
2జీ కేసులో ఈడీ చార్జిషీట్
రాజా, కనిమొళి సహా 19 మందిపై అభియోగాలు
చార్జిషీట్‌పై నిర్ణయాన్ని 30న వెల్లడిస్తామన్న కోర్టు
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపు కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) శుక్రవారం ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. మాజీ టెలికం మంత్రి ఎ.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి, కరుణానిధి భార్య దయాళు అమ్మాళ్, స్వాన్ టెలికాం ప్రమోటర్లు షాహిద్ ఉస్మాన్ బల్వా, వినోద్ గోయెంకా సహా 19 మందిని అందులో నిందితులుగా పేర్కొంది. వీరిపై మనీల్యాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద అభియోగాలు నమోదు చేసింది. డీఎంకేకు చెందిన కలైంజ్ఞర్ టీవీకి స్వాన్ టెలికాం ప్రమోటర్లు రూ. 200 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది.
సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఓపీ సైనీకి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నవీన్‌కుమార్ మట్టా ఈ చార్జిషీటును అందజేశారు. ఈ వ్యవహారంలో డబ్బు చేతులు మారిన అంశంపై ఈడీ దర్యాప్తు చేసిందని, మనీల్యాండరింగ్ జరిగినట్లుగా గుర్తించిందని నవీన్‌కుమార్ చెప్పారు. స్వాన్ టెలికాం సంస్థకు లెసైన్సు ఇప్పించినందుకు బదులుగా... ఆ సంస్థ నుంచి వివిధ మార్గాల్లో కలైంజ్ఞర్ టీవీకి రూ. 200 కోట్లను చేరవేసినట్లుగా వెల్లడైందని తెలిపారు. కాగా, చార్జిషీట్‌పై తమ నిర్ణయాన్ని ఈ నెల 30న వెలువరిస్తామని పేర్కొంటూ న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు.