ్యే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.
గత ప్రభుత్వంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించిన విజయ్ కాంత్ తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. ప్రజా సంక్షేమ కూటమి(పీడబ్ల్యూపీ)తో జట్టు కట్టిన ఆయన ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయారు. ఆయన కూడా ఓటమి పాలయ్యారు. డీఎండీకే పార్టీకి కేవలం 2.4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్ర పార్టీగా ఎన్నికల సంఘం గుర్తింపు పొందాలంటే కనీసం 6 శాతం ఓట్లు కలిగివుండాలి.
2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన డీఎండీకే 29 సీట్లు దక్కించుకుంది. ఈసారి పరిస్థితి తారుమారైంది. డీఎండీకేతో పొత్తుకు డీఎంకే ప్రయత్నించినా ఫలించలేదు. కరుణానిధితో 'కెప్టెన్' చేతులు కలిపితే ఫలితాలు మరోలా ఉండేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఓటమి గల కారణాలను సమీక్షించుకుంటామని, తమ పరాజయానికి మనీ పవర్ ప్రధాన కారణంగా భావిస్తున్నామని మాజీ ఎంపీ కె. ధనరాజు తెలిపారు.