కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైతు రుణమాఫీ అంశం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన చెలువేగౌడ(68) అనే రైతు సజీవ దహనం చేసుకున్నాడు.
బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైతు రుణమాఫీ అంశం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన చెలువేగౌడ(68) అనే రైతు సజీవ దహనం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. మండ్య జిల్లా కేఆర్ పేట తాలూకా నాటనహళ్లిలో ఈ ఘటన జరిగింది. చెలువేగౌడకు గ్రామంలో సుమారు మూడున్నర ఎకరాల పొలం ఉంది. ఇందులో పంటల సాగు కోసం బ్యాంకులో రూ. 1 లక్ష వరకు అప్పు చేశాడు. కరువు వల్ల నీరు లేక పంటలు పండకపోవడంతో నష్టాలకు తోడు రుణభారం పెరిగింది.
ప్రస్తుతం నెలకొన్న కరువు నేపథ్యంలో బుధవారం సీఎం ప్రకటించే బడ్జెట్‌లో రైతుల రుణాలను మాఫీ చేస్తుందని చెలువేగౌడ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు కాబట్టి రుణమాఫీ చేయలేకపోతున్నట్లు సీఎం సిద్ధరామయ్య ప్రకటించడం గమనార్హం. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన చెలువేగౌడ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి అక్కడ ఉన్న చెత్తను చితిగా మార్చి.. నిప్పు పెట్టి ఆ మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత రైతు భార్య పార్వతమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.