రూపాయి లేనిదే మనకు పూట గడవదు.. రూపాయిని తలవకుండా రోజు గడవదు..
ఎక్కడిదీ రూపాయి?
రూపాయి లేనిదే మనకు పూట గడవదు.. రూపాయిని తలవకుండా రోజు గడవదు.. మరి దానికి ఆ పేరెలా వచ్చిం దో తెలుసా?.. ‘రూప్యక్’ అనే సంస్కృత పదం నుంచి మన ‘రూపీ’ వచ్చింది. ఆ పదానికి ‘వెండి నాణెం’ అని అర్థం. అంగరంగ వైభవంగా విలసిల్లిన మగధ సామ్రాజ్య కాలం నుంచి ఈ వెండి నాణాలు చెలామణీలో ఉండేవి. తర్వాత ‘రుపియా’ పేరుతోనే 1486-1545 సంవత్సరాల మధ్య అప్పటి పాలకుడు షేర్‌షా సూరి వెండి నాణాలను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి మన రూపాయికి ఆ పేరే కొనసాగుతూ వచ్చింది.
కాగితం కాదు.. క్లాత్
అసలు కరెన్సీ నోట్లు ఎలా తయారవుతాయో తెలు సా? చూడడానికి కాగితంలా ఉన్నా సాంకేతికంగా అది కాగితం కాదు.. అలా కనిపించే ఒక రకమైన వస్త్రం. పత్తి, లినెన్ పోగులతో తయారు చేసే ఈ ప్రత్యేక వస్త్రాన్ని... అత్యంత ఒత్తిడికి గురిచేసి, ప్రింట్ చేస్తారు. దాంతో కాగితంలా కనిపిస్తుంది. సాధారణంగా ఏ కాగిత మైనా.. నీటిలో తడిస్తే ఎక్కడికక్కడ చిరిగిపోయి, ముద్దగా అవుతుంది. అదే నోట్ల తయారీకి వాడేది వస్త్రం కాబట్టే తడిసినా, చివరికి వాషింగ్ మెషీన్‌లో పడినా.. ముద్దగా అవడం జరగదు.
ఎక్కడిదో తెలుసా?
మీ చేతిలో రూపాయిదో, ఐదు రూపాయలదో నాణెం ఉందా? మరి అదెక్కడ తయారైందో గుర్తించగలరా... చాలా సింపుల్! ఒకసారి ఆ నాణెంపై ముద్రించిన సంవత్సరం కింద చూడండి. అక్కడ నక్షత్రం (స్టార్) గుర్తు ఉందా? అయితే అది మన హైదరాబాద్ లో తయారైంది. ఇలా దేశంలో 4 ప్రాంతాల్లో నాణాలను ముద్రిస్తారు. నోయిడాలో ముద్రించే వాటిపై చుక్కను, ముంబై మింట్ లో డైమండ్ గుర్తును ముద్రిస్తారు. ఇక కోల్కతాలో తయారయ్యే నాణాలపై ఏ గుర్తు ఉండదు.