సాక్షి, ముంబై: నగరంలోని కొన్ని ప్రముఖ లోకల్ రైల్వే స్టేషన్‌లో మూత్ర విసర్జనకు పురుషుల నుంచి రూపాయి చార్జీ వసూలు చేయాలని సెంట్రల్ ైరె ల్వే నిర్ణయం తీసుకుంది. దీన్ని అక్టోబరు ఆఖరు నుంచి అమలు చేయనున్నారు. తొలుత సెంట్రల్, హార్బర్ రైల్వే మార్గంలోని ప్రముఖ 20 స్టేషన్లలో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం మూత్ర విసర్జనకు పురుషుల నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయడం లేదు.
కాని మరుగు దొడ్డి వాడినందుకు మాత్రం పురుషుల నుంచి రెండు రూపాయలు వసూలు చేస్తున్నారు. అదే మహిళల నుంచి మరుగుదొడ్డితోపాటు మూత్ర విసర్జనకు కూడా రూపాయి వసూలు చేస్తున్నారు. దీనిపై అనేకసార్లు మహిళ సంఘాలు గళమెత్తాయి. కాని ఎవరూ అంతగా పట్టిం చుకోలేదు. కాగా ఇంత తక్కువ ఆదాయంతో రైల్వే స్టేషన్లలో పురుషుల, మహిళల మరుగుదొడ్లు, పురుషుల మూత్రశాలలు ఇలా మూడు రకాల మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచడం కాంట్రాక్టర్లకు గిట్టుబాటు కావడం లేదు. దీంతో అవి ఎప్పుడు చూసినా అపరిశుభ్రంగా, దుర్గంధంతో దర్శనమిస్తున్నాయి.
ఆదాయం లేకపోవడంతో నాణ్యమైన సేవలు అందించేందుకు ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకు రావడం లేదు. దీంతో కాంట్రక్టర్లపై చర్యలు తీసుకునేందుకు అధికారం లేకుండా పోయింది. అవి పరిశుభ్రంగా ఉండాలంటే ఆదాయం రావాలి. కాని నిత్యం వేల సంఖ్యలో మూత్రశాలలు వినియోగించే పురుషుల నుంచి రూపాయి వసూలు చేస్తే వాటిని శుభ్రంగా ఉంచడం, నిర్వహణ పనులు చేపట్టడం లాంటివి సాధ్యమవుతుందని రైల్వే భావించింది. ఒకవేళ అవి అపరిశుభ్రంగా ఉంటే కాంట్రాక్టర్‌ను నిలదీసేందుకు లేదా చర్యలు తీసుకునేందుకు రైల్వేకు అధికారం కూడా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది.
అందుకు ఆసక్తిగల కాంట్రాక్టర్ల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించింది. ఈ నిర్ణయానికి కాంట్రాక్టర్ల నుంచి భారీగా స్పందన వస్తుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ‘శివారు ప్రాంతాలైన కర్జత్, కసారా, పన్వేల్ లాంటి దూరప్రాంతాలనుంచి నిత్యం లక్షలాది మంది ఉద్యోగులు నగరానికి వస్తారు. కనీసం రెండు, రెండున్నర గంటలపాటు లోకల్ రైలులో కూర్చున్న ప్రయాణికులకు రైలు దిగిన తర్వాత మూత్ర ం రావడం సహజమే. అందుకు స్టేషన్‌లో ఉన్న మూత్రశాలలను వినియోగించక తప్పదు.
ఇప్పడు ఉచితంగా ఉపయోగించినప్పటికీ వచ్చే నెల నుంచి రూపాయి చెల్లించక తప్పదు. ఈ చార్జీని కేవలం ప్రముఖ, రద్దీ స్టేషన్లలో మాత్రమే వసూలు చేయనున్న’ట్లు అధికారులు చెప్పారు. ఆ తర్వాత ప్రయాణికుల నుంచి వచ్చే స్పందన, వ్యతిరేకతను బట్టి మళ్లీ తుది నిర్ణయం తీసుకుంటామని రైల్వే అధికార వర్గాలు స్పష్టం చేశాయి.
ఇకపై మగవాళ్లకూ ‘చార్జి’!
Published Sat, Sep 20 2014 11:49 PM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM
Advertisement
Advertisement