‘గాలి ఆడక.. చెమటతో చాలా ఇబ్బంది పడ్డాం’ | Flight Crew Complains On First Day Hot And Humid In PPE Suits | Sakshi
Sakshi News home page

తొలి రోజు అనుభవాలు వెల్లడించిన విమానాయన సిబ్బంది

Published Tue, May 26 2020 10:01 AM | Last Updated on Tue, May 26 2020 10:07 AM

Flight Crew Complains On First Day Hot And Humid In PPE Suits - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్‌ వల్ల నిలిచిపోయిన విమాన సర్వీసులు రెండు నెలల తర్వాత సోమవారం పునఃప్రారంభమయిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వల్ల విమానాశ్రయాలు, విమానం లోపల పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు విమానాయన సిబ్బంది తొలి రోజు తమ అనుభవాలను మీడియాకు వెల్లడించారు. ‘రెండు నెలల తర్వాత ప్రయాణం చేస్తున్నాము. పద్దతుల్లో ఎలాంటి మార్పు లేదు.. విమానాలు సమాయానికి అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ప్రయాణికుల సంఖ్య చాలా తక్కువగా ఉంది.. మేం కాక్‌పిట్‌లో ఉన్నాం కాబట్టి చాలా భద్రంగా ఉన్నాము’ అని పైలెట్‌, కో పైలెట్‌ తెలిపారు. (ముఖానికి మాస్కులు.. షీల్డులు)

అయితే క్యాబిన్‌ క్రూ మాత్రం పీపీఈ కిట్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ‘మా యూనిఫామ్‌లు చాలా సౌకర్యంగా ఉండేవి. అసలే వేసవి, అధిక ఉష్ణోగ్రత ఇలాంటి సమయంలో పీపీఈ కిట్లు ధరించి పని చేయడం చాలా కష్టంగా ఉంది. గాలి సరిగా ఆడదు. కొన్ని సార్లు చెమట పట్టి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఏదైనా అత్యసర పరిస్థితి ఎదురైతే వెంటనే స్పందించడానికి కుదరదు. అయితే ప్రస్తుతం విమానం లోపల ఆహారం, కూల్‌డ్రింక్‌లు వంటివి అనుమతించకపోవడం వల్ల మా పని కాస్తా సులువు అయ్యింది’ అన్నారు. (కరోనా ప్రభావమే ఎక్కువ..)

విమానాశ్రయం లోపల కూడా చాలా మార్పులు వచ్చాయి. ప్రయాణికుల వస్తువులను ఓ డిసిన్‌ఫెక్టెంట్‌ కన్వేయర్‌ బెల్టు గుండా వెళ్లాయి. ప్రయాణికులు రాగానే భద్రతా సిబ్బంది వారి గుర్తింపు కార్డులు చూపించమని కోరారు. సిబ్బంది భద్రత కోసం విమానాశ్రయ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులు కూడా పూర్తి శరీర రక్షణ సూట్లు ధరించారు. ఓ వ్యక్తి మా తాతను కలవడానికి వెళ్లి అక్కడే చిక్కుకుపోయాను. రెండు నెలల తర్వాత ఇంటికి వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది అన్నారు.(విడతలుగా విమాన సర్వీసులు?)

కరోనా భయంతో విమానాల రాకపోకలకు కొన్ని రాష్ట్రాలు ఆసక్తి చూపకపోవడం, కొన్ని ఎయిర్‌పోర్టుల్లో పరిమిత సంఖ్యలోనే విమానాలకు అనుమతించడంతో తొలిరోజే 630 విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని విమానయాన పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాలు విమానాల సర్వీసులను ఇప్పుడే ప్రారంభించడానికి విముఖత వ్యక్తం చేశాయి. అలాగే ముంబై, చెన్నై, హైదరాబాద్‌ తదితర ప్రధాన ఎయిర్‌పోర్టుల నుంచి సర్వీసుల సంఖ్యను కుదించారు. రాష్ట్రాల అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వ ప్రకటన మేరకు సోమవారం 630 విమానాలను రద్దు చేశారు. ఈ విషయం తెలియక చాలామంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులకు చేరుకున్నారు. విమానాలు రద్దయ్యాయని తెలిసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు.(630 విమానాలు రద్దు)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement