
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఇంటినుంచి పారిపోయిన ఓ వివాహితను తన భర్తను భుజాలపై మోస్తూ నడిచేలా అక్కడ గ్రామస్తులు శిక్ష విధించారు. ఆమె వస్త్రాలను లాగడం వంటి చర్యలతో ఘోరంగా అవమానిం చారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో శనివారం రావడంతో పోలీసులు చర్యలు చేపట్టి ఇద్దరిని అరెస్టు చేశారు. ఝభువా జిల్లా దేవిగడ్‌కు చెందిన 27 ఏళ్ల వివాహిత తాను ప్రేమించిన వ్యక్తితో కలిసి రెండు వారాల క్రితం గుజరాత్‌కు పారిపోయింది. అత్తింటివారు ఆమెను కనిపెట్టి స్వగ్రామానికి తీసుకొచ్చారు. భర్తను వదిలేసి ప్రియుడితో పారిపోయినందుకు ఆమెను అవమానిం చారు. భర్తను భుజాలపై మోస్తూ నడవాల్సిందిగా శిక్ష విధించారు. ఎంతో కష్టంతో ఆమె నడుస్తుండగా ఆకతాయిలు ఆమె ముందు చేరి ఈలలు వేస్తూ, గోల చేశారు. ఇలాంటి ఘటనలు అమానవీయమని ఝభువా జిల్లా ఎస్పీ వినీత్ జైన్ అన్నారు. ఘటన సమయంలో ఆ ప్రదేశంలో ఉన్న వారినందరినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకురావాల్సిందిగా తాను ఇప్పటికే ఆదేశించానని ఆయన తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 12 మందిపై కేసు నమోదు చేశామనీ, ఇద్దరిని అరెస్టు చేశామని అదనపు ఎస్పీ విజయ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment