నాలుగో రోజూ ‘హెరాల్డ్’ దే! | Fourth day also debate on National Herald | Sakshi
Sakshi News home page

నాలుగో రోజూ ‘హెరాల్డ్’ దే!

Published Sat, Dec 12 2015 2:10 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

నాలుగో రోజూ ‘హెరాల్డ్’ దే! - Sakshi

నాలుగో రోజూ ‘హెరాల్డ్’ దే!

రాజ్యసభను సాగనివ్వని కాంగ్రెస్
♦ రాహుల్‌పై బీజేపీ సభ్యుడి వ్యాఖ్యలపై లోక్‌సభలో విపక్షం వాకౌట్
♦ జూలో జంతువుల్లా అరుస్తున్నారు.. కాంగ్రెస్ సభ్యులపై నఖ్వీ విసుర్లు

 న్యూఢిల్లీ: పార్లమెంట్లో ‘నేషనల్ హెరాల్డ్’ కేసు ప్రకంపనలు శుక్రవారం కూడా కొనసాగాయి. తమ అధినేతలకు ఆ కేసులో సమన్లు జారీ కావడంపై కాంగ్రెస్ సభ్యులు వరుసగా నాలుగో రోజూ రాజ్యసభను స్తంభింపజేశారు. ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభాకార్యక్రమాలను అడ్డుకోవడంతో రాజ్యసభ పలుమార్లు వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి ‘మోదీ.. నీ నియంతృత్వం చెల్లదు.. నీ హిట్లర్‌గిరీ చెల్లదు’ అంటూ సభను నినాదాలతో హోరెత్తించారు. ఇంధన రంగంపై స్థాయి సంఘం నివేదికను సభకు సమర్పించాల్సి ఉన్న కాంగ్రెస్ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్.. వెల్ వద్ద నిరసన తెలుపుతూ ఆ నివేదికను సమర్పించేందుకు నిరాకరించారు.

గందరగోళం మధ్యనే పార్లమెంట్‌పై ఉగ్రవాద దాడి జరిగి 14 ఏళ్లు అయిన విషయాన్ని సభ చైర్మన్ హమీద్ అన్సారీ ప్రస్తావించారు. అలాగే, అవినీతి నిరోధక బిల్లు-2013ను సెలక్ట్ కమిటీకి నివేదించాలన్న తీర్మానాన్ని సభ ఆమోదించింది. సభలో కాంగ్రెస్ సభ్యులు కేకలు వేస్తుండటంపై వారిని వారించిన డెప్యూటీ చైర్మన్ పీజే కురియన్.. అలా కేకలు వేయడం మనుషుల లక్షణం కాదని వ్యాఖ్యానించారు. ‘జంతు ప్రదర్శన శాలలో వినిపించే శబ్దాలు ఈ రోజు సభలో వినిపిస్తున్నాయ’ని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఎద్దేవా చేశారు. ‘వారం క్రితం నినాదాలు చేశారు. ఇప్పుడు కేకలు మాత్రమే వేస్తున్నారు. వారి గొంతు ఆరోగ్యంపై మేం ఆందోళన చెందుతున్నాం. ప్రతిపక్ష నేత వారి గొంతులు బాగుపడేలా మెడిసిన్స్ తెప్పించాలి’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

నేషనల్ హెరాల్డ్ కేసు వల్ల పార్లమెంటును కాంగ్రెస్ కావాలనే అడ్డుకుంటోదన్న అభిప్రాయం కలిగేలా ప్రభుత్వం ప్రచారం చేస్తోందని రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ ఆరోపించారు. ‘మా నిరసన కోర్టులో ఉన్న నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించింది కాదు. ఈ విషయం గతంలో కూడా వివరణ ఇచ్చాను. అయినా మీడియా పట్టించుకోవడం లేదు. కేంద్రమంత్రి వీకే సింగ్ చేసిన ‘కుక్క’ వ్యాఖ్య వల్ల రెండు రోజులు సభ స్తంభించింది. ఇతర కారణాల వల్ల మూడు రోజులు నిరసనలు చోటు చేసుకున్నాయి’ అని ఆజాద్ వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ సభ్యుల నినాదాల నేపథ్యంలో ఉదయం 11.30 గంటలకు ఒకసారి, 12 గంటలకు ఒకసారి సభను వాయిదా వేశారు.

ఆ తరువాత చైర్మన్ హమీద్ అన్సారీ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించేందుకు విఫలయత్నం చేశారు. గందరగోళం మధ్యనే మంత్రులు రెండు, మూడు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో సభను వాయిదా వేశారు. కాగా, మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో సభలో ఎస్సీ, ఎస్టీ(వేధింపుల నిరోధక) సవరణ బిల్లు 2015ను, జువనైల్ జస్టిస్ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే, శుక్రవారం సాయంత్రం సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు సభ్యులు టికెట్లు రిజర్వ్ చేసుకుని ఉంటారని, అందువల్ల శుక్రవారం సాయంత్రం 5 దాటిన తరువాత సభను కొనసాగించడం కుదరదు కనుక ఆ బిల్లులను ప్రవేశపెట్టకూడదంటూ విపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది.

 లోక్‌సభలో.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై బీజేపీ సభ్యుడు వీరేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం లోక్‌సభలో దుమారం చెలరేగింది. వీరేంద్ర సింగ్ క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆ సభ్యుడిని సస్పెండ్ చేయాలంటూ కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. ఆ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదంటూ తప్పించుకుంటే సరిపోదని తేల్చిచెప్పారు. వీరేంద్రసింగ్ నుంచి క్షమాపణ చెప్పించే విషయంలో ప్రభుత్వం లేదా స్పీకర్ నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో టీఎంసీ, ఆర్జేడీ, జేడీయూ సభ్యులతో కలిసి వాకౌట్ చేశారు. సభ ప్రారంభం కాగానే ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ, ప్లకార్డులతో కాంగ్రెస్ సభ్యులు వెల్‌ను చుట్టుముట్టారు. అయితే స్పీకర్ సుమిత్ర మహాజన్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించారు.

జీరో అవర్‌లో లోక్‌సభలో కాంగ్రెస్ నేత ఖర్గేకు మాట్లాడే అవకాశమిచ్చారు. రాహుల్‌తో పాటు, నెహ్రూ, గాంధీ కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వీరేంద్రసింగ్ విచారం వ్యక్తం చేయడం కానీ, క్షమాపణ చెప్పడం కానీ చేయకపోవడాన్ని ఖర్గే తప్పుబట్టారు. వీరేంద్రతో క్షమాపణ చెప్పిస్తే.. సభ సజావుగా సాగుతుంది కదా!  అని  టీఎంసీ సభ్యుడు సుదీప్ సూచించగా.. ‘ఆ గ్యారంటీ మీరివ్వగలరా?’ అంటూ కాంగ్రెస్ సభ్యులపై స్పీకర్ మండిపడ్డారు. తర్వాత టీఎంసీ, ఆర్జేడీ, జేడీయూ సభ్యులతో కలిసి కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు.  హెరాల్డ్ కేసును పీఎంఓ ప్రేరేపితమని, దీన్ని న్యాయమార్గంలో ఎదుర్కొంటామని రాహుల్ గువాహటిలో అన్నారు.
 
 పార్లమెంటు సమాచారం
 8 చెక్ జారీ అయిన దగ్గర కాకుండా, దాన్ని నగదుగా మార్చుకునే చోటే చెక్ బౌన్స్ కేసులను నమోదు చేయాలన్న బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్(సవరణ) బిల్లును లోక్‌సభ గతంలోనే ఆమోదించినప్పటికీ.. గతవారం రాజ్యసభ కొన్ని మార్పులతో తిరిగి పంపడంతో శుక్రవారం మళ్లీ ఆమోదం తెలిపింది. చెక్ జారీ చేసిన బ్రాంచ్ ఉన్న ప్రాంతంలోనే చెక్ బౌన్స్ కేసు వేయాలంటూ గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దేశవ్యాప్తంగా 18 లక్షల చెక్ బౌన్స్ కేసులున్నాయి. 8గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపేయాలని బీజేడీ సభ్యులు డిమాండ్ చేశారు.

ఈ ప్రాజెక్టు కారణంగా ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో ఉన్న అనేక గిరిజన ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని బీజేడీ సభ్యుడు భర్తృహరి మహతాబ్ ఆందోళన వ్యక్తం చేశారు.  8 84 నుంచి సియాచిన్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఇతర కారణాలతో 869 మంది సైనికులు మృత్యువాత పడ్డారని రక్షణ శాఖ సహాయమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ సభకు తెలిపారు. 8 కశ్మీరీ పండిట్లకు తక్షణ పునరావాసానికి సంబంధించిన తీర్మానాన్ని లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. పీఓకేకు వలసవెళ్లిన వారికీ ఈ పునరావాస పథకం వర్తిస్తుంది. 8 14 ఏళ్ల క్రితం పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి పార్లమెంటు ఉభయసభలు శుక్రవారం నివాళులర్పించాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై పోరులో నిబద్ధతను పునరుద్ఘాటించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement