లక్నోలో ఎన్‌కౌంటర్‌ | Encounter in Lucknow | Sakshi
Sakshi News home page

లక్నోలో ఎన్‌కౌంటర్‌

Published Wed, Mar 8 2017 1:57 AM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM

లక్నోలో ఎన్‌కౌంటర్‌

లక్నోలో ఎన్‌కౌంటర్‌

► ఇంట్లో దాక్కొన్న ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు
► రంగంలోకి ఏటీఎస్, పారామిలటరీ కమాండోలు

లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నో శివారులో ఒక ఇంట్లో దాక్కొన్న ఇద్దరు ఐసిస్‌ అనుమానిత ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు మంగళవారం అర్థరాత్రి వరకూ ఆపరేషన్  కొనసాగింది. కేంద్ర నిఘా విభాగాలు అందించిన సమాచారం మేరకు లక్నో ఠాకూర్‌గంజ్‌ ప్రాంతంలో ఒక ఇంట్లో ఉగ్రవాది నక్కినట్లు గుర్తించిన పోలీసులు... మంగళవారం యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌(ఏటీఎస్‌)తో కలిసి ఆ ఇంటిని చుట్టుముట్టారు. కొద్దిసేపటి అనంతరం ఆ ఇంట్లో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులున్నట్లు గుర్తించారు. వారి వద్ద భారీగా ఆయుధాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మంగళవారం అర్థరాత్రి వరకూ ఏటీఎస్‌ సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగాయి. ఎటీఎస్‌ సిబ్బందికి సాయంగా పారామిలటరీ బలగాలకు చెందిన కమాండోల్ని సంఘటనా స్థలానికి తరలించారు.  దాదాపు 20 మంది కమాండోలు ఈ ఆపరేషన్ లో పాలుపంచుకుంటున్నారని పోలీసులు తెలిపారు. ఇంట్లో దాక్కొన్న ఒక వ్యక్తిని సైఫుల్‌గా అనుమానిస్తున్న పోలీసులు అతనికి భోపాల్‌–ఉజ్జయిన్  రైలు పేలుడుతో సంబంధాలు ఉండవచ్చని అనుమానిస్తున్నారు.   ( భోపాల్‌ రైలులో పేలుడు )

ఉగ్రవాదులను పట్టుకునేందుకు అర్థరాత్రి వరకూ ప్రయత్నాలు కొనసాగించినా అవి విజయవంతం కాలేదు. ఏటీఎస్‌ ఆపరేషన్  కొనసాగుతుందని, ఐసిస్, దాని సాహిత్యంతో అనుమానితులు ప్రభావితమయ్యారని యూపీ అదనపు డీజీ దల్జీత్‌ చౌదరీ చెప్పారు. కాన్పూర్‌లో ఇద్దరు, ఇటావాలో ఒక అనుమానిత ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాన్పూర్‌లో అరెస్టు చేసిన ఇద్దరితో లక్నో అనుమానితులకు సంబంధాలుండవచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement