'నన్ను బలవంతంగా తీసుకెళ్తున్నారు'
హాత్రాస్: ఉత్తరప్రదేశ్ లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన 26 ఏళ్ల యువతి తాను చనిపోవడానికి ముందు రికార్డు చేసిన వీడియో బయటపడడంతో కలకలం రేగింది. హాత్రాస్ జిల్లాలో యువతి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. అనారోగ్యం కారణంగా ఆమె భావించిందని అంతా అనుకున్నారు. అయితే చనిపోవడానికి ముందు రైలు వాష్రూమ్ లో సెల్ఫోన్ లో ఆమె రికార్డు చేసిన వీడియో ఇంటర్నేట్ లో ప్రత్యక్షమైంది.
'నేను మేజర్ని. ప్రేమించినవాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. కానీ మా నాన్న, సోదరుడు, బంధువులు ఒప్పుకోవడం లేదు. నన్ను చంపేందుకు బలవంతంగా మా ఊరికి తీసుకెళుతున్నారు. నాకేదైనా జరిగినా.. నేను చనిపోయినా మా నాన్న, సోదరుడు, బంధువులదే బాధ్యత'ని వీడియోలో ఆమె పేర్కొంది. ఈ వీడియో ఆధారంగా నిందితులపై కేసు నమోదు చేసినట్టు హాత్రాస్ ఎస్పీ అజయపాల్ శర్మ తెలిపారు. తమ కుమార్తె అనారోగ్యంతో చనిపోయిందని చెప్పి, గుట్టుగా అంత్యక్రియలు చేశారు.
ఈ వ్యవహారం అనుమానాస్పదంగా ఉందని పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాతే పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులు ముంబైలో నివసిస్తున్నారు. ఆమెను చంపేందుకే వారి స్వగ్రామానికి వచ్చినట్టు తెలుస్తోంది. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.