
న్యూఢిల్లీ/పట్నా: రైతులు చేపట్టిన దేశవ్యాప్త ఆందోళన రెండోరోజుకు చేరుకుంది. సరఫరా నిలిచిపోవటంతో కొన్ని నగరాల్లో కూరగాయల ధరలు పెరిగాయి. ఈ నెల 5వ తేదీ నుంచి ఆందోళనలను ఉధృతం చేయనున్నట్లు వామపక్ష రైతు సంఘాల సమాఖ్య హెచ్చరించింది. రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలు, రైతు రుణాల మాఫీ తదితర డిమాండ్లతో దేశంలోని 22 రాష్ట్రాల్లో 10 రోజుల పాటు నిరసనలు తెలపాలని రైతు సమాఖ్య పిలుపునివ్వడం తెల్సిందే.
పంజాబ్‌లోని నభా, లూథియానా, ముక్త్‌సర్, తరన్‌తారన్, నంగల్, ఫిరోజ్‌పూర్ తదితర ప్రాంతాల్లో రైతుల ఆందోళనలు కొనసాగాయి. పాలు, కూరగాయలను మార్కెట్లకు తీసుకెళ్తున్న వాహనాలను రైతులు అడ్డుకున్నారు. మీడియా దృష్టిని ఆకర్షించేందుకే ఆందోళనలు చేస్తున్నారని వ్యవసాయ మంత్రి రాధా మోహన్‌సింగ్ అన్నారు. రైతుల ఆందోళన పట్టించుకునే అంశమే కాదని హరియాణా సీఎం మనోహర్ ఖట్టర్ వ్యాఖ్యానించారు.