న్యూఢిల్లీ: విశ్వహిందూ పరిషత్ నేత సాధ్వీ ప్రాచీపై కేసు నమోదు అయింది. ముస్లిం ముక్త్ భారత్'కు ఇదే తరుణమంటూ ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రాచీ వ్యాఖ్యలపై బహుజన్ ముక్తి మోర్చ కార్యకర్త సందీప్ కుమార్ ఫిర్యాదు చేయడంతో ఆమెపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు సాధ్వీ ప్రాచీపై ఐపీసీ సెక్షన్ 153 ఏ, ఐపీసీ 153బీ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్వో సంజయ్ పాండే తెలిపారు.
కాంగ్రెస్ ముక్త్ భారత్' మిషన్ దాదాపు పూర్తి కావచ్చిందని, 'మస్లిం ముక్త్ భారత్'కు సమయం ఆసన్నమైందని ఈ నెల 7న రూర్కీలో ఆమె వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. గతంలోనూ పలుసార్లు సాధ్వీ ప్రాచీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ ఖాన్‌ల సినిమాలు బాయ్‌కాట్ చేయాలని, ముస్లిం విద్యా సంస్థలపై విచారణ జరపించాలని డిమాండ్ చేశారు.