
యూపీ బాధ్యతలకు ప్రియాంక సై!
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచార బాధ్యతలకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ దాదాపు అంగీకరించినట్లు సమాచారం. ఆమె యూపీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పనిచేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి మరింత మైలేజ్ వస్తుందని, పార్టీకి విజయం కలిసొస్తుందని ఇప్పటికే వ్యూహకర్తలు చెప్పిన నేపథ్యంలో అందుకు ఆమె సూచాయగ అంగీకరించినట్లు పార్టీ వర్గాల సమాచారం. అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెల్లడి కానుందట. గతంలో రాయ్ బరేలీ, అమేథీలో తల్లి సోనియా, సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.
కానీ, ఈ సారి ఆ బాధ్యతల విస్తరణకు ఆమెకు అంగీకరించాలని పార్టీ నుంచి వ్యూహకర్తల నుంచి గత కొద్ది రోజులుగా డిమాండ్ వస్తోంది. మరో కొద్ది నెలల్లో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం అయిన ఉత్తర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 2017లో జరగనున్న ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా ఇక్కడి కాంగ్రెస్ పార్టీ యూపీ వ్యవహరాల ఇన్‌చార్జిగా గులాం నబీ ఆజాద్‌ను నియమించి ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన ఇటీవల పదేపదే ప్రియాంకతో భేటీ అవడం కూడా దాదాపు ప్రియాంక రాకడ ఖరారైనట్లేనని తెలుస్తోంది.