
లక్నో : కేంద్ర ప్రభుత్వం కరోనా లాక్‌డౌన్‌ను మే 17వరకు పొడిగించిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ గైడ్‌లైన్స్ ప్రకారం రిటైల్ షాపులు, ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీలు ఇకపై తమ కార్యకలాపాలను ప్రారంభించవచ్చని చెప్పారు. శనివారం వివిధ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తికి అవకాశం లేకుండా పనులు చేసుకుంటున్న చక్కెర, ఇటుకల పరిశ్రమల్లా మిగిలిన అన్ని పరిశ్రమలు పనిచేయాలని పేర్కొన్నారు.
అదే విధంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తమ వారిని వెనక్కు తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక అధికారిని సైతం ఆయన నియమించారు. కరోనా ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యాన్ని పెంచాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకు 2,328 మంది కరోనా వైరస్ బారినపడగా, 654 మంది కోలుకున్నారు. 42 మంది మృత్యువాత పడ్డారు.