
కనిమొళి, రాజాలపై ఈడీ చార్జిషీట్లు!
డీఎంకే నాయకురాలు కనిమొళి, టెలికంశాఖ మాజీ మంత్రి ఎ.రాజాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) త్వరలోనే చార్జిషీట్లు నమోదు చేయనుంది. 2జీ స్పెక్ట్రం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈ చార్జిషీటు దాఖలు కానుంది. అటార్నీ జనరల్ కార్యాలయం ఇప్పటికే ఈడీ పంపిన చార్జిషీటును న్యాయమంత్రిత్వ శాఖకు పంపింది. దీనికి దేశంలోని అత్యున్నత న్యాయాధికారి గులాం ఇ. వాహనవతి ఆమోదముద్ర వేయాలని ఈడీ భావించింది. ఆ మేరకు ఆయన ఇప్పటికే దీన్ని ఆమోదించి, న్యాయశాఖకు పంపారు. అందువల్ల ఈడీ త్వరలోనే నియమ నిబంధనల ప్రకారం ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్ కూడా ఈ చార్జిషీటుపై తన అభిప్రాయాన్ని ఇప్పటికే వెల్లడించారు.
ఈ కేసుకు సంబంధించి దాదాపు రూ. 200 కోట్ల మొత్తాన్ని డీఎంకే కుటుంబం తమ కలైంగర్ టీవీలోకి మళ్లించినట్లు ఆరోపణలొచ్చాయి. అందుకు తమవద్ద ఆధారాలు కూడా ఉన్నాయని ఈడీ అంటోంది. ఈ విషయంలో గతంలో జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ఈడీ ఆధారంగా తీసుకుంటోంది.