యూపీఏ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పేరుకుపోయిన అవినీతి ఓ యువ ఇంజనీరు ప్రాణాలను బలిగొంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్న సురేష్ (24) ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని మరణించాడు. ఈ పథకంలో విపరీతంగా పేరుకుపోయిన అవినీతిని సురేష్ ఏమాత్రం భరించలేకపోయాడని, దొంగ బిల్లులు సృష్టించడానికి, ఆమోదించడానికి నిరాకరించి.. పైనుంచి వచ్చిన ఒత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు అతడి తండ్రి మారిస్వామి శెట్టి తెలిపారు.
చామరాజనగర్ జిల్లాలోని కాగలవాడి గ్రామంలో సురేష్ పనిచేసేవాడు. గ్రామపంచాయతీ సర్పంచి సర్దార్, అతడి భార్య సరోజ, స్థానిక ప్రాజెక్టు అభివృద్ధి అధికారి (పీడీవో) వైరముడి కలిసి దొంగబిల్లులను ఆమోదించాల్సిందిగా సురేష్పై తీవ్ర ఒత్తిడి తెచ్చేవారని అతడి తల్లిదండ్రులు ఆరోపించారు. సురేష్ అందుకు నిరాకరించడంతో పాటు, వాళ్లు ఇవ్వజూపిన లంచాన్ని కూడా తిరస్కరించాడు. పైనుంచి కూడా దీనిపై ఒత్తిడి రావడంతో ఈ అవినీతిని భరించలేనంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 90 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేర్చగా అక్కడ మరణించాడు.
అవినీతిని భరించలేక ఇంజనీర్ ఆత్మహత్య
Published Tue, Jun 24 2014 2:35 PM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement