
రాజకీయాల్లో ఇక ప్రియాంక క్రియాశీలం?
'రాజకీయాలంటే నాకు పెద్ద మోజు లేదు. జనమంటే ఇష్టం. నేను రాజకీయాల్లో లేకుండానే ప్రజలకు మేలు చేయగలను'అంటూ కొన్నేళ్ల క్రితం కాంగ్రెస్ యువ నేత ప్రియాంకా గాంధీ వాద్రా అన్న మాటలు అప్పటికి సబబే అనిపిస్తాయి. భారత రాజకీయాల్లో 'మొదటి కుటుంబం' అయిదో తరం సభ్యురాలిగా ప్రియాంకకు ఉన్న ఆకర్షణ శక్తిని కాంగ్రెస్ వారితోపాటు మీడియా వ్యాఖ్యాతలు 20 ఏళ్లుగా ప్రస్తావిస్తూనే ఉన్నారు. అయినా ఆమె రాజకీయాల్లోకి లాంఛనంగా చేరలేదు. 1999 నుంచీ లోక్‌సభ ఎన్నికల్లో తల్లి, సోదరుడి నియోజకవర్గాలు రాయ్‌బరేలీ, అమేధీలో క్రమం తప్పకుండా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తూనే ఉన్నారు. దేశంలో, యూపీలో కాంగ్రెస్‌కు ఆశించినన్ని సీట్లురాని ప్రతిసారీ 'ప్రియాంకా లావో, కాంగ్రెస్‌కో బచావో' అని నెహ్రూగాంధీ కుటుంబం పుట్టినిల్లు అలహాబాద్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేస్తూనే ఉన్నారు.
తెర వెనుక రాజకీయం
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుతో దెబ్బతిని జనంలో పల్చన కాకుండా కాంగ్రెస్‌ను కాపాడడానికి నాలుగు నెలల క్రితమే ప్రియాంక క్రియాశీల పాత్ర స్వీకరించారు. అసెంబ్లీ ఎన్నికలకు సంసిద్ధతపై అక్టోబర్ చివరి వారంలో జరిగిన కాంగ్రెస్ సమీక్షా సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. ఆరు నెలల క్రితం బీజేపీకి రాజీనామా చేసి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎటుపోవాలో తేల్చుకోలేక గందరగోళంలో ఉన్న మాజీ క్రికెటర్, అమృత్‌సర్ మాజీ ఎంపీ నవజ్యోత్‌సింగ్ సిద్ధూను జనవరి 15న కాంగ్రెస్‌లో చేర్పించడంలో ప్రియాంక కీలకపాత్ర పోషించారని వార్తలొచ్చాయి.
తర్వాత వారం తిరగకుండానే యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ నేతత్వంలోని సమాజ్‌వాదీపార్టీ(ఎస్పీ)తో కాంగ్రెస్‌కు సీట్ల సర్దుబాటు కుదర్చడంలో కూడా ఆమె ముఖ్య భూమిక పోషించారు. ఆమె కనౌజ్ ఎంపీ, యూపీ సీఎం అఖిలేశ్ భార్య డింపుల్‌తో, సీఎంతో మాట్లాడి కాంగ్రెస్‌కు 105 సీట్లిచ్చేలా ఒప్పించి, పొత్తును కాపాడారని కాంగ్రెస్ నేతలే మీడియాకు తెలిపారు. రాయ్‌బరేలీ, అమేధీలోని పది అసెంబ్లీ స్థానాలకే పరిమితం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా, కుదిరితే డింపుల్‌తో కలిసి ప్రచారంలో ప్రియాంక పాల్గొంటారని కూడా చెబుతున్నారు. తల్లి సోనియాకు 70 ఏళ్లు నిండడమేగాక, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా 2019 పార్లమెంటు ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి ఆమె పోటీచేస్తారని వార్తలొస్తున్నాయి.
ప్రియాంక ఇష్టం....
ముత్తాత జవహర్‌లాల్ నెహ్రూ, నాయనమ్మ ఇందిరాగాంధీ ఇద్దరూ పదిహేనేళ్ల చొప్పున ప్రధాని పదవిలో ఉన్నారు. 40 సంత్సరాలకే ప్రధాని అయిన తండ్రి హత్యకు గురైన కారణంగా ఆయన ఐదేళ్లే ఉన్నత పదవిలో ఉన్నారు. ఆ తర్వాత 2004లో ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా తల్లి సోనియా పదవి తీసుకోవడానికి నిరాకరించారు. అప్పటి నుంచీ రాహుల్ మన్మోహన్‌సింగ్ కేబినెట్‌లో మంత్రిగా చేరతారని అనుకున్నారు. ఎందుకో యూపీఏ మొదటి హయాంలో ఆయన ఆ పనిచేయలేదు. యూపీఏ–2లోనూ మంత్రి పదవి వద్దనుకున్న రాహుల్ తల్లి తీవ్ర ఆనారోగ్యం వల్ల కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవి తీసుకున్నారు.
2014 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ను ప్రధాని పదవికి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించకున్నా ఆయనే పార్టీ ప్రచారానికి నాయకత్వం వహించారు. ప్రియాంక ఎప్పటిలా అమేథీ, రాయ్‌బరేలీకే పరిమితమయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 44 సీట్ల అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాక, మళ్లీ కాంగ్రెస్‌లో ప్రియాంక పాట మొదలైంది. దానిపై, ‘కాంగ్రెస్ క్రియాశీల రాజకీయాల్లోకి రావడం, రాకపోవడం ప్రియాంక ఇష్టం. పిల్లలను పెద్దచేసే పనిలో ఉన్న ఆమెను బలవంతంగా రాజకీయాల్లోకి లాగడం సబబు కాదు’’ అంటూ సోనియా, రాహుల్‌తోపాటు పార్టీ సీనియర్ నేతలు పలు సందర్భాల్లో చెప్పారు.
ఇందిర రూపం!
1997 ఫిబ్రవరిలో 25 ఏళ్ల వయసులో మొరాదాబాద్(పశ్చిమ యూపీ) వ్యాపారి రాబర్ట్ వాద్రాతో ఢిల్లీలో పెళ్లవక ముందు నుంచే ప్రియాంకలో ఇందిర పోలికల గురించి కాంగ్రెస్ నేతలు, మీడియా మాట్లాడడం మొదలైంది. ముక్కు, జుట్టు విషయంలో ఇందిరతో ప్రియాంకకు పోలికలున్నాయని అంటారు. ఇందిర గొప్ప వక్త కాదు. ప్రియాంక కూడా బాగా ఆకట్టుకునేలా మాట్లాడకపోయినా, కాంగ్రెస్‌ను, తన కుటుంబాన్ని, భర్త వ్యాపార లావాదేవీలను సమర్ధిస్తూ చక్కగా ప్రసంగించిన సందర్భాలున్నాయి. 5 అడుగుల 8 అంగుళాల ఎత్తున్న ఈమెను స్ఫురద్రూపిగానే అందరూ అంగీకరిస్తారు. 1999 ఎన్నికల్లో తొలిసారి పోటీచేసిన తల్లికి మద్దతుగా ప్రియాంక అమేధీలో మొదటిసారి ప్రచారం చేశారు.
మళ్లీ 2004లో రాయ్‌బరేలీ(సోనియా), అమేథీ(రాహుల్)లో, తిరిగి 2009లో ప్రియాంక ప్రచార బాధ్యత భుజానవేసుకోవడమేగాక, నియోజకర్గ ప్రజల పనులు చేయించడానికి తరచు రెండు చోట్లా పర్యటించేవారు. 2014 ఎన్నికల్లో అమేథీలో రాహుల్‌పై బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన నటి స్మతి ఇరానీ ముందు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆమె రాయ్‌బరేలీ వదలి అమేథీపైనే ఎక్కువ శ్రద్ధపెట్టి ప్రచారం చేశారు. అంతకు ముందు రెండుసార్లూ దాదాపు మూడు లక్షల మెజారిటీతో గెలిచిన రాహుల్ ఈసారి లక్షా ఏడు వేల ఓట్ల తేడాతోనైనా గెలవడం ప్రియాంక వల్లే సాధ్యమైందని తేలింది.
ఇందిరకు లేని అడ్డంకులు ప్రియాంకు ఏమున్నాయి?
తండ్రి జవహర్లాల్ నెహ్రూ తర్వాత 47 ఏళ్లకే కేంద్ర మంత్రి పదవి చేపట్టిన ఇందిర పోలికలున్న ప్రియాంకకు ఇప్పుడు 45 ఏళ్లు. మరి ప్రియాంక రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడానికి ఉన్న అడ్డంకులేంటి? ప్రియాంక భర్త రాబర్ట్ యూపీఏ అధికారంలో ఉన్నకాలంలో గాంధీ కుటుంబం అధికారం ఉపయోగించుకుని స్థిరాస్తి వ్యాపారంలో లబ్ధిపొందారనే చెడ్డపేరు తెచ్చుకున్నారు. ప్రియాంక పూర్తిస్థాయిలో రంగంలోకి దిగితే, భర్తపై వచ్చిన అభియోగాలను గుదిబండలా మోయక తప్పదు.
రాజకీయాల్లో క్రియాశీల పాత్రతో ప్రియాంక నిలదొక్కుకున్నాక మరో సమస్య తలెత్తే ప్రమాదముంది. భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వం, పార్టీ నాయకత్వాలను అన్నా చెల్లెళ్లు పంచుకోవడం కూడా అనుకున్నంత తేలిక కాదు. నెహ్రూ కాలంలో ఆయన పెద్ద చెల్లెలు విజయలక్ష్మీ పండిత్ వివిధ దేశాల్లో భారత రాయబారిగా, చివరిగా మహారాష్ట్ర గవర్నర్‌గా మాత్రమే పనిచేశారు. కాంగ్రెస్ గెలుపులో తన పాత్రను నిరూపించుకున్నాక ప్రియాంక పైన చెప్పినట్టు విజయలక్ష్మ్రి పండిత్‌లా అలంకారప్రాయమైన పదవులకే పరిమితం కావడం కూడా కష్టమే. 1980లో ఇందిర చిన్న కొడుకు సంజయ్ మరణించాక, ఆయన స్థానాన్ని కోడలు మేనకకు ఇందిర ఇవ్వలేదు. ఫలితంగా 2009 నుంచీ లోక్‌సభలో నెహ్రూ–గాంధీ కుటుంబసభ్యులు ఇద్దరు(సోనియా, రాహుల్) కాంగ్రెస్‌కు, మిగిలిన ఇద్దరు(మేనక, ఫిరోజ్ వరుణ్) బీజేపీకి ప్రాతినిధ్యం వహించే పరిస్థితి నెలకొన్నది.
కాంగ్రెస్‌కు పూర్వవైభవం వస్తే రాహుల్, ప్రియాంక మధ్య ఎంత వద్దనుకున్నా పోటీ తప్పకపోవచ్చు. ఇందిర భర్త, ప్రఖ్యాత పార్లమెంటేరియన్ ఫిరోజ్‌గాంధీతో ప్రియాంక భర్త రాబర్ట్‌ను పోల్చలేము. ఎన్నోరకాల వ్యాపారాలున్న రాబర్ట్ కార్యకలాపాలు, జీవనశైలి భార్యను తప్పక ఇబ్బంది పెడతాయి. ఇతర పార్టీల నేతలు కూడా అన్నా చెల్లెళ్లను ఒకేలా చూస్తారని కూడా కాంగ్రెస్ ఆశించకూడదు. ఎస్పీ నేత ములాయంసింగ్ సోమవారం విమానంలో లక్నో నుంచి ఢిల్లీ వస్తూ తనతో మంచి సంబంధాలు లేని రాహుల్ గురించి ఒక్క మాట చెప్పలేదు. పియాంక ప్రస్తావన తెచ్చి ‘‘ఆమె చాలా తెలివైనది. నన్నెంతో గౌరవిస్తుంది.’’ అని ములాయం కితాబిచ్చారు. ఇలాంటి సందర్భాలు ఇక ముందు చాలా ఎదరౌతాయి. ప్రియాంక కుటుంబ సభ్యులు ప్రధానులుగా దేశాన్ని ఏలిననాటి పరిస్థితులు ఇప్పుడు దేశంలోనూ, యూపీలోనూ లేవు. నిరంతర పోరాటం, పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే వివేకం, వ్యక్తిగత కృషితోనే ఏ నేతయినా పైకి రావాల్సిన స్థితి. ఈ నేపథ్యంలో మొదట ఎస్పీ కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసి తన పార్టీకి కనీసం మూడో వంతు సీట్లు(35), కూటమికి మెజారిటీ వచ్చేలా చేయగలిగితేనే ప్రియాంక అనే రాజకీయ 'కార్డు'కి గుర్తింపు లభిస్తుంది.
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)