
ప్రజల కోసం.. పదెకరాలు అమ్మేశాడు!
ప్రజల బాగు కోసం సొంత ఆస్తుల్ని సైతం అమ్ముకునేందుకు వెనకాడని హీరోల్ని తెలుగు సినిమాల్లో చాలా సార్లే చూసుంటాం. కానీ, నిజజీవితంలో ఇలాంటి వాటికి చోటు ఉండదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుండే సమాజంలో పక్కవారి కోసం త్యాగాలు చేయడానికి ఎవరూ సాహసించరు. మహారాష్ట్రకు చెందిన 42 ఏళ్ల సంజయ్ టిడ్కే దీనికి భిన్నం. ఎవరో రావాలని, ఏదో చేయాలని.. చూసినన్నాళ్లు ఎదురు చూశాడు. నిరీక్షణలు ఫలించవని తెలుసుకున్నాక తానే స్వయంగా బరిలోకి దిగాడు.
ఇంతకీ, ఆయనేం చేశాడు?
మహారాష్ట్రలోని అకోలా జిల్లాకు చెందిన సంజయ్ టిడ్కేను చాలా కాలంగా ఓ సమస్య వేధిస్తోంది. అదే.. డ్యామ్..! అవును, తన పంట పొలాల మీదుగా వృథాగా పోయే కాలువ నీటిని ఎలాగైనా నిల్వచేయాలనుకున్నాడు. దీనికి ఓ చిన్నపాటి డ్యామ్ అవసరమవుతుందని ఆయనకు బాగా తెలుసు. అయితే, పదిమందికీ పనికొచ్చే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు ప్రభుత్వాలు పూర్తి చేయాల్సినవే అని సంజయ్ భావించాడు.
ఆ దిశగా అధికారులకు ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేశాడు. డ్యామ్‌ని నిర్మించి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరాడు. కానీ, ఏనాడూ ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఆయనకు సరైన సమాధానం రాలేదు. దీంతో ఓసారి తన ప్రయత్నంగా మట్టితో నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేశాడు. కానీ, ఆ ఏడాది కురిసిన వర్షాలకు మట్టి డ్యామ్ నిలబడలేదు. దీంతో సంజయ్ సహా రైతుల భూములన్నీ నీటమునిగాయి. పంటలు నాశనమై, వారంతా తీవ్రంగా నష్టపోయారు. కనీసం అప్పుడైనా ప్రభుత్వం తన అభ్యర్థనను మన్నిస్తుందని ఆశించాడు సంజయ్. కానీ, అలా జరగలేదు. ఎప్పటిలాగే ప్రభుత్వం ఉదాసీనత చూపింది.
ఈ ఘటనతో కళ్లు తెరచుకున్న సంజయ్.. తన ముప్పై ఎకరాల భూమిలోంచి కొంత భాగాన్ని అమ్మేసి కాంక్రీట్ డ్యామ్‌ను నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. అలా పదెకరాలు అమ్మగా వచ్చిన రూ.55 లక్షలతో డ్యామ్ నిర్మాణం ప్రారంభించాడు. ఇది చూసైనా సానుకూలంగా స్పందించాల్సిన అధికారులు విచిత్రంగా వ్యవహరించారు. సంజయ్‌ను వేధించడం మొదలుపెట్టారు. ఇసుకను అక్రమంగా అమ్ముకుంటున్నాడంటూ కేసులు పెట్టారు. అయితే, సంజయ్ దేనికీ భయపడలేదు. గ్రామస్థుల సహకారంతో సొంతంగానే కాంక్రీట్ డ్యామ్‌ను నిర్మించాడు. దీని స్టోరేజీ సామర్థ్యం 3 కోట్ల లీటర్ల పైమాటే. ప్రస్తుతం తుది దశలో ఉన్న నిర్మాణ పనులు.. జూన్ మొదటివారం నాటికి పూర్తి కావొచ్చు. ఇదే కనుక, ప్రారంభమైతే ఆ ప్రాంత రైతులు సిరులు పండిస్తారనడంలో ఆశ్చర్యం లేదు!