
సాక్షి బెంగళూరు: ఆదాయ పన్ను ఎగవేత, నగదు అక్రమ రవాణా ఆరోపణలపై కర్ణాటక మంత్రి డీకే శివకుమార్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం కేసు నమోదు చేసింది. ఢిల్లీలోని కర్ణాటక భవన్ ఉద్యోగి హనుమంతయ్యతో పాటు మరికొందరిపై కూడా ఇదే కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. దీంతో శివకుమార్‌ను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
హవాలా మార్గాల్లో కోట్ల రూపాయల నగదు లావాదేవీలు జరపడం, ఆదాయపన్ను ఎగవేత ఆరోపణలతో ఆదాయ పన్ను శాఖ బెంగళూరు ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన చార్జిషీటు ఆధారంగా ఈడీ చర్యలకు దిగింది. ఎస్.కె. శర్మ, సచిన్ నారాయణ్, ఎన్.రాజేంద్ర, ఆంజనేయ హనుమంతయ్యల సహకారంతో మంత్రి శివకుమార్ భారీమొత్తంలో అక్రమంగా నగదును తరలించినట్లు ఐటీ శాఖ చార్జిషీటులో పేర్కొంది. నిందితుల వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు ఈడీ త్వరలోనే సమన్లు పంపనుంది. ఆగస్టులో ఢిల్లీ, బెంగళూరుల్లోని శివకుమార్ నివాసాల్లో ఐటీ విభాగం జరిపిన దాడుల్లో లెక్కల్లో చూపని రూ.20 కోట్ల నగదు బయటపడిన సంగతి తెలిసిందే.