మెహసనా (గుజరాత్): పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా అన్ని రంగాల్లో తమదైన నైపుణ్యంతో మహిళామణులు దూసుకెళ్తున్నారు. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ యుగంలో ప్రతి ఒక్కరికీ మొబైల్ లేనిదే పూట గడవదు..! అయితే, గుజరాత్‌లోని బనస్కాంత దంతివాడ ఠాకూర్ సంఘం మాత్రం భిన్న వాదన వినిపిస్తోంది. అమ్మాయిలకు కొత్త రూల్ విధించింది. పెళ్లికాని అమ్మాయిలు మొబైల్ ఫోన్లు వాడొద్దని హుకుం జారీ చేసింది. మెహసనా జిల్లా జలోల్ గ్రామంలో ఠాకూర్ సంఘం ఇటీవల ఒక సమావేశాన్ని నిర్వహించి, గ్రామ ప్రజలంతా కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త నిబంధనల ప్రకారం అవివాహితులైన అమ్మాయిలు మొబైల్ ఫోన్లు ఉపయోగించకూడదని తీర్మానించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారు శిక్షార్హులు. ఇందుకు శిక్షగా అమ్మాయి తండ్రి జరిమానాగా రూ.1.50 లక్షలు చెల్లించాలి.
ఇవే కాకుండా.. వివాహ సమయాల్లో టపాసులు కాల్చడం, డీజే వాడటం వంటి అదనపు ఖర్చులు నిలిపివేయాలని నిర్ణయించారు. ఏ అమ్మాయి అయినా కుటుంబం అనుమతి లేకుండా వివాహం చేసుకుంటే అది నేరంగా పరిగణిస్తామని గ్రామస్తులు తీర్మానించారు. ఠాకూర్ సంఘం నాయకుడు మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్పేష్ ఠాకూర్ మాట్లాడుతూ... ‘వివాహాలలో ఖర్చులను తగ్గించడం వంటి కొన్ని నియమాలు బాగున్నాయి. టీనేజ్ అమ్మాయిలకు మొబైల్ ఫోన్లు అనుమతించనట్లే, అబ్బాయిల గురించి కూడా ఒక నియమం చేసుంటే బాగుండేది. నా వివాహం కూడా ప్రేమ వివాహం అయినందున ప్రేమ వివాహాలపై నియమాల గురించి నేను ఏమీ చెప్పలేను. మన దేశ రాజ్యాంగ నిబంధనలు అందరికీ వర్తిస్తాయ’ని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment