సాక్షి, న్యూఢిల్లీ : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్. ఖాతాదారుల నగదుపై వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ తగ్గించనుందని సమాచారం. 2019-20 ఏడాదికిగానూ 8.65 శాతం నుంచి 8.5 శాతానికి తగ్గించిన సంస్థ తాజాగా వడ్డీరేట్లను 8.1శాతానికి కోత పెట్టనుంది. మార్కెట్ అస్థిరత, ఆదాయం భారీగా క్షీణించిన కారణంగా సంస్థ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ ఈపీఎఫ్ఓ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఆడిట్ కమిటీతో త్వరలోనే సమావేశం కానున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఉద్యోగులు, యజమానుల భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ప్రకటించిన చర్యలు, ఖాతాదారులు ఎక్కువ నిధులను విత్‌డ్రా చేయడం, ద్రవ్య లభ్యతపై ప్రభావం చూపిందని భావిస్తున్నారు. ఈ వడ్డీ రేట్ల కోత దాదాపు 6 కోట్ల మంది ఖాతాదారులను ప్రభావితం చేయనుంది.
కాగా పీఎఫ్ ఖాతాలపై వడ్డీరేటును 8.65 శాతం నుంచి 8.5 శాతానికి కుదించినట్లు కేంద్ర మంత్రి సంతోష్ గాంగ్వర్ మార్చి మొదటి వారంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇంకా ఆమోదించలేదు. అటు కరోనా కాలంలో ఏప్రిల్ , మే నెలల్లో 11,540 కోట్ల రూపాయల మేర, 3.61 మిలియన్ల క్లెయిమ్‌లను పరిష్కరించినట్టు ఈపీఎఫ్ఓ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment