పెద్ద నోట్లు రద్దు చేయడం సాహసోపేతమైన చర్య అని, ఈ నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని నీతి ఆయోగ్
న్యూఢిల్లీ: పెద్ద నోట్లు రద్దు చేయడం సాహసోపేతమైన చర్య అని, ఈ నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని నీతి ఆయోగ్ ముఖ్యకార్యనిర్వహణాధికారి (సీఈవో) అమితాబ్‌కాంత్ అభిప్రాయపడ్డారు. శనివారం ఢిల్లీలో చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ.. నల్లధనాన్ని నియంత్రిస్తే ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందని , తద్వారా వృద్ధి రేటు 9- 10 శాతానికి చేరుతుందని అన్నారు.
ఆర్థిక వ్యవస్థ మరింత బలపడటానికి జీఎస్‌టీ, పెద్ద నోట్ల రద్దు అంశాలు దోహదపడతాయని చెప్పారు. నగదు రహిత లావాదేవీలతో అవినీతిని తగ్గించవచ్చని తెలిపారు. నల్లధనాన్ని అరికడితే బ్యాంకుల్లో నిధులు సమృద్ధిగా లభ్యమై, వడ్డీ రేట్లు తగ్గుముఖం పడతాయని వివరించారు. దేశంలో మార్కెట్ సంస్కరణలు ప్రవేశపెట్టాలని , అప్పుడే ఆర్థిక ఫలాలు పేద ప్రజలకు అందుతాయని చెప్పారు.