ఎఫ్‌బీలో వృద్ధ మహిళకు గాలమేసి..!
ఫేస్‌బుక్‌లో ఆమెకు 'ఫ్రెండ్' పేరిట అతడు పరిచయమయ్యాడు. తనకు కష్టాలు ఉన్నాయని నమ్మబలికాడు. 'పోర్ట్ ఫీజు' కట్టడానికి తనను సహకరించాలని కోరాడు. పాపం ఆ వృద్ధ మహిళ అతడి ఉచ్చులో పడింది. తన జీవితకాలం దాచుకొని.. తన కలైన బీఎండబ్ల్యూ కారు కొనేందుకు అట్టిపెట్టుకున్న 78వేల డాలర్ల (రూ. 52లక్షల)ను అతడి చేతిలో పోసింది. ముక్కుమొఖం తెలియకున్నా.. అతడు ఇచ్చిన వివిధ బ్యాంకు అకౌంట్లకు ఆ డబ్బును జమచేసింది. ఈ డబ్బును వడ్డీతో సహా చెల్లిస్తానని నమ్మబలికాడు. గత ఏడాది ఆగస్టులో మొదలైన ఈ వ్యవహరం ఏడాది చివరినాటికి ఆమె అతడి చేతిలో పోయడంతో ముగిసింది.
ఆ తర్వాత అతడు కనిపించకపోవడంతో ఆమె లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగింది. తాను మోసపోయానని ఆలస్యంగా గుర్తించిన బాధిత మహిళ తాజాగా, తాపీగా పోలీసులను ఆశ్రయించింది. ముక్కుమొఖం తెలియని వ్యక్తికి అంత డబ్బు ఎలా చేరిందనే అంశాన్ని పెన్సిల్వేనియా పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. కాలిఫోర్నియా, ఫ్లోరిడా, టెక్సాస్‌తోపాటు, భారత్‌లోని బ్యాంకుల్లోకి ఈ డబ్బు ప్రవహించినట్టు తెలుస్తోంది. ఈ డబ్బు వెళ్లిన విధాన్నాని ట్రాక్ చేసేందుకు ప్రస్తుతం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.