చెన్నై: కన్నకూతురిపైనే లైంగిక దాడికి పాల్పడి ఆమె గర్భవతి కావడంతో హత్య చేసిన మాజీ సైనికుడికి రెండు యావజ్జీవ శిక్షలతో పాటు మరో 27 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కన్యాకుమారి జిల్లా నాగర్‌కోవిల్ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా అరుమలై అంబలకడైకి చెందిన బ్రూస్‌వెల్ట్ (48) మాజీ సైనికుడు. మొదటి భార్య చనిపోవడంతో ఐడా సెల్వకుమారిని రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య కుమార్తె, పదో తరగతి విద్యార్థిని షెర్లీ జాస్మిన్ (16) వీరితోనే కలసి ఉండేది. అయితే 2010 మే 29న జాస్మిన్ ఇంట్లోనే నీటితొట్టెలో శవమై కనిపించింది. పోస్టుమార్టంలో ఆమె ఐదు నెలల గర్భవతి అని తేలడంతో.. అనుమానంతో బ్రూస్‌వెల్ట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది.
కుమార్తెపైనే బ్రూస్‌వెల్ట్ లైంగికదాడికి పాల్పడటంతో ఆమె నెలతిప్పింది. విషయం బయటకు తెలిస్తే పరువుపోతుందని బ్రూస్‌వెల్ట్ కుమార్తెను హత్య చేసి నీటితొట్టిలో పడేశాడు. నాగర్‌కోవిల్ మహిళా కోర్టు న్యాయమూర్తి ముత్తు శారద 33 మంది సాక్షులను విచారించి.. బ్రూస్‌వెల్ట్‌కు రెండు యావజ్జీవ శిక్షలు, మరో 27 ఏళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పారు. బలాత్కారం చేసిన నేరానికి ఒక యావజ్జీవం, హత్యానేరానికి మరో యావజ్జీవ శిక్ష, కుమార్తెపై లైంగికదాడికి పాల్పడిన నేరానికి పదేళ్ల జైలు, సాక్ష్యాలను రూపుమాపిన నేరానికి 7 ఏళ్ల జైలు శిక్ష, కుమార్తె గర్భంలోని శిశువును హత్యచేసిన నేరానికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించారు.
కూతురిని హత్యచేసిన తండ్రికి డబుల్ యావజ్జీవం
Published Fri, Aug 8 2014 9:50 PM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM
Advertisement
Advertisement