తను స్క్రీన్‌పై కనిపిస్తే చూపు తిప్పుకోవడం కష్టమే! తన క్రేజ్ చూసి స్టార్ హీరోలు సైతం కుళ్లుకునేవారు. 1980వ దశకంలో స్టార్ హీరోయిన్‌గా రాణించిందీ నటి. దక్షిణాదిన పలు భాషల్లో అగ్రతారగా వెలుగొందిన ఈ సీనియర్ హీరోయిన్ దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించింది. వెండితెర ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసిన ఆమె నిజ జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఆవిడే సరిత.. తన ప్రస్థానాన్ని నేటి కథనంలో చూసేద్దాం..
కెరీర్‌ను మలుపు తిప్పిన మరో చరిత్ర
సరిత తెలుగింటి అమ్మాయి. గుంటూరులోని మునిపల్లెలో జన్మించింది. ఈమె నటించిన తొలి చిత్రం 'మంచికి స్థానం లేదు'. కానీ దీనికంటే ముందు సరిత నటించిన 'మరో చరిత్ర' మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కమల్ హాసన్ సరసన కథానాయికగా నటించింది. కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హిట్ కావడంతో సరితకు తెలుగు, తమిళంలో బోలెడన్ని ఆఫర్లు వచ్చాయి. అలా ఆమె నటించిన సినిమాలు గ్రాండ్ సక్సెస్ అందుకున్నాయి. అటు మలయాళ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసింది సరిత.
ఎన్నో అవమానాలు..
తెలుగులో మహేశ్‌బాబు అర్జున్ సినిమాలో పోషించిన ఆండాలు పాత్రకుగానూ నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకుంది. నిజానికి సరిత అందంగా లేదని, ఆమె హీరోయినేంటని చాలామంది నవ్వుకున్నారు. కానీ అలా అవమానించినవారితోనే చప్పట్లు కొట్టేలా చేసింది నటి. కొన్ని సన్నివేశాల్లో సరిత డామినేషన్ చూసి ఆ సీన్లు తొలగించాలని కూడా చెప్పేవారట. కావాలంటే హీరోనైనా మారుస్తాం కానీ సరిత సీన్లు తొలగించేదేలేదని దర్శకులు మొండిగా బదులిచ్చేవారట. ఇక ఆమె కెరీర్ ఎదుగుదలను చూసి ఎందరో తారలు ఓర్వలేకపోయారని కూడా అంటుంటారు.
ఎందరో హీరోయిన్లకు గొంతు అరువిచ్చింది..
సాధారణంగా ఒక సెలబ్రిటీ స్థాయికి రాగానే గర్వం తలకెక్కుతుందంటారు. కానీ సరిత మాత్రం ఎప్పుడూ పక్కింటి అమ్మాయిలాగే కనిపించేది, అలాగే మసులుకునేది. ఇతర హీరోయిన్లకు గొంతు అరువివ్వడానికి కూడా ఎప్పుడూ వెనుకాడలేదు. విజయశాంతి, సుహాసిని, మాధవి, సౌందర్య, రమ్యకృష్ణ, నగ్మా, సిమ్రాన్, టబు, సుష్మితా సేన్, రోజా, రాధిక, ఆర్తి అగర్వాల్.. ఇలా ఎందరో తారలకు డబ్బింగ్ చెప్పింది. అమ్మోరు, మా ఆయన బంగారం, మావిచిగురు, అంతపురం సినిమాలకు డబ్బింగ్ చెప్పినందుకుగానూ ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా నాలుగు నందులు గెలుచుకుంది.
ప్రేమ పెళ్లి.. గొడవలు, వివాదం..
1988లో మలయాళ నటుడు ముఖేశ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది సరిత. వీరికి ఇద్దరు కొడుకులు శ్రవన్, తేజస్ సంతానం. కొంతకాలం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. ఈ గొడవలు విడాకులకు దారి తీశాయి. 2009లో ముఖేశ్.. సరిత నుంచి వివాహ రద్దు కోరుతూ కోర్టులో పిటిషన్ వేశాడు. సుదీర్ఘకాలంపాటు ఈ కేసు విచారణ జరగ్గా 2013లో వీరికి విడాకులు మంజూరయ్యాయి. ఆ తర్వాత ముఖేశ్.. మిధుల అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు.
చిన్న వయసులోనే పెళ్లి?
విడాకుల వ్యవహారం తర్వాత కుమారుడు శ్రవన్‌తో కలిసి దుబాయ్ వెళ్లిపోయిన సరిత ఇటీవలే చెన్నైకి తిరిగొచ్చింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత శివకార్తికేయన్ 'మావీరన్' సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. అయితే ముఖేశ్ కంటే ముందు తెలుగు నటుడు వెంకట సుబ్బయ్యతో 16 ఏళ్లకే సరిత పెళ్లి జరిగిందని, ఆరు నెలల పాటు కలిసున్న వీరు తర్వాత విడిపోయినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇక సరిత రెండో కొడుకు శ్రవణ్ డాక్టర్, యాక్టర్ కూడా. ఇతడు కల్యాణం అనే సినిమాలో నటించాడు.
Comments
Please login to add a commentAdd a comment