పావగడ (కర్ణాటక): కూతురు ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం నడుపుతుండటాన్ని అవమానంగా భావించిన ఓ తండ్రి ఆమెను హతమార్చాడు. పావగడ తాలూకా కిలార్లహళ్లి సమీపంలో ఎనిమిది నెలల క్రితం జరిగిన ఈ సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. పావగడ సీఐ ఆనంద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా మడకశిర మండలం తిరుమలదేవరపల్లి (టీడీపల్లి) తండాకు చెందిన శంకరనాయక, గౌరమ్మ కుమార్తె సరిత(18) అదే గ్రామానికి చెందిన వరుసకు మామ అయిన ఆనందనాయక అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న శంకరనాయక కుమార్తెను మందలించాడు. కొన్నాళ్ల పాటు కూతుర్ని బంధువుల ఇళ్లలో ఉంచాడు. అయినా ఆమె మనసు మారలేదు. దీంతో కుమార్తెను చంపాలని నిర్ణయించుకున్నాడు.
పథకంలో భాగంగా పావగడ తాలూకాలోని తన అత్త ఊరు కిలార్లహళ్లికి తీసుకెళుతున్నానని చెప్పి గతేడాది సెప్టెంబర్ 22న కుమార్తెతోపాటు ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. కిలార్లహళ్లి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి రాగానే గొంతుకు చున్నీ బిగించి, తలపై బండ రాయితో మోది ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గుర్తు తెలియని యువతి హత్యకు గురైనట్లు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఇటీవల ఓ వ్యక్తి అందించిన సమాచారంతో హత్యకు గురైంది సరిత అని, చంపింది తండ్రేనని నిర్ధారణకు వచ్చారు. నిందితుణ్ని బుధవారం అరెస్ట్ చేసి మధుగిరి కోర్టులో హాజరుపరిచారు.
కూతురి ప్రేమాయణం.. పరువు హత్య!
Published Wed, Jun 1 2016 11:11 PM | Last Updated on Mon, Sep 4 2017 1:25 AM
Advertisement
Advertisement