అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. 1,138మంది యాత్రికులు అమర్ నాథ్ యాత్రకు జమ్మూ నుంచి బయలుదేరారు.
జమ్మూ: అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. 1,138మంది యాత్రికులు అమర్ నాథ్ యాత్రకు జమ్మూ నుంచి బయలుదేరారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్, మరో మంత్రి ప్రియా సేథి, లోక్ సభ సభ్యుడు జుగాల్ కిషోర్ జమ్మూలోని భగవతి నగర్ యాత్రి నివాస్ వద్ద శుక్రవారం ఉదయం 5గంటలకు జెండా ఊపి యాత్ర ప్రారంభించారు. తొలి యాత్రకు బయలుదేరిన వారిలో 900మంది పురుషులు, 225మంది మహిళలు, 13మంది పిల్లలు ఉన్నారు.
మొత్తం 24 మినీ బస్సుల్లో, ఇతర ప్రైవేటు వాహనాల్లో బయలుదేరారు. వీరి వెనుక ప్రత్యేక భద్రతా బలగాలు కూడా కదిలాయి. శనివారం నుంచి అమర్ నాథ్ ఆలయం దర్శన యాత్ర ప్రారంభవుతున్న నేపథ్యంలో తొలి బ్యాచ్ కు శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సరిహద్దు ప్రాంతంలో భారీ ఎత్తున చొరబాట్లు దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈసారి కేవలం భద్రత బలగాలనే కాకుండా ప్రత్యేక ఇంటెలిజెన్స్ వర్గాలను కూడా యాత్రలో భాగం చేస్తున్నారు. ఈ రోజు రాజ్ నాథ్ సింగ్ భద్రతా ఏర్పాట్లు సమీక్షించేందుకు జమ్మూకాశ్మీర్ వస్తున్నారు. ఆయన రెండురోజులపాటు ఇక్కడే ఉంటారు. 48 రోజులపాటు సాగే ఈ యాత్ర ఆగస్టు 18న ముగుస్తుంది.