‘నీతి’ ఉపాధ్యక్షుడిగా పనగరియా | 'Ethics' vice panagariya | Sakshi
Sakshi News home page

‘నీతి’ ఉపాధ్యక్షుడిగా పనగరియా

Published Tue, Jan 6 2015 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 7:15 PM

'Ethics' vice panagariya

  • కొలంబియా వర్సిటీలో ఎకనమిక్స్ ప్రొఫెసర్
  •  గుజరాత్ అభివృద్ధి నమూనాకు గట్టి మద్దతుదారు
  • న్యూఢిల్లీ: ప్రణాళికాసంఘం స్థానంలో కేంద్రప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌కు తొలి ఉపాధ్యక్షుడిగా స్వేచ్ఛా మార్కెట్ ఆర్థికవేత్త అరవింద్ పనగరియా(62) నియమితులయ్యారు. మరో ఆరుగురు సభ్యులను, ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులను కూడా సోమవారం ప్రభుత్వం నియమించింది. వారిలో ఆర్థిక వేత్త బిబేక్ డెబ్రొయ్, డీఆర్‌డీఓ మాజీ డెరైక్టర్ జనరల్ వీకే సారస్వత్‌లను పూర్తిస్థాయి సభ్యులుగా, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్(హోం), అరుణ్ జైట్లీ(ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు), సురేశ్ ప్రభు(రైల్వే), రాధామోహన్‌సింగ్(వ్యవసాయం)లను ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియమించారు.

    నితిన్ గడ్కారీ(రవాణా), స్మృతి ఇరానీ(మానవ వనరులు), తావర్‌చంద్ గెహ్లాట్(సామాజిక న్యాయం, సాధికారత) ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. నీతి ఆయోగ్ అధ్యక్షుడిగా ప్రధాని నరేంద్రమోదీ వ్యవహరిస్తారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్ట్‌నెంట్ గవర్నర్లు నీతి ఆయోగ్ పాలకమండలి సభ్యులుగా ఉంటారు. అలాగే, వివిధ రంగాల్లో నిపుణులైన వారు సభ్యులుగా కొన్ని ప్రత్యేక ప్రాంతీయ మండళ్లు కూడా ఉంటాయి. ఆ సభ్యులను ప్రధానమంత్రి నామినేట్ చేస్తారు.

    ‘నీతి’ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విధానపరమైన అంశాల్లో దిశానిర్దేశం చేస్తుంది. జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన విధానాంశాల్లో ప్రభుత్వానికి వ్యూహాత్మక, సాంకేతిక సలహాలు, సూచనలు ఇస్తుంది. సహకార సమాఖ్య విధానం లక్ష్యంగా  కేబినెట్ తీర్మానం ద్వారా దీన్ని జనవరి 1న ఏర్పాటు చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో 1950 మార్చి 15న ప్రణాళికాసంఘాన్ని కూడా కేబినెట్ తీర్మానం ద్వారానే  ఏర్పాటు చేయడం గమనార్హం.

    ప్రణాళిక సంఘంలో డిప్యూటీ చైర్మన్ కీలక బాధ్యతలు నిర్వర్తించేవారు. కాగా, నీతి ఆయోగ్‌లో ఆ బాధ్యతలను వైస్ చైర్మన్‌గా అరవింద్ పనగరియా నిర్వర్తిస్తారు. నీతి ఆయోగ్ ఏర్పాటు ప్రకటన అనంతరం మోదీ.. ‘సాధికారత, సమానత్వం ముఖ్య లక్ష్యాలుగా.. ప్రజానుకూల, సానుకూల, భాగస్వామ్యయుత అభివృద్ధి ఎజెండా అనేది నీతి ఆయోగ్ మార్గదర్శక సూత్రం’ అని ట్వీట్ చేశారు.

    దేశ వృద్ధి పథంలో ఈ సంస్థ కీలక భాగస్వామిగా ఉండగలదన్నారు. కాలం చెల్లిన ప్రణాళికాసంఘం స్థానంలో ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉందని గత ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మోదీ చెప్పడం  తెలిసిందే. కాగా, ప్రణాళికాసంఘం వెబ్‌సైట్ ఇక గతం కానుంది. ప్రణాళికాసంఘానికి సంబంధించిన సమాచారం లభించే యూఆర్‌ఎల్ http://fb.me/3vZp1jjFrలింక్‌ను నీతి ఆయోగ్ ట్వీటర్‌లో వెల్లడించింది.
     
    స్వేచ్ఛావిపణి మద్దతుదారు.. అరవింద్ పనగరియా

    న్యూఢిల్లీ:  అరవింద్ పనగరియా ప్రఖ్యాత భారతీయ అమెరికన్ ఆర్థికవేత్త. భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్‌తో సత్కరించింది. ప్రస్తుతం ఆయన అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రం బోధిస్తున్నారు. ఇంతకుముందు ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌లో చీఫ్ ఎకనమిస్ట్‌గా మేరీలాండ్ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనమిక్స్‌లో ప్రొఫెసర్, కో డెరైక్టర్‌గా పనిచేశారు. డబ్ల్యూటీఓ, ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్), యూఎన్‌సీటీఏడీల్లోనూ పలు స్థాయిల్లో విధులు నిర్వర్తించారు. రాజస్థాన్‌లో వసుంధర రాజె ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించారు. రాజస్థాన్ వర్సిటీలో డిగ్రీ చదివిన  పనగరియా ఆర్థిక శాస్త్రంలో ప్రిన్స్‌టన్ వర్సిటీ నుంచి పీహెచ్‌డీ పొందారు. 15 పుస్తకాలను రచించారు. మార్కెట్ అనుకూల అభిప్రాయాలు కలిగిన గుజరాత్ అభివృద్ధి నమూనాకు గట్టి మద్దతుదారు. ప్రముఖ వాణిజ్య ఆర్థికవేత్త జగదీశ్ భగవతికి అత్యంత సన్నిహితుడు. భారత ఆర్థికరంగంపై చర్చకు రావాలంటూ ఆర్థికరంగంలో నోబెల్ పురస్కార గ్రహీత ఆమర్త్య సేన్‌కు వారిద్దరూ సవాళ్లు కూడా విసిరారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉండగా, ఆయన అభివృద్ధి నమూనాను  పనగరియా ప్రశంసించేవారు. పనగరియా, జగదీశ్‌లు రాసిన ‘ఇండియాస్ ట్రస్ట్ విత్ డెస్టినీ: డీబంకింగ్ మిత్స్ దట్ అండర్‌మైన్ ప్రోగ్రెస్ అండ్ అడ్రెసింగ్ న్యూ ఛాలెంజెస్’  పుస్తకంలో.. గుజరాత్ అభివృద్ధి మోడల్‌ను వృద్ధి, ప్రైవేట్ పారిశ్రామిక విధానం ఆధారంగా సాగిన అభివృద్ధిగా.. కేరళ అభివృద్ధి నమూనాను పునఃపంపిణీ, ప్రభుత్వం కేంద్రంగా సాగిన అభివృద్ధిగా అభివర్ణించారు. ఈ ధోరణికి భిన్నంగా.. ప్రజల ఉత్పాదకత పెరిగేలా సామాజిక మౌలిక వసతుల్లో ప్రభత్వం అధికంగా పెట్టుబడులు పెట్టాలని ఆమర్త్యసేన్ వాదిస్తారు.
     
    ‘లార్’జ డెరైక్టర్.. బిబేక్ డెబ్రొయ్

    ప్రస్తుతం న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆర్థిక వేత్త బిబేక్ డెబ్రొయ్(59) భారత ప్రభుత్వంలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాంటెంపరరీ స్టడీస్‌లో డెరైక్టర్‌గా, ఆర్థిక శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగానికి కన్సల్టెంట్‌గా, పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సెక్రటరీ జనరల్‌గా, న్యాయ సంస్కరణల పరిశీలన కోసం ఏర్పాటుచేసిన ప్రాజెక్టు లార్జ్(లీగల్ అడ్జస్ట్‌మెంట్స్ అండ్ రీఫామ్స్ ఫర్ గ్లోబలైజింగ్ ద ఎకానమీ)కు డెరైక్టర్‌గా విధులు నిర్వర్తించారు. మహాభారతం ఆంగ్ల అనువాదాన్ని ఇటీవలే పూర్తిచేశారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన డెబ్రొయ్ విద్యాభ్యాసం యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్,  కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని ట్రినిటీ కాలేజ్‌లో జరిగింది.
     
    ఉస్మానియా డాక్టరేట్.. సారస్వత్

    ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త. డీఆర్‌డీఓ డెరైక్టర్ జనరల్‌గా భారత క్షిపణి వ్యవస్థను బలోపేతం చేశారు. పృథ్వీ క్షిపణి రూపకల్పనలో కీలక భూమిక నిర్వర్తించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన సారస్వత్ గ్వాలియర్‌లో ఇంజినీరింగ్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఎంటెక్ చేశారు. ప్రొపల్షన్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌గా పరిశోధన చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పొందారు. 1998లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. గతంలో డీఆర్‌డీఓ ఆర్థిక వ్యవహారాలపై కాగ్ విమర్శలు చేసిన నేపథ్యంలో.. సారస్వత్ ఆర్థిక అధికారాలపై రక్షణ శాఖ తీవ్రమైన ఆంక్షలు విధించింది. 2013లో డీఆర్‌డీఓ చీఫ్‌గా పదవీకాలం కొనసాగింపు ప్రతిపాదనను ఆమోదించలేదు. కోర్టు ధిక్కార నేరం కింద 2014 సెప్టెంబర్‌లో మద్రాస్ హైకోర్టు ఆయనకు 3వారాల జైలు శిక్ష విధించింది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement