లక్ష వాట్సప్ మెసేజిలు.. ఓ పాప ఆచూకీ
ఝాన్వి.. ఈ పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అయ్యింది. ఆమె ఫొటో కూడా విస్తృతంగా షేర్ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో సెలబ్రిటీ అనుకుంటున్నారా.. కాదు. న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద తన అమ్మానాన్నలతో కలిసి వెళ్లి.. సెప్టెంబర్ 28వ తేదీన తప్పిపోయిన మూడేళ్ల పాప. ఆమె ఆచూకీని తెలుసుకోడానికి ఉపయోగపడిన ఏకైక సాధనం.. సోషల్ మీడియా. చిన్నారి ఝాన్వి ఫొటోను పంపి.. ఈమె ఎక్కడైనా కనపడితే ఫలానా నెంబరుకు ఫోన్ చేయించాలన్న మెసేజి వాట్సప్లో లక్ష సార్లు షేర్ అయ్యింది. ఫేస్బుక్లో ఆమె ఆచూకీ కనుక్కొనేందుకు ఒక ప్రత్యేక పేజీ ప్రారంభించారు. దాంతో దాదాపు వారం రోజుల తర్వాత అక్టోబర్ 5వ తేదీన ఆమె ఢిల్లీలోని జనక్పురి ప్రాంతంలో కనిపించింది. అప్పటికి ఆమెకు గుండు చేసి, మెడలో ఆమె పేరుతో ఒక ప్లకార్డు వేలాడుతూ ఉంది.
ఝాన్వి మేనమామ తరుణ్ గ్రోవర్ ఈ వెతుకులాట గురించి వివరించారు. తాము మొత్తం పది మంది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లం ఉన్నామని, అంతా బృందాలుగా విడిపోయి వెతికామని అన్నారు. హోం మంత్రి దగ్గర నుంచి అందరినీ కలిశామని, పోలీసులతో కూడా సమన్వయం చేసుకున్నామని తెలిపారు. చివరకు సోషల్ మీడియాను ఆశ్రయించామన్నారు. అయితే ఎవరికి వాళ్లు షేర్ చేయాలంటే కష్టం కాబట్టి ఫేస్బుక్, వాట్సప్లకు తాము డబ్బు చెల్లించి ప్రకటనలా ఈ మెసేజి పంపామని, వాట్సప్లో అయితే లక్ష మెసెజిలు వెళ్లాయని ఆయన వివరించారు. అయితే మరీ ఇంతలా ప్రచారం చేస్తే పాపకు ఏదైనా అపాయం తలపెట్టే అవకాశం ఉందని కూడా పోలీసులు ఓ సమయంలో భయపడ్డారు.
అయితే, ఝాన్విని ఎత్తుకెళ్లినవాళ్లు డబ్బు మాత్రం డిమాండు చేయలేదు. బహుశా పిల్లలు లేనివాళ్లు తీసుకెళ్లి ఉంటారని, ఆమెను గుర్తుపట్టకుండా ఉండేందుకు గుండు చేశారేమోనని పోలీసులు భావిస్తున్నారు. అయితే అన్ని మీడియాల్లో పాప ఫొటో బాగా ప్రచారం కావడంతో భయపడి వదిలేసి ఉంటారని అదనపు కమిషనర్ త్యాగి చెప్పారు.