కోజికోడ్/కేరళ: ప్రాణాంతక నిపా వైరస్ బారిన పడి కేరళలో మరో వ్యక్తి మరణించాడు. ఇప్పటికే అదే కుటుంబంలోని ముగ్గురు నిపా వైరస్ సోకి చనిపోగా గురువారం వీ.మూసా (61) అనే వృద్ధుడు చికిత్స పొందుతూ కోజికోడ్ ఆస్పత్రిలో గురువారం ప్రాణాలు విడిచాడు. మెదడు పనితీరుపై ప్రభావం చూపి ప్రాణాలు తోడేసే ఈ వైరస్ బారిన పడి కేరళలో మరణించిన వారి సంఖ్య 12కి చేరింది. ఒకే కుటుంబంలోని నలుగురు ఈ కారణంగా చనిపోవడంతో మూసా కుటుంబం నివాసముంటున్న కోజికోడ్ పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
నిపా వైరస్ ప్రధానంగా గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుందని వైద్యాధికారులు చెప్తున్నారు. మూసా ఇంటి పరిసరాల్లో గల పాడుబడిన బావిలో చనిపోయిన గబ్బిలాలు పదుల సంఖ్యలో పడి ఉన్నాయని కేరళ వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. బహుశా ఈ బావిలోని గబ్బిలాల ద్వారానే నిపా వైరస్ వ్యాపించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, వ్యాధికి గురైన మూసా, అతని ఇద్దరి కుమారులు, సోదరికి చికిత్సనందిస్తూ నర్సు లినీ సోమవారం మృతిచెందిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment