
ప్రియాంక రాక తప్పదా?
సాక్షి నాలెడ్జ్ సెంటర్ : ‘రాజకీయాలపై నాకు పెద్ద మోజేమీ లేదు. వాటి జోలికిపోకుండానే ప్రజలకు మేలు చేయగలను’ అని కొన్నేళ్ల క్రితం కాంగ్రెస్ జనాకర్షక నేత ప్రియాంకా గాంధీ అన్నారు. అయితే మారిన పరిస్థితుల్లో ఆమె రాజకీయాల్లోకి రావడమే కాదు, క్రియాశీలంగానూ పనిచేయనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆశించినన్ని సీట్లు రాని ప్రతిసారీ ‘ప్రియాంకా లావో, కాంగ్రెస్‌కో బచావో’ కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతూనే ఉన్నారు.
తెర వెనుక రాజకీయం!
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుతో దెబ్బతిని పల్చన కాకుండా కాంగ్రెస్‌ను కాపాడడానికి 4 నెలల క్రితమే ప్రియాంక క్రియాశీల పాత్ర స్వీకరించారు. అసెంబ్లీ ఎన్నికలకు సంసిద్ధతపై అక్టోబర్‌లో జరిగిన కాంగ్రెస్ సమీక్షా భేటీకి అధ్యక్షత వహించారు. మాజీ క్రికెటర్, బీజేపీ మాజీ ఎంపీ నవజోత్‌సింగ్ సిద్ధూను జనవరి 15న కాంగ్రెస్‌లో చేర్పించడంలో ఆమె కీలకపాత్ర పోషించారని వార్తలొచ్చాయి. తర్వాత వారం తిరగకుండానే యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీపార్టీ(ఎస్పీ)తో కాంగ్రెస్‌కు సీట్ల సర్దుబాటు కుదర్చడంలోనూ ఆమె ముఖ్య భూమిక పోషించారు. ఆమె కనౌజ్ ఎంపీ, యూపీ సీఎం అఖిలేశ్ భార్య డింపుల్‌తో, సీఎంతో మాట్లాడి కాంగ్రెస్‌కు 105 సీట్లిచ్చేలా ఒప్పించారని కాంగ్రెస్ నేతలే మీడియాకు తెలిపారు. సోనియా అనారోగ్యం వల్ల 2019 పార్లమెంటు ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక పోటీచేస్తారని వార్తలొస్తున్నాయి.
ఇందిర రూపం!
ముక్కు, జుట్టు విషయంలో ఇందిరతో ప్రియాంకకు పోలికలున్నాయని అంటారు. ఇందిర గొప్ప వక్త కాదు. ప్రియాంక కూడా బాగా ఆకట్టుకునేలా మాట్లాడకపోయినా, కాంగ్రెస్‌ను, తన కుటుంబాన్ని, భర్త వ్యాపార లావాదేవీలను సమర్ధిస్తూ చక్కగా ప్రసంగించిన సందర్భాలున్నాయి. 1999 ఎన్నికల్లో తొలిసారి పోటీచేసిన తల్లికి మద్దతుగా ప్రియాంక అమేథీలో తొలిసారి ప్రచారం చేశారు. 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో రాయ్‌బరేలీలో తల్లి సోనియా తరఫున, అమేథీలో సోదరుడు రాహుల్ తరఫున ప్రచార బాధ్యత భుజానవేసుకున్నారు. 2014 ఎన్నికల్లో రాహుల్ లక్షా ఏడు వేల ఓట్ల తేడాతోనైనా గెలవడం ప్రియాంక వల్లే సాధ్యమైందని తేలింది.
ముందున్న అడ్డంకులు
ప్రియాంక రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడానికున్న అడ్డంకులేంటి? భర్త రాబర్ట్ వాద్రా యూపీఏ అధికారంలో ఉన్నకాలంలో గాంధీ కుటుంబం అధికారం ఉపయోగించుకుని స్థిరాస్తి వ్యాపారంలో లబ్ధిపొందారనే చెడ్డపేరు తెచ్చుకున్నారు. ప్రియాంక పూర్తిస్థాయిలో రంగంలోకి దిగితే, భర్తపై వచ్చిన అభియోగాలను గుదిబండలా మోయక తప్పదు. రాజకీయాల్లో క్రియాశీల పాత్రతో ప్రియాంక నిలదొక్కుకున్నాక మరో సమస్య తలెత్తే ప్రమాదముంది. భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వం, పార్టీ నాయకత్వాలను అన్నాచెల్లెళ్లు పంచుకోవడం కూడా అనుకున్నంత తేలిక కాదు. ఇద్దరి మధ్య పోటీ తప్పకపోవచ్చు. ప్రియాంక కుటుంబ సభ్యులు ప్రధానులుగా దేశాన్ని ఏలిననాటి పరిస్థితులు ఇప్పుడు దేశంలోనూ, యూపీలోనూ లేవు. నిరంతర పోరాటం, పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే వివేకం, వ్యక్తిగత కృషితోనే ఏ నేతయినా పైకి రావాల్సిన స్థితి. ఈ నేపథ్యంలో ఎస్పీ–కాంగ్రెస్ కూటమికి అధికారం, కాంగ్రెస్‌కు తగినన్ని సీట్లు వచ్చేలా చేయగలిగితేనే ప్రియాంక అనే రాజకీయ ‘కార్డు’కు గుర్తింపు.
ఆ స్థానాల్లో పోటీ: ములాయం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ–కాంగ్రెస్ పొత్తుపై ములాయం సింగ్ యాదవ్ ఆగ్రహం కొనసాగుతోంది. పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు కేటాయించిన 105 స్థానాల్లో పోటీ చేయాలంటూ తన అనుచరులకు ములాయం సోమవారం పిలుపునిచ్చారు. ‘ఆ 105 స్థానాల్లోని సమాజ్‌వాదీ కార్యకర్తలేమైపోవాలి? పార్టీ ఇలా నాశనం కావడాన్ని నేను చూస్తూ ఉండలేను. కాంగ్రెస్‌కు పోటీగా ఎస్పీని నిలిపేందుకు జీవితకాలం కృషి చేశాను. ఈ పొత్తు వల్ల సమాజ్‌వాదీ పార్టీ నాశనం అవుతుంది’ అని ములాయం వ్యాఖ్యానించారు.