సాక్షి, న్యూఢిల్లీ : తప్పుడు వార్తల విషయంలో జర్నలిస్టులపై విధించిన ఆంక్షల విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తీవ్ర ఆందోళనల నేపథ్యంలో ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర సమాచార శాఖను ఆదేశించారు. పూర్తి ఆధారాలు లేకుండా కథనాలను ప్రచురిస్తే వాటిని ఫేక్ న్యూస్‌ల కింద పరిగణించి జర్నలిస్టుల అక్రిడేషన్‌ను రద్దు చేస్తామని గత రాత్రి కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
ఈ నేపథ్యంలో వివిధ ఛానెళ్ల, పత్రికల ఎడిటర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. జర్నలిస్టు సంఘాల నుంచి పెద్ద ఎత్తున్న నిరసనలు ఎదురయ్యాయి. దీనికి తోడు ఈ నిర్ణయం పత్రికా స్వేచ్ఛను హరించటమేనంటూ రాజకీయ పక్షాలు రంగంలోకి దిగాయి. ఆ ఉత్తర్వుల్లో ఏవైనా మార్పులు సూచించాలంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ ఉదయం ట్వీట్ చేశారు. అయినా ఆందోళనలు చల్లారకపోవటంతో నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఫేక్ న్యూస్‌ల వ్యవహారంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో చర్చించిన తర్వాతే ఈ మేరకు ఓ నిర్ణయం తీసుకోవాలని కేంద్ర సమాచార శాఖకు ప్రధాని మోదీ సూచించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment