న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రఘాతుకాన్ని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్‌ఏటీఎఫ్) తీవ్రంగా ఖండించింది. జైషే ముహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు అందుతున్న ఆర్థిక సహాయాన్ని నిలువరించడంలో పాకిస్తాన్ విఫలమైందని పేర్కొంది. ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం నిలిపివేతకు సంబంధించి తాము జారీ చేసిన 27 అంశాల కార్యాచరణ ప్రణాళికను వచ్చే సెప్టెంబర్‌లోగా అమలు పరచకపోతే బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని పాక్‌ను హెచ్చరించింది. ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహాయాన్ని అరికట్టడం లక్ష్యంగా ఎఫ్‌ఏటీఎఫ్ పనిచేస్తోన్న విషయం తెలిసిందే. ఉగ్ర సంస్థలకు ఆర్థిక సహాయం వల్ల తలెత్తే తీవ్ర పరిణామాలను అంచనా వేయడంలో పాక్ విఫలమైందని, తాము ఇచ్చిన కార్యాచరణను సరైన విధంగా అమలు చేసేందుకు పాక్ తన వ్యూహాత్మక లోపాలను సరిచేసుకోవాలని వెల్లడించింది. తమ కార్యాచరణను అమలు చేయడంలో కొద్దిగా పురోగతి కనిపించిందని, 2019 మే నాటికి తమ కార్యాచరణను పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిం దేనని స్పష్టం చేసింది.
అంతవరకు ప్రస్తుతం ఉన్న గ్రే లిస్ట్‌లోనే దాన్ని కొనసాగించాలని పారిస్‌లో వారం పాటు జరిగిన సమావేశం చివర్లో ఎఫ్‌ఏటీఎఫ్ నిర్ణయించింది. అలాగే పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40 మంది జవాన్ల కుటుంబాలకు ఎఫ్‌ఏటీఎఫ్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపింది. పుల్వామా దాడికి కారకులైన జైషే ముహమ్మద్ ఉగ్రవాద సంస్థకు పాకిస్తాన్ ఆర్థికంగా సహకరిస్తున్నందున దానిని బ్లాక్ లిస్టులో పెట్టాలంటూ భారత ప్రభుత్వం ఎఫ్‌ఏటీఎఫ్‌పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తోంది. పుల్వామా దాడిలో పాక్ పాత్రను నిరూపించే ఆధారాలతో ఒక పత్రాన్ని కూడా రూపొందించి ఎఫ్‌ఏటీఎఫ్‌కు అందజేసింది. ‘పాకిస్తాన్‌కు జైషే ముహమ్మద్ సంస్థతో ఎలాంటి సంబంధాలున్నాయో, ఆ ప్రభుత్వం జైషే ముహమ్మద్ ఉగ్రవాదులకు ఎలా ఆర్థిక సాయం చేస్తోందో ఆ పత్రంలో వివరంగా చెప్పాం. గతంలో ఆ సంస్థ భారత్‌లో జరిపిన దాడుల్ని కూడా ఉదహరించాం’అని ఈ ప్లీనరీకి భారత ప్రభుత్వం తరఫున హాజరైన భద్రతా అధికారి ఒకరు చెప్పారు.
జూన్ 2019లో పునఃపరిశీలన..
ఈ సమీక్షకు భారత్ తరఫున హాజరైన ప్రతినిధి పాకిస్తాన్‌లో ఆశ్రయం పొందుతున్న ఉగ్ర సంస్థలే పుల్వామా ఉగ్ర దాడికి కారణమని నిరూపించేందుకు కొత్త సమాచారాన్ని ప్లీనరీకి సమర్పిం చారు. వీటిని పరిశీలించిన ఎఫ్‌ఏటీఎఫ్ పాక్‌ను గ్రే లిస్టులోనే ఉంచాలని తీర్మానిం చింది. ఈ తీర్మానా నికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, భారత్ మద్దతు తెలిపాయి. తిరిగి ఈ ఏడాది జూన్‌లో గ్రే లిసుపై పరిశీలన జరిపి గ్రే లిస్టులోనే ఉంచాలా?బ్లాక్ లిస్టులో పెట్టాలా? అన్నది నిర్ణయిస్తుంది.
బ్లాక్ లిస్టులో పెడితే..
ఏ దేశాన్నయినా బ్లాక్ లిస్టులో పెట్టడమంటే మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు ఆర్థిక సాయాలను అరికట్టేందుకు అంతర్జాతీయంగా జరుగుతున్న పోరాటానికి ఆ దేశం సహకరించడం లేదని అర్థం. ఎఫ్‌ఏటీఎఫ్ పాక్‌ను బ్లాక్ లిస్టులోకి చేర్చడం వల్ల ఆ దేశానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఐరోపా సమాజం వంటి రుణదాతలు ఆ దేశానికి గ్రేడ్ తగ్గిస్తాయి. దీంతో పాక్‌కు విదేశీ రుణాలు లభించడం కష్టమవుతుంది. అక్రమ నగదు లావాదేవీలు, ఉగ్రవాదులకు ఆర్థికసాయం అందకుండా ఉండేందుకు అవసరమైన చర్యలను పర్యవేక్షించేందుకు ఎఫ్‌ఏటీఎఫ్ ఏర్పడింది.
గ్రే లిస్ట్‌లోకి ఇలా..
అక్రమ నగదు చలామణి, ఉగ్రవాదులకు నిధుల సరఫరాను అడ్డుకోవడానికి ప్రయత్నం చేయని దేశాలను ఎఫ్‌ఏటీఎఫ్ ముందు గ్రే లిస్ట్‌లో తర్వాత బ్లాక్ లిస్టులో పెడుతుంది. ఆయా దేశాలు ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని నిలిపివేశాయని నమ్మకం కలిగాక వాటిని ఆయా జాబితాల నుంచి తొలగిస్తుంది. గతేడాది జూన్‌లో పాకిస్తాన్‌ను గ్రే లిస్టులోకి చేరుస్తూ ఎఫ్‌ఏటీఎఫ్ నిర్ణయం తీసుకుంది. అలాగే గత అక్టోబర్‌లో గ్రే లిస్టుకు సంబంధించి మొదటి సమీక్ష నిర్వహించగా.. తాజాగా రెండోసారి సమీక్ష నిర్వహించింది. 2012–15 మధ్య కాలంలో పాక్ ఈ జాబితాలోనే ఉన్నా దాని వైఖరి మారకపోవడంతో మళ్లీ గతేడాది ఈ జాబితాలోకి ఎక్కింది.
Comments
Please login to add a commentAdd a comment